కొత్తరక్తం ఎంక్కించినా ప్రయోజనం లేదాయె..

ఏదైనా ఒక ప్రధాన రాజకీయపార్టీలో ఏదో ఒక పదవి కొత్తగా ఇస్తే.. తన స్థాయిని నిరూపించుకోవడానికైనా సదరు నాయకుడు రోడ్డెక్కుతుంటారు. అందులోనూ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీలో పార్లమెంటు నియోజకవర్గ వర్గ స్థాయి ఇన్‌ఛార్జి పదవులు లభిస్తే ఇంకాస్త స్పీడుగానే ఉంటారు.. కానీ ఏపీలో పరిస్థితి అందుకు భిన్నంగా సాగుతోందంటున్నారు పరిశీలకులు.

చంద్రబాబు తన అమరావతి ఉద్యమానికి 300 రోజులు పూర్తయిపోయింది కాబట్టి రాష్ట్రమంతటా ఉద్యమానికి మద్దతుగా మూడు రోజుల కార్యక్రమాలు చేయాలని పార్టీ శ్రేణులను ఆదేశించారు. ఇందుకు షెడ్యూల్‌ను కూడా వెల్లడించి ఎప్పుడే పనులు చెయ్యాలో చెప్పుకొచ్చారు. ఇంత వరకు బాగానే ఉంది. తెలుగుదేశం పార్టీ నుంచి ఇటీవలే పార్లమెంటు జిల్లా అధ్యక్షులు, మహిళా అధ్యక్షులకు పదవులు పొందిన వాళ్ళు, వీరికి తోడు టీడీపీ తరపున గెల్చిన ఎమ్మెల్యేలు రోడ్డెక్కి ఆందోళన చేస్తే అమరావతి ఉద్యమానికి మాంచి ఊపొస్తుందని చంద్రబాబు ఊహించి ఉండొచ్చు.

కానీ దీనికి భిన్నంగా పరిస్థితులు మారిపోయాయి. కనీసం కొత్తగా పదవులు పొందిన వాళ్ళు గానీ, టీడీపీ తరపున ప్రజా ప్రతినిధులుగా ఉన్న వాళ్ళుగానీ చంద్రబాబు మాటవిని రోడ్డెక్కిన వాళ్ళను వేళ్ళమీదే లెక్కించొచ్చంటున్నారు. వచ్చిన వాళ్ళు కూడా ఏదో ఫోటోలు, వీడియోల వరకు మాత్రమే మమ అనిపించేసి అక్కడ్నుంచి నెమ్మదిగా జారుకున్నారు. దీంతో ఏ ఉద్దేశ్యంతో అయితే చంద్రబాబు ఈ కార్యాచరణ ప్రకటించారో దానికి దూరంగానే కార్యక్రమం జరిగిపోయిందంటున్నారు.

అధికార వైఎస్సార్‌సీపీ చెబుతున్నట్టు ఏపీలో మూడు రాజధానులకే ప్రజలు మద్దతు ఇస్తున్నారు. ఈ విషయం క్షేత్రస్థాయిలో ఉన్న టీడీపీ శ్రేణులకు బాగానే అర్ధమైంది. అయితే జూమ్‌లో కూర్చున్న పార్టీ అధినేతకు మాత్రమే పెద్దగా అర్ధం కావడం లేదన్నది నూటికినూరుపాళ్ళు నిజమనుకోవాల్సి వస్తోంది. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు వెళ్ళి అమరావతే రాజధానిగా ఉండాలని ఉద్యమం చేద్దాం రండి అంటే అక్కడున్న జనం రియాక్షన్‌ కొంచెం భిన్నంగానే ఉండక మానదన్నది ఇప్పటికే తేలిన విషయం.

ఇటువంటి పరిస్థితుల్ని ఏ మాత్రం అంచనా వేయకుండా చంద్రబాబు ఇచ్చే పిలుపును అందుకుని రోడ్డెక్కితే మన పరిస్థితి ఏంటి? అన్న సందేహం నేపథ్యంలోనే కొత్తగా పదవులు పొందినప్పటికీ పెద్దగా స్పందించలేదన్న వాదన కూడా విన్పిస్తోంది. ఏతావాతా తేలేదేంటంటే కొత్తరక్తం ఎక్కించగానే సరికాదన్నది స్పష్టమైపోయింది. ప్రజలు ఏం కోరుకుంటున్నారో దానికి అనుగుణంగా ప్రతిపక్షం తన కార్యాచరణను రూపొందించుకోవాల్సిందేనంటున్నారు. అలాక్కాకుండా ‘మేం.. చెబుతున్నాం.. మీరు ఆచరించండి’’ తరహా ఆదేశాలిస్తే మాత్రం ఇప్పుడు టీడీపీ శ్రేణులు అనుసరించినట్టే ఉంటుందంటున్నారు. కొత్తగా పదువులిచ్చినప్పటికీ శ్రేణుల్లో ఏ మాత్రం ఉత్సాహం లేకపోవడం టీడీపీ అధినేతకు దిగులు తప్పడం లేదంటున్నారు.

Show comments