Idream media
Idream media
బుజ్జాయి వెళ్లిపోయారు. వయసు మీద పడింది. బొమ్మలన్నీ పసిపాపలే. అవి చిరంజీవులే. దేవులపల్లి కృష్ణశాస్త్రికి రెండే వ్యసనాలు. ఒకటి కవిత్వం, రెండు కన్నకొడుకు.
కొడుకుని వదిలి వుండలేని ఆ తండ్రి, పసివాడిని స్కూల్‌కి కూడా పంపకుండా వెంటపెట్టుకుని తిరిగాడు. సంచారమే విద్యాభ్యాసమని అపుడు ఆ ఇద్దరికీ తెలియదు. బుజ్జాయిని అక్షరాల కంటే రంగులు ఆకర్షించాయి. భారతదేశ కామిక్స్‌కి మూల పురుషుడయ్యాడు.
కృష్ణశాస్త్రి కొడుకుగా కీర్తి కోరుకోలేదు. ‘నేను–నాన్న’ పుస్తకాన్ని అద్భుతంగా రాశాడు. చదువుతుంటే కళ్లు తడుస్తుంటాయి. గొప్ప రచయితని ఎప్పుడూ చెప్పుకోలేదు. కార్టూన్ ప్రపంచంలో నెంబర్‌వన్, భారతదేశంలోని ప్రతి పిల్లవాడు ఆయన బొమ్మలు చూసే వుంటాడు. ఎప్పుడూ సన్మానాలు, సత్కారాల కోసం ఆశించలేదు. ఒక యోగిలా జీవించి, మరణించాడు బుజ్జాయి.
నిజానికి ఆయన తండ్రి కృష్ణశాస్త్రి మరణించినపుడు మాయమైంది దేహం మాత్రమే. ఇపుడు ఆత్మకూడా వెళ్లిపోయింది.
టార్జాన్ బొమ్మలతో ప్రేరణపొందిన బుజ్జాయి, తొలిసారిగా బానిసపిల్ల అనే కామిక్ పుస్తకానికి బొమ్మలేశాడు. 1945లో వచ్చిన ‘సలోమి వేర్ షి డాన్స్‌డ్’ హాలీవుడ్ సినిమా ఈ కథకి ఆధారం. ఆ పుస్తకంతో పత్రికల ఆఫీస్‌కి వెళితే, భారతదేశ కథాంశంతో బొమ్మలు గీయమని సలహా ఇచ్చారు. ఇదంతా 1947 నాటిమాట.
బుజ్జాయి చిన్నపిల్లాడు కదా, కోపమొచ్చింది. సొంతంగా ప్రింట్ చేసుకున్నాడు. అలా మొదటి తెలుగు కామిక్ కాదు, ఇండియా తొలి కామిక్ బుక్ పుట్టింది.
మంత్రగాడు, గుర్రాలు, రాకుమారులు, సౌందర్యరాశులు, ఒంటెల బిడారు, పులులు, సింహాలు, రంగురంగుల రూపాల్లో మనముందు నిలబడ్డాయి.
బుజ్జాయి, ఆయన సృష్టించిన డుంబు మనకి ఇంటింటి పరిచయస్తులు, స్నేహితులయ్యారు. 1964లో ఇండియా బుక్ హౌస్ అమర్ చిత్రకథకి ఆయన బొమ్మలే ప్రాణం.
దేవులపల్లి సుబ్బరాయశాస్త్రి (బుజ్జాయి) జీవించే వుంటారు. ప్రాణం పోసుకున్న ఆయన బొమ్మలు, పసిపిల్లలతో మాట్లాడుతూ వున్నంతకాలం చిరంజీవే!