మహారాష్ట్ర రాజకీయాలు పూటకో మలుపు తిరుగుతున్నాయి. ఎన్సీపీ నేత శరద్ పవార్ నేరగా ఉద్ధవ్ ఠాక్రేను కలిసిన కొద్ది సేపటికే అధికారిక బంగ్లాను ఖాళీ చేశారు ఉద్ధవ్. తాజా పరిణామాలతో అవసరమైతే తాను సీఎం పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు ఉద్ధవ్. ఆ మాట చెప్పిన కొద్ది గంటల్లోనే ‘వర్ష’ బంగ్లా నుంచి సూట్ కేసులతో సహా బయటకు వచ్చిన ఉద్ధవ్, తన సొంతిల్లు ‘మాతోశ్రీ’కి వెళ్ళిపోయారు.
స్థానికంగా రాజకీయాలు వేడెక్కడంతో శివసేన కార్యకర్తలు సీఎం భారీగా తరలి వచ్చారు. దారి పొడుగునా వేలాది మంది కార్యకర్తలు ఉద్దవ్ ఠాక్రేకు మద్దతు ప్రకటించారు. కరోనా సోకినప్పటికీ మరో ఆలోచన లేకుండా అధికారిక నివాసాన్ని ఖాళీ చేశారు. అయితే, ఏక్ నాథ్ షిండే జట్టులోకి మరో ముగ్గురు శివసేన ఎమ్మెల్యేలు చేరారు. శివసేనకు 55 ఎమ్మెల్యేలు ఉండగా తాజా చేరికతో 33 మంది షిండే క్యాంపులోకి వచ్చినట్లైంది.
తాజా పార్టీ ఫిరాయింపులతో అనర్హత వేటు పడుతుందా అంటే, ఎక్కువ శాతం ఆ అవకాశం లేదనే అంటున్నారు. ఫిరాయింపుల చట్టం పరిధిలోకి రాకుండా ఇంకొంత మంది ఎమ్మెల్యేలు ఏక్ నాథ్ క్యాంపులోకి వస్తే సదరు ఎమ్మెల్యేలు అనర్హత వేటును తప్పించుకోగలరు. ఇదే గనుక జరిగితే శివసేన రెబల్ వర్గంతో కలిసి బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆస్కారం ఉంది. ఇంత జరిగాక సీఎం పదవి ఎవర్ని వరిస్తుందనేదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.