జస్టిస్‌ ఎన్వీ రమణకు లేఖ : జడ్జీల నియామకాలపై ఎస్‌సీబీఏ ఆవేదన

దేశంలోని వివిధ హైకోర్టులకు న్యాయమూర్తులుగా కొలీజియం సిఫారసు చేసిన పేర్లలో తాము సూచించిన ఒక్కరి పేరునూ పరిగణనలోకి తీసుకోకపోవడంపై సుప్రీం కోర్టు బార్‌ అసోసియేషన్‌(ఎస్‌సీబీఏ) ఆవేదన వ్యక్తం చేసింది. ఇదే అంశంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జసిస్ట్‌ ఎన్వీ రమణ, మరో నలుగురు అత్యంత సీనియర్‌ న్యాయమూర్తులను ఉద్దేశించి అసోసియేషన్‌ అధ్యక్షుడు వికాస్‌ సింగ్‌ లేఖ రాశారు.

‘‘అసోసియేషన్‌ తరపున ఒక కమిటీని నియమించి, హైకోర్టు న్యాయమూర్తులుగా అర్హులైన వారిని గుర్తించాం. వీరిలో 48 మంది పేర్లతో కూడిన జాబితాను కొన్ని నెలల కిందటే మీకు(సీజేఐ) అందించాం. హైకోర్టుల్లో భారీసంఖ్యలో ఖాళీలు ఉన్నప్పటికీ మేం సూచించిన వారిలో ఒక్కరి పేరునూ కొలీజియం పరిగణనలోకి తీసుకోలేదు. హైకోర్టు న్యాయమూర్తులను నియమించే ప్రక్రియలో అత్యంత గోప్యత పాటిస్తున్నారన్న విమర్శలకు అడ్డుకట్ట వేసేలా మేం ఎంతో పారదర్శకంగా జాబితాను రూపొందించాం. ఒక్క నియామకం కోసం సుదీర్ఘ కాలం వేచి చూడాల్సిన పరిస్థితి, చాంబర్ల వ్యవస్థ వద్దని గతంలోనే ఎగ్జిక్యూటివ్‌, జడ్జిల కమిటీ సూచనలు చేసింది. ఇదే విషయాన్ని బార్‌ అసోసియేషన్‌ పదే పదే విన్నవించినా నిర్ణీత సమయంలో నియామకపు జాబితా సిద్ధం కాలేదు’’ అని వికాస్‌ సింగ్‌ లేఖలో పేర్కొన్నారు.

అదేవిధంగా బార్‌ అసోసియేషన్‌ కొంతకాలంగా విన్నవిస్తున్నా.. సౌకర్యాలు కల్పించడం లేదని తెలిపారు. లైబ్రరీకి మరింత స్థలం కేటాయించాలని, భోజనాల గదులు ఏర్పాటును ఆయన ప్రస్తావించారు. అదేవిధంగా బార్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌, సెక్రటరీలకు కోర్టు నెంబరు 11 ముందు గదులు కేటాయించడంలోనూ జాప్యం జరుగుతోందన్నారు. గదుల కేటాయింపుపై మాజీ సీజేఐ దీపక్‌ మిశ్రా హామీ ఇచ్చారని.. అయినప్పటికీ ఇప్పటి వరకు చర్యలు చేపట్టలేదని వికాస్‌ సింగ్‌ పేర్కొన్నారు. ‘‘బార్‌ అసోసియేషన్‌ చరిత్రలో ఇప్పటి వరకు ఎలాంటి నిరసన, సమ్మె చేపట్టలేదు. అందుకే మాకు, మా విజ్ఞప్తులకు ఎలాంటి ప్రాధాన్యం దక్కడం లేదని మాకు అనిపిస్తోంది’’ అని వికాస్‌ సింగ్‌ లేఖలో పేర్కొనడం గమనార్హం.

Also Read : జగన్‌ ఢిల్లీ టూర్‌ సక్సెస్‌.. ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం..

Show comments