Idream media
Idream media
ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన జీవోను సవరించాలంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆదివారం కరీంనగర్‌లో జాగరణ దీక్ష చేపట్టారు. ఆ సందర్భంగా లాఠీఛార్జీలు, తోపులాటలతో ఎంపీ ఆఫీసు యుద్ధక్షేత్రాన్ని తలపించింది. కార్యాలయం లోపలి నుంచి తాళం వేసుకుని సంజయ్ దీక్షకు దిగారు. కిటికీలో నుంచి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు. తనను, టీచర్లను, కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన కేసీఆర్‌కు గుణపాఠం చెబుతామన్నారు. అనంతరం రాత్రి 9.55 సమయంలో గ్యాస్ కట్టర్లతో ప్రహరీ గేట్లను కట్‌చేసిన పోలీసులు ఎంపీ కార్యాలయం ప్రాంగణంలోనికి వెళ్లారు. అక్కడ గునపాలతో కిటికీలు, తలుపులు తెరిచారు. లోపల వందలాది మంది ఉండటంతో పోలీసులకు తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. వారిని చెదరగొట్టేందుకు కిటికీల్లోంచి వాటర్ స్ప్రేయర్లతో నీటిని పంపారు. దీంతో తడిసిన నాయకులు చెల్లాచెదురయ్యారు. …బండి సంజయ్ ను బలవంతంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
14 రోజులు జ్యుడీషియల్ కస్టడీకి
కాగా, బండి సంజయ్ బెయిల్ పిటిషన్‌ను కరీంనగర్ కోర్టు సోమవారం తిరస్కరించింది. బండి సంజయ్‌తోపాటు మరో నలుగురికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. వారిని పోలీసులు కరీంనగర్ సబ్ జైలుకు తరలించారు. రేపు మరోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. గతంలో బండి సంజయ్ పై నమోదైన 10 కేసులను పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. గతంలో సంజయ్ పై కరీంనగర్, సిరిసిల్ల, కరీంనగర్ వన్ టౌన్, టూ టౌన్, రూరల్, బోయినపల్లి, మల్యాల స్టేషన్లలో నమోదైన కేసుల వివరాలను కూడా పోలీసులు కోర్టుకు సమర్పించారు. ఇక సంజయ్ తరపు న్యాయవాదులు వేసిన బెయిల్ పిటీషన్‌ను తిరస్కరించిన కోర్టు 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆయనను పోలీసులు కరీంనగర్ జైలుకు తరలించారు.
విష ప్రయోగం ఆరోపణలు
పోలీస్ విధులకు ఆటంకం కలిగించారని గతంలో నమోదైన ఐపీసీ 353 సెక్షన్ కింద నమోదైన కేసులపై బీజేపీ లీగల్ సెల్ న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాగే బండి సంజయ్ కి ప్రభుత్వం ఫీడ్ పాయిజన్ చేయించి విష ప్రయోగం చేసే ప్రమాదం ఉందని ఆయన తరపు న్యాయవాదులు ఆరోపించారు.. అందుకోసం సంజయ్‌కి ఇచ్చే ప్రతీ ఆహారం డాక్టర్ చేత పరీక్ష చేయాలని వాదించారు. కోవిడ్ నిబంధనల ఉల్లంఘన, పోలీసుల విధులకు ఆటంకం కలిగించడంపై బండి సంజయ్ సహా మొత్తం 12 మందిపై కేసులు నమోదు అయ్యాయి.