UP Elections, CEC Sushil Chandra – పార్టీలకు ఆ చింత తీరింది

కరోనా కేసులు పెరుగుదల, నూతన వేరియంట్‌ ఒమిక్రాన్‌ వ్యాప్తి నేపథ్యంలో 2024 సాధారణ ఎన్నికలకు సెమీఫైనల్ గా భావిస్తున్న ఉత్తరప్రదేశ్‌ ఎన్నికలు షెడ్యూల్‌ ప్రకారం జరుగుతాయా..? లేదా..? అనే సందేహాలుకు తెరపడింది. ఒమిక్రాన్‌ వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో.. ఇటీవల అలహాబాద్‌ హైకోర్టు కేంద్ర ఎన్నికల సంఘం, ప్రధాని నరేంద్ర మోదీలకు ఎన్నికల నిర్వహణపై కీలక సూచనలు చేసింది. వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఎన్నికలను కొంత కాలం వాయిదా వేయాలనే సలహాను ఇచ్చిన తర్వాత.. ఉత్తరప్రదేశ్, పంజాబ్‌తో సహా ఐదు రాష్ట్రాల శాసన సభ ఎన్నికలు అనుకున్న సమయంలో జరుగుతాయా..? లేదా..? అనే సందేహాలు మొదలయ్యాయి. 

ఈ అనుమానాలకు కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా తెరదించింది. ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ సుశీల్‌ చంద్ర మూడు రోజుల పాటు ఉత్తరప్రదేశ్‌లో పర్యటించారు. అనంతరం ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణపై కీలక ప్రకటన చేశారు. ఎన్నికలను షెడ్యూల్‌ ప్రకారమే నిర్వహించాలని అన్ని రాజకీయ పార్టీలు తమను కోరాయని చెప్పిన సుశీల్‌ చంద్ర, ఆ మేరకు ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. కోవిడ్‌ నిబంధనలకు అనుగుణంగానే ఎన్నికలను నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు.

Also Read : మహిళల ఆర్థిక ప్రయోజనాల కోసమేన‌ట‌..

ఉత్తరప్రదేశ్‌ ఓటర్ల జాబితాను జనవరి ఐదవ తేదీన ప్రచురిస్తామని సుశీల్‌ చంద్ర తెలిపారు. వృద్ధులు, వికలాంగులు, కరోనా పాజిటివ్‌ వ్యక్తులకు బ్యాలెట్‌ ద్వారా ఓటు వేసే అవకాశం కల్పిస్తామన్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్‌ నిర్వహిస్తామని సుశీల్‌ చంద్ర చెప్పారు. ఎన్నికలను అత్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రతి బూత్‌లోనూ వీవీప్యాట్లు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్ష పోలింగ్‌ బూత్‌లలో పోలింగ్‌ ప్రక్రియను లైవ్‌ వెబ్‌కాస్టింగ్‌ ద్వారా పర్యవేక్షించనున్నట్లు చెప్పిన సుశీల్‌ చంద్ర.. ఉత్తరప్రదేశ్‌ ఎన్నికలకు తాము సర్వం సిద్ధం చేస్తున్నట్లు స్పష్టతనిచ్చారు.

2024లో తిరిగి కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో గెలవడం ద్వారానే సాధ్యమవుతుందని బీజేపీ గట్టిగా నమ్ముతోంది. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని యోగి ప్రభుత్వం తిరిగి అధికారాన్ని నిలబెట్టుకునేందుకు శాయశక్తులా పని చేస్తోంది. వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి యోగిలు శంకుస్థాపనలు చేస్తున్నారు. అదే సమయంలో ఈ సారి అధికారం చేజిక్కించుకునేందుకు ఎస్‌పీ, ఉనికిని బలంగా చాటుకునేందుకు కాంగ్రెస్, బీఎస్పీలు తమ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి.

2017లో జరిగిన ఎన్నికల్లో 403 సీట్లు ఉన్న ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ 312 సీట్లు గెలుచుకుని తిరుగులేని శక్తిగా ఎదిగింది. ప్రధాన ప్రతిపక్షం ఎస్పీ 47, బీఎస్పీ 19, కాంగ్రెస్‌ పార్టీలు 7 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగాయి. ఈ సారి ఉత్తరప్రదేశ్‌ పగ్గాలు ఎవరికి దక్కుతాయో మరో మూడు నెలల్లో తేలిపోతుంది.

Also Read : ఒమిక్రాన్ ఎఫెక్ట్ : వర్చువల్ ప్ర‌చారం మాత్ర‌మే..?

Show comments