Idream media
Idream media
నిన్న మొన్నటి వరకు రోజుకు ఆరేడు వేల చొప్పన నమోదయ్యే కోవిడ్ కేసుల సంఖ్య.. క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 33,750 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ప్రపంచాన్ని వణికిస్తున్న కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు.. మన దేశంలో తక్కువగానే నమోదవుతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు విదేశాల నుంచి వచ్చిన వారికే ఒమిక్రాన్ సోకింది. దేశీయులకు ఇంకా కొత్త వేరియంట్ సోకలేదనేది ప్రభుత్వాలు చెబుతున్న మాట. మొత్తం మీద కొత్త వేరియంట్ కేసులు దేశంలో 1700 నమోదయ్యాయి.
కొత్త వేరియంట్‌పై ప్రభుత్వ గణాంకాలు ఎలా ఉన్నా.. జాతీయ ఆంగ్ల మీడియా చేసిన పరిశోధన ఒళ్లు గగ్గురుపుడుస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్‌ను గుర్తించే ల్యాబ్ సౌకర్యాలు మన దేశంలో తక్కువగా ఉన్నాయి. ఈ కారణం చేత కొత్త వేరియంట్ సోకిన వారిని వెంటనే గుర్తించలేకపోతున్నారు. ప్రభుత్వం చెబుతున్న గణాంకాలకు పది రెట్లు ఎక్కువగా కొత్త వేరియంట్ కేసులు ఉన్నాయని ఆ పరిశోధన చెబుతోంది. దేశంలో ప్రస్తుతం ఒమిక్రాన్ సోకిన వారు 18 వేల మంది ఉంటారని అంచనా.
కోవిడ్ సెకండ్ వేవ్‌లో వచ్చి డెల్టాప్లస్ కన్నా.. ఒమిక్రాన్ అత్యంత వేగంగా వ్యాపిస్తుందని ఆ పరిశోధన తెలియజేస్తోంది. సెకండ్ వేవ్‌లో రోజుకు 4 లక్షల కేసులు నమోదు కాగా.. ఒమిక్రాన్ కేసులు అందుకు నాలుగు రెట్లు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. ప్రస్తుతం దేశం థర్ట్ వేవ్ ముందు ఉందని, రాబోయే రోజుల్లో ఒమిక్రాన్ కేసులు గరిష్ఠంగా రోజుకు 16 నుంచి 20 లక్షల కేసులు నమోదయ్యే ప్రమాదం ఉందని అంచనా వేసింది. ప్రతి వంద మందిలో ముగ్గురు ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం రావొచ్చని, రోజుకు దాదాపు 60 వేల మంది ఆస్పత్రిపాలవుతారని ఆ పరిశోధన నివేదిక తెలియజేస్తోంది. కోవిడ్ విషయంలో.. వివిధ పరిశోధనలు, అంచనాలు కొంచెం వెనుకా, ముందుగా నిజమయ్యాయి.
కోవిడ్‌పై వాస్తవ పరిస్థితులు, అంచనాలు ఎలా ఉన్నా.. దేశంలో ఎన్నికల పండగ జరిపేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. ఫిబ్రవరి, మార్చిలో దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరగబోతున్నాయి. ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం కసరత్తు ముమ్మరం చేసింది. ఇటీవల ఎన్నికలు జరిగే రాష్ట్రాలలో పర్యటించిన ఎన్నికల సంఘం.. రాజకీయ పార్టీల అభిప్రాయాలను తీసుకుంది. మొత్తం మీద ఎన్నికలు నిర్వహించేందుకు నిర్ణయించింది. తాజాగా ఎన్నికల సంఘం ఐదు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు లేఖలు రాసింది. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని ఆ లేఖల్లో కోరింది. ఎన్నికలు సమీపిస్తున్నందున వ్యాక్సినేషన్ డ్రైవ్‌లు చేపట్టాలని కోరింది.
ప్రస్తుతానికైతే కేంద్ర ఎన్నికల సంఘం ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు నిర్వహించేందుకే ఏర్పాట్లు చేస్తోంది. పోలింగ్‌కు ఇంకా రెండు నెలల సమయం ఉంది. ఎన్నికల సంఘాన్ని ఆధారంగా చేసుకుని రాజకీయ పార్టీలు ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయి. ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. పోలింగ్‌కు అన్నీ సిద్ధం చేసుకుంటున్నాయి. పోలింగ్‌కు ఇంకా రెండు నెలల సమయం ఉంది. ఈ లోపు.. దేశంలో కోవిడ్ వ్యాప్తి, కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రభావం ఎలా ఉండబోతోందన్న ఆందోళన రాజకీయ పార్టీలలో నెలకొంది. ప్రస్తుతం వివిధ సంస్థలు అంచనా వేస్తున్నట్లు.. రాబోయే రోజుల్లో ఒమిక్రాన్ వ్యాప్తి అధికంగా ఉంటే.. ఎన్నికలు వాయిదా వేయాల్సిన పరిస్థితి నెలకొంటుంది. అది రాజకీయ పార్టీలకు ఆర్థికంగా చాలా నష్టం చేకూరుస్తుంది. జయపజయాలు ప్రభావితమవుతాయి. ఎన్నికలు జరుగుతాయా..? లేదా..? అన్నది పూర్తిగా కోవిడ్ పై ఆధారపడి ఉంది. మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో వేచి చూడాలి.
Also Read : ఫిరాయింపులకు అఫిడవిట్ విరుగుడు! గోవాలో కొత్త విధానం