అగ్గిరాజేస్తున్న అగ్నిపథ్ స్కీమ్.. అగ్నిపథ్ పై యువతకు ఎందుకింత ఆగ్రహం ?

త్రివిధ దళాల్లో సైనిక నియామకాల కోసం మంగళవారం కేంద్రప్రభుత్వం “అగ్నిపథ్” పథకం ప్రకటించింది. దీనిపై దేశంలోని పలు రాష్ట్రాల్లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అగ్నిపథ్ ద్వారా నాలుగేళ్ల సర్వీస్ ఇస్తామని చెప్పి కేంద్రం తమను పిచ్చివాళ్లను చేస్తోందని, ఆర్మీ రిక్రూట్ మెంట్ కోసం సన్నద్ధమవుతున్న యువత మండిపడుతోంది. ముఖ్యంగా ఝార్ఖండ్, బీహార్ రాష్ట్రాల్లో యువత కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. నాలుగేళ్ల తర్వాత తమ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తోంది. బీహార్ లోని ముజఫర్ పూర్, బక్సార్, బెగూసరాయ్ లో యువకులు.. నాలుగేళ్ల సర్వీసు తర్వాత ఇతర ఉద్యోగాల కోసం మళ్లీ చదువుకొని పోటీ పడాల్సిన పరిస్థితిని కేంద్రం కల్పిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అగ్నిపథ్ పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇలా ట్వీట్ చేశారు. “భారత్ కు రెండు వైపులా ముప్పు పొంచిఉన్న సమయంలో.. కేంద్రం అగ్నిపథ్ పేరుతో నియామకాలు చేపట్టడం సాయుధ బలగాల నిర్వహణ సామర్థ్యాన్ని బలహీనపరుస్తోంది. భారత ఆర్మీ గౌరవం, సంప్రదాయం, పరాక్రమం, క్రమశిక్షణ విషయంలో రాజీపడటాన్ని బీజేపీ మానుకోవాలి.” అని ట్వీట్ లో పేర్కొన్నారు. సైనికుల సుదీర్ఘకాల సేవలు భారత ప్రభుత్వం భారంగా భావిస్తోందా ? అని ప్రియాంక గాంధీ ప్రశ్నించారు. రిటైర్డ్ మేజర్ జనరల్ బీఎస్ ధనోవా రెండు కీలక సిఫారసులతో ట్వీట్ చేశారు. కొత్తగా నియమించుకునే వారికి కనీసం ఏడేళ్లపాటు సర్వీసు ఉండేలా, 50 శాతం మందిని శాశ్వత సర్వీసుల్లోకి తీసుకునేలా చేయడం మంచిదని తెలిపారు.

అగ్నిపథ్ ద్వారా పదిహేడున్నర నుంచి 21 ఏళ్ల లోపు వయసు కలిగిన 46 వేలమందిని రిక్రూట్ చేసుకునేందుకు కేంద్రం సన్నద్ధమవుతుంది. నాలుగేళ్ల సర్వీసు కాలంలో నెలవారీ జీతం రూ.30 వేల నుంచి రూ.40 వేల మధ్య ఇవ్వనుంది. వాటితోపాటు వైద్య, భీమా సదుపాయాలు కూడా ఇవ్వనున్నారు. నాలుగేళ్ల సర్వీసు అనంతరం.. 25 శాతం మందిని మాత్రమే సైనిక ఉద్యోగాల్లోకి ఎంపిక చేస్తారు. మిగిలిన 75 శాతం మంది నాలుగేళ్ల తర్వాత రూ.11 లక్షల నుంచి రూ.12 లక్షల ప్యాకేజీతో సేవల నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. వారికి పెన్షన్ కూడా రాదు. అందుకే యువత కేంద్రం నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అగ్నిపథ్ పథకాన్ని వెనక్కి తీసుకుని.. శాశ్వత నియామకాలను చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

Show comments