iDreamPost
iDreamPost
నేతాజీ సుభాష్ చంద్రబోస్.. గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడు.. అహింసావాదంతో గాంధీజీ సాగిస్తున్న స్వాతంత్య్ర ఉద్యమంతోనే స్వరాజ్యం రాదని, పోరుబాట పట్టిన మహా మేధావి సుభాష్ చంద్రబోస్. దేశం ఆయన 123వ జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న వేళ ఇప్పటికీ ఆయన మరణం ఓ మిస్టరీగానే ఉంది.
జనవరి 23, 1897 న ఒడిషాలోని కటక్‌లో సుభాష్ చంద్రబోస్ జన్మించారు. తల్లిదండ్రులిద్దరి నుంచి జాతీయవాదాలు పుణికిపుచ్చుకున్న బోస్ ప్రజల గురించే ఆలోచించేవారు. అఖిల భారత సర్వీసు పరీక్షలైన సివిల్స్ రాసి నాల్గవ ర్యాంకు సాధించిన బోస్ ఏడాది తిరగకుండానే సివిల్ సర్వీస్ నుంచి బయటికొచ్చి స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారు. భారత జాతీయ యువజన కాంగ్రెస్ నుంచి ప్రారంభమైన ఆయన పాత్ర ఎన్నో పోరాటాలతో భారతదేశ స్వతంత్ర అధ్యయంలో లిఖించబడే దాకా సాగింది. గాంధీజీతో సహా నాయకులంతా అహింసతోనే స్వరాజ్యం వస్తుందని నమ్మతున్న తరుణంలో బోస్ సాయుధ పోరాటం తప్పదని ముందుకు నడిచాడు. సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టడంలో తనదైన పాత్రను పోషించారు.
భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి రెండు సార్లు అధ్యక్షుడిగా ఎన్నికైన సుభాష్ చంద్రబోస్ గాంధీజీతో అభిప్రాయ బేధాల వల్ల ఆ పదవిలో కొనసాగలేదు. ఈ నేపథ్యంలో ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ అనే పార్టీ స్థాపించాడు. అప్పట్లో బోస్‌ను ఆంగ్లేయులు దాదాపు 11 సార్లు జైళ్లో బంధించారు. 1939లో రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో రష్యా, జర్మనీ, జపాన్ దేశాల్లో పర్యటించి భారత జాతీయ సైన్యాన్ని ఏర్పాటుచేయడంలో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత జపాను ప్రభుత్వ సహకారంతో సింగపూర్‌లో ఆజాద్ హింద్ ప్రభుత్వాన్ని బోస్ ఏర్పాటుచేశారు. అయితే సుభాష్ చంద్రబోసు రాజకీయ అభిప్రాయాలు, జర్మనీ మరియు జపానుతో అతని మిత్రత్వంపై చరిత్రకారుల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. కొందరు వీటిని విమర్శిస్తే, మరి కొందరు వాస్తవిక దృష్టితో చేసిన ప్రయత్నాలుగా బోసును అభిమానిస్తారు.
అయితే బోస్ మరణం ఆయన జీవితంలాగే వివాదాలతో ముగిసింది. 1945 ఆగస్టు 18 లో తైవాన్లో జరిగిన విమాన ప్రమాదంలో బోసు మరిణించాడని మనందరికీ తెలుసు. అయితే ఆ విమాన ప్రమాదంలో బయటపడి బోస్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడని ఇప్పటికీ పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు ప్రతి ఏడాది ఆయన జన్మదిన, వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటున్నాయి. ఈసారి వారణాసి జిల్లాలోని ఆజాద్ హింద్ మార్గ్ వద్ద ఉన్న సుభాష్ భవన్‌లో పండుగలా బోస్ జయంతి వేడుకలు జరుగనున్నాయి.
విశాల్ భారత్ సంస్థ నిర్వహిస్తోన్న ఈ వేడుకల్లో సుభాష్ చంద్రబోస్ కు నిర్మించిన ఆలయంలో ఓ దళిత మహిళ పూజలు చేయనుంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే విశాల్ భారత్ సంస్థ నిర్వాహకుడు ప్రొఫెసర్ రాజీవ్ శ్రీవాస్తవ్ బోస్ జీవితంపై కొన్నేళ్లుగా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ఆయన ఇంటికి సుభాష్ భవన్ అని పేరుపెట్టుకున్నారంటే బోస్‌పై ఆయనకున్న అభిమానం ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఆయనే సుభాష్ చంద్రబోస్‌కు ఆలయాన్ని కట్టించారు. చరిత్ర ఏం చెప్పినా.. బోస్ మరణం ఓ మిస్టరీగా ఉండటం నిజంగా భారత ప్రజలందరినీ ఇప్పటికీ ఆలోచింపజేస్తుందనడంలో సందేహం లేదు.