Idream media
Idream media
ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు కు ఏమైంది? ఎందుకలా మాట్లాడుతున్నారు? తన ప్రశ్నలు, లాజిక్కులతో ఎదుటివాళ్లకు సమాధానం చెప్పే అవకాశం కూడా ఇవ్వని ఆయన మాటలు తరచూ ఎందుకు వివాదాస్పదం అవుతున్నాయి. అధ్యక్ష బాధ్యతలు భుజాలపై ఒత్తిడిని పెంచుతున్నాయా?, రాష్ట్రంలో పార్టీ ఎదుగుదల కనిపించడం లేదన్న అధిష్ఠానం చురకలతో సతమతం అవుతున్నారా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి. అందుకు కారణం తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో సోము వీర్రాజు వార్తల్లోకి ఎక్కడమే.
వివాదాలు సృష్టించడం చాలా మంది బీజేపీ నాయకులకు అలవాటే అయినా.. గతంలో సోము వీర్రాజు ప్రసంగాల్లో పంచ్ లు ఎక్కువగా ఉండేవి. ఆకట్టుకునేవి. కానీ.. ఇప్పుడు ప్రజల ఆగ్రహానికి గురవుతున్నారు. తిరుపతితో జరిగిన బీజేపీ సభలో చీఫ్ లిక్కర్ పై ఆయన చేసిన వ్యాఖ్యలు ఎంతలా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. సాధారణ మహిళల నుంచి దేశ వ్యాప్తంగా కూడా పలు పార్టీల నేతలు, సొంత పార్టీ కార్యకర్తలే తప్పుబట్టారు. మరీ ఇంత ‘చీప్’గా ఎలా మాట్లాడతారంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. సోము వైన్స్.. సారాయి వీర్రాజు అంటూ నెటిజన్లు ఆయనను ఓ రేంజ్‌లో ఆడేసుకున్నారు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు పరువు పోయిన తర్వాత నా వ్యాఖ్యలను వక్రీకరించారని ప్రకటించారు.
ఈ వివాదం ఇంకా చల్లారకముందే మరోసారి కడప ఎయిర్‌పోర్ట్ నేపథ్యంలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రాణాలు తీసేసేవాళ్ల జిల్లాల్లో ఎయిర్ పోర్టా.. వారికి ప్రాణాలు తీయడమే వచ్చు.. వారికి ఎయిర్ పోర్టు అట.. అని నిన్న జరిగిన ఓ కార్యక్రమంలో సోము వీర్రాజు చెప్పారు. ఈ వ్యాఖ్యలపై కడప కన్నెర్ర చేస్తోంది. బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. కడప ఎయిర్‌పోర్టు విషయంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.. అయితే, ఆయన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి.. బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఓ ప్రాంత ప్రజల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్న ఆయన.. కడప ప్రజలు మనుషులను చంపుతారని వారికి ఎయిర్ పోర్టు అవసరమా అని సోమువీర్రాజు వ్యాఖ్యలు చేయడం శోచనీయం అన్నారు.. ఆయన తన మాటలు వెంటనే వెనక్కు తీసుకోవాలి.. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
వీర్రాజు వ్యాఖ్యలపై ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి ఓ రేంజ్ లో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వ్యాఖ్యలు తీవ్రంగా బాధిస్తున్నాయని చెప్పారు. సోము వీర్రాజు జిల్లాలో కనిపిస్తే ప్రజలు దాడిచేస్తారని హెచ్చరించారు. తాను ప్రజాస్వామ్యంలో లేకపోయి ఉంటే.. సోము వీర్రాజు నాలుక కోసేవాడినని రాచమల్లు ప్రసాదరెడ్డి హెచ్చరించారు. ఆగ్రహం పెల్లుబుకుతున్న నేపథ్యంలో వీర్రాజు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. వైఎస్ వివేకా హత్య నేపథ్యంలోనే తాను ఆ వ్యాఖ్యలు చేశానని, ప్రజలకు సంబంధంలేదని వివరణ ఇచ్చారు. కడప ప్రజలకు హత్యా రాజకీయాలకు ఏ విధమైన సంబంధం లేదన్నారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని సర్దిచెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనా ఇటీవలి కాలంలో సోము తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, వివరణలు ఇచ్చుకోవడం పార్టీ వర్గాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది.
Also Read : కడుపులో కత్తులు , కళ్ళలో ప్రేమలు -కడపపై ఆ నాయకుల తీరు