Idream media
Idream media
విభజన సమస్యల పరిష్కారానికి తెలుగు రాష్ట్రాల మధ్య చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ ఆశిష్‌కుమార్ నేతృత్వంలోని సబ్ కమిటీ నిర్వహించిన వర్చువల్ భేటీలో కూడా పరిష్కారమార్గాలు చూపించలేదు. సమావేశంలో పాల్గొన్న ఇరు రాష్ట్రాల అధికారులు ఎవరి వాదనను వారు వినిపించారు.
ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఏపీఎస్‌ఎఫ్‌సీ), రెండు రాష్ట్రాల మధ్య విద్యుత్తు బకాయిలు, పన్ను బకాయిల సర్దుబాటు, బ్యాంకు డిపాజిట్లు, రెండు రాష్ట్రాల పౌరసరఫరాల సంస్థల క్యాష్ క్రెడిట్లు అనే ఐదు అంశాల ఎజెండాతో ఈ సబ్ కమిటీ ఏర్పాటైంది. ఈ మేరకు.. ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆశిష్‌కుమార్ మరోసారి గురువారం విభజన సమస్యల పరిష్కారానికి భేటీ అయ్యారు. దీనికి తెలంగాణ నుంచి సబ్ కమిటీ సభ్యుడైన ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావుతో పాటు రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ నీతూ ప్రసాద్, పౌరసరఫరాల శాఖ ఎక్స్ అఫిషియో కార్యదర్శి వి.అనిల్‌కుమార్, ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు, ట్రాన్స్‌కో జేఎండీ సి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.
ఈ భేటీలో కూడా ఇరు రాష్ట్రాల మధ్య విద్యుత్తు బకాయిలపై నెలకొన్న సమస్యకు పరిష్కారం లభించలేదు. ఆంధ్రప్రదేశ్ జెన్‌కో నుంచి తెలంగాణ విద్యుత్తు సంస్థలకు రూ.12,532 కోట్ల బకాయిలు రావాల్సి ఉందని రాష్ట్ర అధికారులు ఆశిష్‌కుమార్‌కు వివరించారు. అయితే.. తమకే తెలంగాణ జెన్‌కో రూ.3442 కోట్ల బకాయిలు ఇవ్వాల్సి ఉందని, వీటిని ఒకేసారి ఇప్పించేలా చూడాలని ఏపీ కోరింది. ఈ సమస్యను సాగదీయకుండా ఒకేసారి పరిష్కరించాలని ఇరు రాష్ట్రాల అధికారులూ కోరారు.
అయితే… ఆంధ్రప్రదేశ్ నుంచి పొందిన బ్యాంకు బ్యాలెన్స్, బ్యాంకు డిపాజిట్ల వివరాలను పంపించాలంటూ తెలంగాణ అధికారులకు కమిటీ చైర్మన్ ఆశిష్‌కుమార్ సూచించారు. ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల సంస్థకు రూ.354.08 కోట్ల నిధులను చెల్లించడానికి తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ సిద్ధంగా ఉందని, అయితే… కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన సబ్సిడీ నిధులు అందగానే వీటిని బదిలీ చేస్తామన్న తెలంగాణ విజ్ఞప్తికి ఏపీ అండర్‌టేకింగ్ ఇవ్వాలని అన్నారు.
Also Read : పోలవరం .. రాష్టం ఒకడుగు ముందుకు, కేంద్రం తీరు వెనక్కి