BJP, Congress, Niranjan Reddy – బీజేపీలో కాంగ్రెస్‌ విలీనం ఖాయమ‌ట‌..!

తెలంగాణ పీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి వ‌చ్చాక కాంగ్రెస్ బ‌ల‌ప‌డుతోంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. రేవంత్ కూడా హ‌డావిడి చేస్తున్నారు. ఇలాంటి సంద‌ర్భంలో బీజేపీలో కాంగ్రెస్ విలీనం ఖాయ‌మంటూ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు హాట్ టాపిక్ గా మారాయి. తెలంగాణ భవన్‌లో  మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయ‌న‌.. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే కాంగ్రెస్‌ పార్టీ త్వరలోనే బీజేపీలో విలీనం కావడం ఖాయంగా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. రాష్ట్ర అభివృద్ధికి కాంగ్రెస్‌, బీజేపీ అడ్డంకిగా మారాయని, ఆ రెండు పార్టీలు కేంద్రంలో కత్తులు దూసుకుంటూ రాష్ట్రంలో ప్రేమ బాణాలు వేసుకుంటున్నాయని అన్నారు. కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు.

కొద్ది కాలంగా టీఆర్ ఎస్ కేంద్రంపై పోరాటం చేస్తోంది. వ‌డ్లు కొనాల్సిందేన‌ని ప‌ట్టుబ‌డుతోంది. మ‌రోవైపు.. రాష్ట్రంలో వ‌రిని పండించ‌వ‌ద్ద‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ రైతుల‌కు సూచించారు. ఈ మేర‌కు ప్ర‌భుత్వం ప్ర‌త్యామ్నాయ పంట‌ల‌పై ప్ర‌చారం చేస్తోంది. ఈ క్ర‌మంలో ఫామ్ హౌస్ లోని నూటా యాభై ఎక‌రాల్లో కేసీఆర్ వ‌రి పండిస్తూ, రైతుల‌ను పండించ‌వ‌ద్ద‌ని ఎలా చెబుతార‌ని రేవంత్ ఉద్య‌మానికి శ్రీ‌కారం చుట్టారు.

అలాగే.. మ‌రోవైపు బీజేపీ కూడా వ‌రి కేంద్రంగా కేసీఆర్ చేస్తున్న ఆందోళ‌న‌పై విమ‌ర్శ‌లు చేస్తోంది. ఈ క్ర‌మంలోనే నిరంజ‌న్ ఇరు పార్టీల విలీనంపై వ్యాఖ్య‌లు చేశారు. నారు పోయని, నీరు పోయని కాంగ్రెస్‌, బీజేపీ మాత్రం రైతాంగాన్ని తప్పుదోవ పట్టించే ఆలోచన చేస్తున్నాయని విమర్శించారు. రైతు బంధు, ఉచిత కరెంటు, రైతుబీమా పథకాలకు, సాగునీరు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.60 వేల కోట్లు ఖర్చు చేస్తోందని తెలిపారు.

రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే.. ఆ రెండు జాతీయ పార్టీల నాయకులు ఢిల్లీలో పోరాడాలని సూచించారు.

టీఆర్‌ఎస్‌ ఎంపీల పోరాటానికి పీసీసీ అధ్యక్షుడు ఎందుకు కలిసిరాలేదని, రాహుల్‌, సోనియా ఎందుకు కేంద్రాన్ని నిలదీయలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో బీజేపీ అరాచకాలపై యువత మౌనం వీడాలని, ఆ పార్టీ నాయకులు ఏ వేదిక వద్ద కనబడ్డా నిలదీయాలని ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్ కూడా పిలుపునిచ్చారు. సోమవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో ఒక్కరోజు కూడా లేని వ్యక్తులు ఉద్యోగాల పేరుమీద దీక్షలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలిస్తామన్న బీజేపీ ఏడేళ్లలో ఎన్ని ఉద్యోగాలిచ్చిందో, అందులో తెలంగాణకు ఎన్ని వచ్చాయో బండి సంజయ్‌ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

మొత్తంగా తెలంగాణ రాజ‌కీయాల‌ను ప‌రిశీలిస్తే.. టీఆర్ ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్.. మూడు పార్టీలు కూడా ఏదో విధంగా వార్త‌ల్లో నిలుస్తున్నాయి. చెప్పిన‌ట్లుగానే విప‌క్ష పార్టీలు ఎమ్మెల్సీ కోడ్ ముగిశాక ఆందోళ‌న‌లకు శ్రీ‌కారం చుట్టాయి. బీజేపీ నిరుద్యోగ దీక్ష చేప‌ట్ట‌గా, కాంగ్రెస్ కూడా ఆందోళ‌న‌ల‌కు శ్రీ‌కారం చుట్టింది. అంత‌కు ముందే కాంగ్రెస్ కూడా ఉద్యోగాల భ‌ర్తీకి డిమాండ్ చేస్తూ స‌భ నిర్వ‌హించింది.

Show comments