సుబ్బిశెట్టి పాత్ర – ఆర్యవైశ్యులకి అవమానమే

పదేళ్ల వయసులో చింతామణి నాటకం చదివాను. కిరాణా పొట్లాల కాగితాలు కూడా వదలకుండా చదివే అలవాటు. లైబ్రరీ నుంచి మా తాత తెచ్చుకున్న పుస్తకాన్ని నమిలేశాను. సరిగా అర్థం కాలేదు. బిల్వమంగళుడు సుబ్బిశెట్టి పాత్రలు ఆకర్షించాయి. చింతామణి ఆకర్షణకి గురయ్యేంత వయసులేదు.

రాయదుర్గం లక్ష్మీవిలాస్​ బయట అప్పుడప్పుడు చింతామణి కరపత్రాలు వేలాడుతూ కనిపించేవి. కడుపుబ్బా నవ్వించే సుబ్బిశెట్టి అని ప్రత్యేకంగా వేసేవాళ్లు. శివరాత్రికి మధ్యాహ్నం జాతర జరిగేది. అక్కడ చింతామణి నాటకం చూశాను. చూస్తూ నిద్రపోయాను.

1979లో సినీనటుడు పద్మనాభం అనంతపురం లలిత కళాపరిషత్​లో చింతామణి నాటకం వేశాడు. దానికి ముందు పద్మనాభం స్పీచ్​. మూలంకంటే సుబ్బిశెట్టి పాత్రని తాను జనరంజకంగా మలిచానని చెప్పాడు. నాటకాల కోసం ఒక థియేటర్​ కట్టిస్తానని అన్నాడు. నాటకాన్ని ముందుండి చూడాలని, తక్కువ టికెట్​ కొన్నవాళ్లు వెనక కూర్చోవడం నచ్చదని, తాను కట్టించే థియేటర్​ని నిలువుగా రెండు భాగాలుగా విభజించి, కుర్చీలవాళ్లు, నేల టికెట్లు వాళ్లు ఇద్దరూ ముందు వరుసలోనే వుంటారని అన్నాడు. అది నెరవేరలేదు. రాత్రి పది తర్వాత నాటకం వుండడంతో నేను చూడలేదు.

1980 తరువాత ఏం జరిగిందంటే క్యాసెట్ల విప్లవం వచ్చింది. టేప్​రికార్డర్లు మధ్యతరగతి వారికి అందుబాటులోకి వచ్చాయి. చింతామణి నాటకం క్యాసెట్​ వచ్చింది. అసలు కథకంటే ఎక్కువగా బొంగురుగొంతుతో సుబ్బిశెట్టి బూతు డైలాగులు హైలైట్​గా వుండేవి. దీంతోపాటు రంగమెళ్లిపోతా నారాయణమ్మా.., మందులోడా మాకులోడా పాటలతో పాటు బూతు డైలాగుల క్యాసెట్లు వచ్చాయి. సంతలు, జాతరలు, టీకొట్ల వద్ద మారుమోగేవి.

చింతామణిలో అసలు విషయం పక్కకెళ్లి, సుబ్బిశెట్టి బూతులపై ఆధారపడి బతికేది. మరాఠీ నాటకం పరిస్థితి కూడా ఇదే. డబుల్​ మీనింగ్ డైలాగులతో ప్రేక్షకుల్ని ఆకర్షించేది. కర్నాటకలో ప్రసిద్ధిగాంచిన సూళెయసంపత్తు కూడా మన చింతామణి నాటకంలాంటిదే. ఒక ట్రాన్స్​జెండర్​ మాట్లాడే బూతు డైలాగులకి జనం విరగబడి నవ్వేవారు.

అయితే ఒక కులాన్నిగానీ, శారీరకలోపాన్నిగానీ ఎగతాళి చేయడం అప్పట్లో తప్పని తెలియని కాలం. కాలక్రమేణా చైతన్యం పెరిగింది. 1990లో దాసరి నారాయణరావు చింతామణి సినిమా తీస్తానని చెప్పాడు. అయితే వైశ్య కులాన్ని అవహేళన చేస్తే సహించమని ఆర్యవైశ్య సంఘాలు హెచ్చరిస్తే మానుకున్నాడు.గతంలో NTRతో చింతామణి సినిమా (1956) వచ్చింది. భానుమతితోపాటు సుబ్బిశెట్టిగా రేలంగి. దీంట్లో బూతుకామెడీ తెలియని కాలం.

చింతామణిలోనే కాదు, ఏ రంగంలోనైనా కులాల్ని కించపరచడం తప్పు. మన సాహిత్యం, సినిమా చాలా దశాబ్దాలు అగ్రవర్ణ భావజాలంతో వుండడం వల్ల పెద్ద కులాల్ని గారు అని పిలవడం, వృత్తి కులాల్ని ముఖ్యంగా రజకులు, నాయీ బ్రాహ్మణులని అరే, ఒరే అని పిలవడం నిన్న మొన్నటి దాకా జరిగింది. ఇకపై జరగకూడదు.

చింతామణిలో సుబ్బిశెట్టి పాత్రని వికారంగా, పెద్ద బొజ్జతో, నల్లగా మేకప్​ చేసి బొంగురు గొంతుతో డైలాగులు చెప్పిస్తారు. (యూట్యూబ్​లో వీడియోలు కూడా ఇలాగే వున్నాయి) ఇదంతా ఆర్యవైశ్యుల్ని అవమానించడం తప్ప మరొకటికాదు. దీన్ని నిషేధించడమే కరెక్ట్​. ఈ నిషేధంతో నాటక రంగానికి వచ్చిన నష్టమేమీ లేదు. తెలుగు నాటకం చాలాకాలంగా అంపశయ్య మీదే వుంది.

Show comments