Tdp ,trs – టీడీపీ నుంచి వచ్చిన ఆ నలుగురి పరిస్థితి ఏంటీ…?

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వెళ్లిన కొంతమంది పరిస్థితిపై ఇప్పుడు ఆసక్తికర చర్చలు మొదలయ్యాయి. రాజకీయంగా టిఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది అనే కారణంతో తెలుగుదేశం పార్టీ నుంచి కొంతమంది నాయకులు అధికార పార్టీలో జాయిన్ అయ్యారు. అందులో తెలుగుదేశం పార్టీలో కీలక పదవులు నిర్వహించిన నాయకులు, చిన్న చిన్న పదవులు నిర్వహించిన నాయకులు, గతంలో మంత్రిగా పనిచేసిన వారు కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీలో సీఎం కేసీఆర్ వాళ్లకు ఏ ప్రాధాన్యత ఇస్తారు, వాళ్ళు పోషించబోయే పాత్ర ఏంటి అనే దానిపై అభిమానుల్లో ఆందోళన మొదలైంది.

దాదాపుగా గత ఐదేళ్ళ కాలంలో పలువురు కీలక నాయకులు తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వెళ్లి టిఆర్ఎస్ పార్టీలో పదవులు ఆశించి ఎదురు చూస్తున్నారు. అందులో ప్రధానంగా తెలుగుదేశం పార్టీ నుండి బీజేపీ లోకి వెళ్లి, ఆ తర్వాత టీఆర్ఎస్ లోకి వెళ్ళిన మోత్కుపల్లి నరసింహులు… అలాగే టిడిపి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన ఎల్ రమణ… మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి… ఖమ్మం జిల్లాకు చెందిన తుమ్మల నాగేశ్వరరావు ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

తెలుగుదేశం పార్టీ నుంచి నేరుగా బీజేపీ లోకి వెళ్ళిన పెద్దిరెడ్డి ఆ తర్వాత టిఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. హుజూరాబాద్ నియోజకవర్గం లో ఆయన బీజేపీ తరపున వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని ప్రయత్నాలు చేసి నియోజకవర్గంలో కాస్త గట్టిగానే కష్టపడ్డారు. అయితే అనూహ్యంగా టిఆర్ఎస్ పార్టీ నుంచి ఈటెల రాజేంద్ర బయటకు రావడం బీజేపీలోకి వెళ్లడంతో ఆయన టిఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. టిఆర్ఎస్ పార్టీ నుంచి హుజురాబాదు నియోజకవర్గంలో సీటు వస్తుందని లేకపోతే కనీసం ఎమ్మెల్సీ పదవి వస్తుందని ఆయన ఆశించారు.

కానీ సీటు రాకపోవడంతో పెద్దిరెడ్డి పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా తయారైంది. ఇటీవల ప్రకటించిన ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాలో కూడా పెద్దిరెడ్డి  పేరు లేకపోవడంతో ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఎల్.రమణ విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీ నుంచి హుజురాబాదు ఎన్నికలకు ముందు టిఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయి నియోజకవర్గం సీటు ఆశించారు. కనీసం సీట్ రాకపోయినా ఈయనకు కూడా ఎమ్మెల్సీ వస్తుందని ఆయన అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

సామాజిక వర్గాల లెక్కలు వేసుకుని ఎల్.రమణను టీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇపుడు ఆయన విషయంలో ఏ మాత్రం కూడా పట్టించుకునే పరిస్థితి కనబడటం లేదు. దీంతో ఆయన ఏం చేస్తారు ఏంటనే దానిపై ఆయనను నమ్ముకున్న వాళ్ళ లో స్పష్టత రావడం లేదు. ఇక మోత్కుపల్లి నర్సింహులు పరిస్థితి అటు బిజెపి లో ఇటు టీఆర్ఎస్ పార్టీలో ఒకే రకంగా ఉంది. హుజురాబాద్ ఎన్నికలకు ముందు మోత్కుపల్లి నరసింహులు టిఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయి, సీఎం కేసీఆర్ ను ఒక రేంజ్ లో పొగడటం మొదలు పెట్టారు.

దళిత బంధు కి సంబంధించి భారతీయ జనతా పార్టీని గట్టిగానే టార్గెట్ చేస్తూ ఆయన విమర్శలు కూడా చేశారు. ఈ నేపథ్యంలోనే హుజురాబాద్ ఎన్నికల తర్వాత ఆయనకు ఎమ్మెల్సీ సీటు వస్తుందని కొందరు భావించారు. కానీ సీఎం కేసీఆర్ ఆయనను ఏ పదవికి ఎంపిక చేయక పోవడంతో ఆయన రాజకీయ భవిష్యత్తు ఏంటి అనేది ఆయన అభిమానులకు క్లారిటీ రావడం లేదు. ఇక తెలుగుదేశం పార్టీలో కీలక పదవులు నిర్వహించి టిఆర్ఎస్ పార్టీలో జాయిన్  అయిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిస్థితి కూడా దాదాపు అదే విధంగా ఉంది.

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఆయనకు సీటు వస్తుందని ఆయన అభిమానులు ఖమ్మం జిల్లాలో గంపెడు ఆశలు పెట్టుకున్నారు. రాజ్యసభకు పొంగులేటి శ్రీనివాస రెడ్డి ని సీఎం కేసీఆర్ పంపిస్తే, తుమ్మల నాగేశ్వరరావు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం దక్కే అవకాశం ఉంటుంది. ఒకవేళ అది జరగకుండా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం జిల్లాలో ఖాళీగా ఉన్న ఒక ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేస్తే మాత్రం ఖచ్చితంగా తుమ్మల నాగేశ్వరరావు, ఇప్పట్లో పదవికి నోచుకోనే అవకాశాలు దాదాపుగా లేకపోవచ్చు. దీంతో సీఎం కేసీఆర్ ని నమ్ముకున్న ఈ నలుగురి పరిస్థితి ఏంటి అనే దానిపైనే ఆ పార్టీలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి.

Show comments