వీర్రాజు హామీల ప‌రంప‌ర‌.. ప్ర‌జ‌లు న‌మ్మేనా?

ఏపీలో క‌నీస ప్రాతినిథ్యం కోసం బీజేపీ చీఫ్ సోము వీర్రాజు బాగానే క‌స‌ర‌త్తు చేస్తున్నారు. త‌న అనుభ‌వాన్ని అంతా రంగ‌రించి ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో కూడా ప్రాంతాల వారీగా ప‌ర్య‌ట‌న‌ల‌కు శ్రీ‌కారం చుట్టారు. ప్ర‌స్తుతం రాయ‌ల‌సీమ‌లో ప‌ర్య‌టిస్తున్నారు సోము. ఇబ్బందుల్లో పార్టీ కార్య‌క‌ర్త‌ల కుటుంబాల‌ను ప‌రామ‌ర్శిస్తూ.. వీలున్న చోట‌ల్లా స‌మావేశాలు నిర్వ‌హిస్తూ ముందుకు సాగుతున్నారు. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మోడీ బొమ్మ‌ను చూపిస్తూ, కేంద్ర ప‌థ‌కాల‌ను వివ‌రిస్తూ.. ఏపీలో శూన్యం నుంచి చెప్పుకోద‌గ్గ స్థాయికి ఎద‌గాల‌ని త‌హ‌త‌హ‌లాడుతున్నారు. ఈ మేర‌కు ఇప్ప‌టి నుంచే ఎన్నిక‌ల హామీల‌ను గుప్పిస్తున్నారు.

సిమెంటు.. గుడ్డు..

విజ‌య‌వాడ‌లో నిర్వ‌హించిన స‌భ‌లో చీప్ లిక్క‌ర్ ధ‌ర‌ను త‌గ్గిస్తామ‌ని మందుబాబుల‌ను ఆక‌ట్టుకునేలా సోము ప్ర‌క‌ట‌న చేశారు. రాయ‌ల‌సీమ ప‌ర్య‌ట‌న‌లో కూడా ప‌లు హామీల‌ను గుప్పిస్తున్నారు. సిమెంటును రూ. 330 కి ఎందుకు అమ్ముతున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలంటూ.. బీజేపీ అధికారంలోకి వస్తే రూ. 200కే ఇస్తామని సోము వీర్రాజు అన్నారు. అలాగే.. త‌మ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి నియోజకవర్గంలో కోళ్లఫారం పెట్టి నాణ్యమైన నాటు కోడిగుడ్లను సరఫరా చేస్తార‌ట‌. ఏపీలో కేవలం మోడీ ప్రభుత్వం నిధులతోనే అభివృద్ధి జరుగుతోంద‌ట‌. ఈ సంద‌ర్భంగా పోరాటాల‌కు పిలుపు ఇస్తారు సోము వీర్రాజు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాల‌ని ఆందోళ‌న చేప‌డ‌తామ‌న్న సోము వీర్రాజు.. ఆ ప్రాజెక్టుల పూర్తి కోసం కేంద్ర స‌హ‌కార జాప్యంపై ప్ర‌శ్నిస్తారా అనేది చూడాలి. అలాగే.. హిందూత్వ వాదాన్ని కూడా ప్ర‌ధాన ఎజెండాగా చేసుకుని వీర్రాజు రాజ‌కీయాలు చేస్తున్నారు.

టీడీపీకి కూడా పంచ్‌..

రాయ‌ల‌సీమ అభివృద్ధికి నిర్ల‌క్ష్యం వ‌హించారంటూ గ‌త ప్ర‌భుత్వంపై కూడా సోము నిప్పులు గ‌క్కారు. రాయలసీమలో ఎర్రచందనం, ముగ్గురాయి, చాలా ఖనిజాలు ఉన్నప్పటికీ.. ఇక్కడివారు ముఖ్యమంత్రులుగా ఉన్నా అభివృద్ధి లేకుండా చేశారంటూ ప‌రోక్షంగా చంద్ర‌బాబుపై ఆరోప‌ణ‌లు చేశారు. అన్ని రకాల ఆర్థిక వనరులు ఉన్నా గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలోను, ప్ర‌స్తుతం అభివృద్ధి లేద‌ని విమ‌ర్శించారు. 2024లో బీజేపీ అధికారంలోకి వస్తే రాయలసీమ, ఉత్తరాంధ్రను అభివృద్ధి చేస్తామని కూడా హామీ ఇచ్చారు సోము. రైల్వే ప్రాజెక్టులకు రాష్ట్రం నిధులు ఇవ్వ‌క‌పోయినా.. బీజేపీ పూర్తి చేస్తుంద‌న్న సోము వ్యాఖ్య‌ల వెనుక అంత‌రార్థం ఏంటో తెలియ‌డం లేదు. అంటే కేంద్ర నిధుల‌ను తెప్పించుకుని చేస్తారా, సొంతంగా చేప‌డ‌తారా తెలియాల్సి ఉంది. ఈ సంద‌ర్భంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్ర‌భుత్వానికి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా సోము లాజిక‌ల్ గా మాట్లాడే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు గురించి మాత్ర‌మే కాకుండా.. తెలుగుగంగ, హంద్రీనీవా ప్రాజెక్టుల గురించి కూడా ఆలోచించాలంటూ వ్యాఖ్యానించారు.

Also Read : హామీలను జగన్‌ అమలు చేయడంలేదంటున్న బీజేపీ నేత

Show comments