Idream media
Idream media
ఈ మద్య రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. అందులో ప్రముఖులు ఉంటున్న ఘటనలూ ఉంటున్నాయి. ఇటీవలి కాలంలో అధికార పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, వారి బంధువులు ప్రమాదాలకు గురైన ఘటనలు ఉన్నాయి. గత నెలలో గుంటూరు జిల్లాలో జరిగిన కారు ప్రమాదంలో ప్రభుత్వ విప్, వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తమ్ముడి ఇంట్లో తీవ్ర విషాదాన్ని నింపింది. సంక్రాంతికి కొత్త దుస్తులు కొనుగోలు చేసి తిరిగి ఇంటికి వెళుతున్న సమయంలో అనుకోని ప్రమాదం ఎదురైంది. కారు అదుపు తప్పి కాల్వలోకి దూసుకెళ్లింది.
తాజాగా వైసీపీ ఎమ్మెల్యేకు ప్రమాదం తప్పింది.. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు కారు గుంటూరు జిల్లాలో ప్రమాదానికి గురైంది.. హైదరాబాద్ నుండి త్రిపురాంతకం వెళ్తుండగా.. మాచర్ల మండలం ఎత్తిపోతల సమీపంలో ప్రమాదం జరిగింది.. ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారును ఓవర్ టేక్ చేస్తూ వెనుకనుంచి ఢీకొట్టింది మరోకారు.. అయితే, ఈ ప్రమాదంలో కారు డ్యామేజ్ అయ్యింది.. ఎమ్మెల్యే కారుమూరి సురక్షితంగా బయటపడ్డారు.. మరో వాహనంలో త్రిపురాంతకం వెళ్లిపోయారు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు.
అంతకు ముందు నెల్లూరు జిల్లా కోవూరు వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి కూడా తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఇనమడుగు క్రాస్ రోడ్డు సమీపంలో ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారును లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఎమ్మెల్యే కారు వెనుకభాగం పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాద సమయంలో కారులో ఆయనతో పాటు విజయా డెయిరీ ఛైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి కూడా ఉన్నారు. వీరిద్దరూ కూడా సురక్షితంగా బయటపడ్డారు. దేవుడి దయవల్ల ప్రాణాలతో బయట పడ్డామని ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి చెప్పారు. అలాగే.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు ఓ బైక్‌ను తప్పించబోయి విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న ఘటనలో ఆయన కూడా ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. గతంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి కారు కూడా ప్రమాదానికి గురైంది. ఇలా వరుస ప్రమాదాలతో పార్టీలో చర్చనీయాంశంగా మారాయి.