ధరలు దిగి రావాలంటే.. జగన్ దిగిపోవాల‌ట‌..!

“జాబు కావాలంటే.. బాబు రావాలి” .. అధికారంలోకి రాక ముందు..
“ధరలు దిగిరావాలి….జగన్ దిగిపోవాలి” .. మ‌రోసారి అధికారం కోసం..

ఈ రెండూ తెలుగుదేశం పార్టీ ఇచ్చిన స్టేట్మెంట్ లే. ఇందులో మొద‌టిది స‌క్సెస్ అయింది. దాన్ని న‌మ్మి నిరుద్యోగులు చంద్ర‌బాబును అధికారంలోకి తెచ్చారు. కానీ.. త‌ర్వాత ఏం జ‌రిగిందో అంద‌రికీ తెలిసిందే. గ్రాఫిక‌ల్ పాల‌న‌పైనే దృష్టి కేంద్రీక‌రించిన చంద్ర‌బాబు ఉద్యోగాల మాట మ‌రిచిపోయారు. ఫ‌లితంగా గ‌త ఎన్నిక‌ల్లో ఘోర ఓట‌మిని మూట‌గ‌ట్టుకున్నారు. నిరుద్యోగుల‌తో పాటు, మిగిలిన యువ‌త‌, ప్ర‌జ‌లు కూడా బాబును తిరస్క‌రించారు. దీంతో రెండున్న‌రేళ్లుగా టీడీపీని, చంద్ర‌బాబును ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు. పంచాయ‌తీ, మున్సిపాల్టీ, కార్పొరేష‌న్.. ఇలా ప్ర‌తీ చోటా టీడీపీని ప్ర‌జ‌లు మ‌ర‌చిపోయార‌ని స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల ఫ‌లితాలు తెలియ‌జేస్తున్నాయి.

దీంతో ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకోవ‌డానికి చంద్ర‌బాబు ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. కానీ.. ప్ర‌ణాళికాలోపంతో బొక్క‌బోర్లా ప‌డుతున్నారు. పెట్రోలు, డీజిల్ ధ‌ర‌లు త‌గ్గించాల‌ని గ‌తంలో టీడీపీ చేప‌ట్టిన ఆందోళ‌న‌ల‌పై విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. ధ‌ర‌ల పెరుగుద‌ల‌కు ప్ర‌ధాన కార‌ణ‌మైన కేంద్రానికి వ్య‌తిరేకంగా పోరాడ‌కుండా.. వైసీపీ స‌ర్కారుపై పోరాటానికి పిలుపు ఇవ్వ‌డం విమ‌ర్శ‌ల‌కు దారి తీసింది. అలాగే ఇప్పుడు తాజాగా మ‌రో కొత్త ఆందోళ‌న‌ల‌కు చంద్ర‌బాబు పిలుపు ఇచ్చారు. టైటిల్ ఏంటో తెలుసా.. “ధరలు దిగిరావాలి….జగన్ దిగిపోవాలి”. ఈ సంద‌ర్భంగా ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధం కావాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు క్యాడర్ కు పిలుపు ఇవ్వ‌డం పిలుపు బాగానే ఉంది కానీ.. ప్ర‌తిసారీ జ‌గ‌న్ దిగిపోవాలి.. దిగిపోవాలి అన‌డం ఏంటో అర్థం కావ‌డం లేద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు.

నిత్యావసర సరుకుల ధరల తగ్గింపు కోసం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని టీడీపీ నిర్ణయించింది. 2022, జనవరి 11వ తేదీ మంగళవారం నిరసనలు కొనసాగించాలని పార్టీ నేతలకు సూచించారు. 2022, జనవరి 10వ తేదీ సోమవారం పార్టీ ముఖ్యనేతలతో చంద్రబాబు సమావేశం నిర్వహించారు. “ధరలు దిగిరావాలి….జగన్ దిగిపోవాలి” పేరిట నిరసనల కార్యక్రమాలు నిర్వహించనుంది. ఇక్క‌డ ఇంకో విష‌యం ఏంటంటే.. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలతో గ్రామ స్థాయిలో వైసీపీ క్యాడర్, రాష్ట్ర స్థాయిలో వైసీపీ లీడర్లు ఇబ్బంది పడుతున్నారని బాబు సెల‌విచ్చారు. మ‌రి వైసీపీ నేత‌లు ఆయ‌న‌తో చెప్పుకున్నారో ఏమో కానీ.. అదే నిజ‌మైతే, గ్రామ‌స్థాయిలో, ప‌ట్ట‌ణ స్థాయిలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు వైసీపీకి ఎందుకు ప‌ట్టం క‌ట్టారో ఆయ‌న‌కే తెలియాలి.

పీఆర్సీ విష‌యంలోను, గ్రామ, వార్డు స‌చివాల‌య ఉద్యోగుల‌ను రెగ్యులర్ చేయ‌డం విష‌యంలోను ప్ర‌భుత్వం స్ప‌ష్ట‌మైన విజ‌న్ తో ఉంది. దానిపై ఉద్యోగులకు స్ప‌ష్టంగా వివ‌ర‌ణ కూడా ఇచ్చింది. కానీ ఇప్పుడు తాజాగా అంశాల‌పై చంద్ర‌బాబు డిమాండ్ లు చేయ‌డం విడ్డూరంగా ఉంద‌నే అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి. పైగా.. ఏపీ అంతా ఓవైపు సంక్రాంతి మూడ్ లోనూ, మ‌రోవైపు క‌రోనా ఆందోళ‌న‌లోనూ ఉంటే ఇలాంటి ప‌రిస్థితుల్లో జ‌గ‌న్ దిగిపోవాలి.. అంటూ బాబు నిర‌స‌న‌ల‌కు పిలుపు ఇవ్వ‌డం స‌మంజ‌స‌మేనా? అనే ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్నాయి.

Also Read : గొంతెమ్మ కోరికలతో బాబు నిరసన పిలుపు..

Show comments