Idream media
Idream media
తెలుగుదేశం పార్టీలో జవసత్వాలు నింపడమే అధినేత చంద్రబాబుకు ప్రస్తుతం ప్రధాన కర్తవ్యంగా మారింది. చెల్లాచెదురవుతున్న పార్టీ శ్రేణులను కాపాడుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం ఎవరేమన్నా ఆచితూచి స్పందిస్తున్నారు. వచ్చే ఎన్నికలను ఎదుర్కోవాలంటే పార్టీకి ఇప్పుడున్న బలం సరిపోదు. కీలక నేతలు కూడా దూరంగా ఉంటున్నారు. కేశినేని నాని లాంటివారైతే టీడీపీతో కలిసి పనిచేసేది లేదని బాహాటంగానే స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలో లీడర్లు పోయినా, కేడర్ ను కాపాడుకోవాలని చంద్రబాబు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం వారికి పదవులను ఎర వేస్తున్నారు. ఫలితంగా టీడీపీ ఏపీ కమిటీలో సభ్యుల సంఖ్య పెరుగుతూ పోతోంది.
తెలుగుదేశానిది గతమెంతో ఘనం. కానీ ఇప్పుడు కళావిహీనంగా మారుతోంది. వరుస అపజయాలు ఆ పార్టీని కుంగదీస్తున్నాయి. ఉండాలా, వద్దా.. అనేలా నేతలను ఆలోచింపచేస్తున్నాయి. చాలా నియోజకవర్గాల్లో అంతర్గత విభేదాలు, కలహాలతో పార్టీ కొట్టుమిట్టాడుతోంది. క్రమశిక్షణ కు మారుపేరు కాస్తా మరోపేరు మూటగట్టుకుంటోంది. పార్టీలో అసంతృప్తి స్వరాలు పెరుగుతున్నాయి. దీంతో పదవులను ఇవ్వడం ద్వారా అందరినీ సంతృప్తి పరిచేందుకు అధినేత ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఎడాపెడా పదవుల పందేరాన్ని మార్గంగా ఎంచుకున్నారు. కింది స్థాయి నేతలకు రాష్ట్ర స్థాయి పదవులు ఇస్తూ గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. టీడీపీ రాష్ట్ర కమిటీలో కొత్తగా 48 మందికి చోటు కల్పించారు. అయితే, వీరిలో కూడా కొద్దిమంది మినహా మిగతా అందరూ నగర స్థాయి నేతలే అన్న చర్చ జరుగుతోంది.
ఇప్పటి వరకు 219 మందితో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీ ఉంది. ఇప్పుడు కొత్తగా కొంత మందిని చేర్చుకుంది. దీంతో ప్రస్తుతానికి ఆ సంఖ్య 267కి చేరింది. ఇంకా చాలా మందికి హామీలు ఇస్తూనే ఉన్నారు. ప్రస్తుతానికి పార్టీ పదవులిస్తానని, అధికారంలోకి వచ్చాక అందలం ఎక్కిస్తానని అధినేత బుజ్జగిస్తున్నారు. గత్యంతరం లేకనే కొమ్మారెడ్డి పట్టాభిరాం లాంటి నేతలకు అవకాశమిచ్చినట్లు పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పుడు మరికొందరిని తెరపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కూడా కొన్ని నియోజకవర్గాల్లో చేటు తెస్తోంది. విభేదాలనను పెంచుతోంది. దీంతో వరుసగా అన్ని నియోజకవర్గాల నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాల్లో బాహాటంగానే తమ అసంతృప్తిని అధినేత ముందు వెళ్లగక్కుతున్నారు. దీంతో పదవుల హామీ ఇచ్చుకుంటూపోతున్నారు.
పార్టీ కమిటీలో అత్యధిక మందికి స్థానం ఇవ్వడం ఎంత వరకు కలిసి వస్తుందనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఇప్పటి వరకు ఓ స్థాయి నేతలకు మాత్రమే కమిటీలో అవకాశం ఉండేది. ఇప్పుడు చిన్నాచితకా నేతలను కూడా చేర్చుకోవడం చర్చకు దారి తీస్తోంది. ఎక్కువ మందికి ప్రాధాన్యం ఇవ్వడం క్షేత్రస్థాయిలో పార్టీకి దోహదపడుతుందని అధినేత కీలక నేతలకు నచ్చచెబుతున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా పిలిచి మరీ పార్టీలో పదవులు కేటాయిస్తుండడం గమనించాల్సిన విషయం. పార్టీని బలోపేతం చేసుకునేందుకు బాబు ఎంతలా ప్రయత్నిస్తున్నారో దీన్ని బట్టి అర్థమవుతోంది. కానీ.. ఇది ఎంత వరకు లాభం చేకూరుస్తుందో చూడాలి.
Also Read : TDP Buddha Venkanna – నోటికి పనిచెబితే మేటి నేతలవుతారా?