Skill Development Scam, Lakshmi Narayana – సీఐడీ కేసు.. లక్ష్మీనారాయణకు ‘ముందస్తు’ రక్షణ

చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌లో జరిగిన కుంభకోణంపై సీఐడీ నమోదు చేసిన కేసులలో అరెస్ట్‌ నుంచి తప్పించుకునేందుకు ఆ సంస్థ మాజీ డైరెక్టర్, చంద్రబాబు ప్రభుత్వంలో సలహాదారుడుగా పని చేసిన రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి లక్ష్మీ నారాయణ చేసిన ప్రయత్నం ఫలించింది. సీఐడీ తనను అరెస్ట్‌ చేయకుండా ఉండేందుకు, ముందుస్తు బెయిల్‌ కోసం లక్ష్మీ నారాయణ దాఖలు చేసిన పిటిషన్‌పై ఏపీ హైకోర్టు సానుకూలంగా స్పందించింది. ఆయనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. మధ్యంతర ఉత్తర్వులు 15 రోజుల పాటు అమలులో ఉంటాయని ఆదేశాల్లో పేర్కొంది. దీంతో లక్ష్మీ నారాయణ ఊపిరి పీల్చుకున్నారు.

సూత్రధారి లక్ష్మీనారాయణ..

విద్యార్థులకు కాలేజీ స్థాయిలోనే ఉద్యోగం సాధించేలా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ద్వారా నైపుణ్య శిక్షణ ఇచ్చే కార్యక్రమంలో ప్రభుత్వం కేటాయించిన నిధులను షెల్‌ కంపెనీల ద్వారా మళ్లించారనేది లక్ష్మీ నారాయణపై ఉన్న అభియోగం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థులకు నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేందుకు భారీ మొత్తం ఖర్చు చేశాయి. నైపుణ్య శిక్షణ కార్యక్రమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 370.78 కోట్ల రూపాయల నిధుల్లో.. 241.78 కోట్ల రూపాయలు పక్కదారి పట్టించారని ఫోరెన్సిక్‌ ఆడిట్‌ తేల్చింది. ఈ కుంభకోణానికి లక్ష్మీ నారాయణ సూత్రధారి ప్రభుత్వానికి ఆధారాలు లభించాయి. దీంతో సీఐడీ రంగంలోకి దిగింది.

Also Read : కేసు ఏదైనా.. కక్ష సాధింపు కామన్‌

సోదాలు.. నోటీసులు..

ప్రాథమిక ఆధారాలు లభించడంతో సీఐడీ అధికారులు లక్ష్మీ నారాయణపై కేసు నమోదు చేసి ఈ నెల 10వ తేదీన ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ సమయంలో లక్ష్మీ నారాయణ కుటుంబ సభ్యులు, ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణలు సీఐడీ అధికారులను అడ్డుకునేందుకు యత్నించారు. ఈ విషయంపై రాధాకృష్ణ పై పోలీసు కేసు నమోదైంది. ఆటంకాలు కల్పించినా.. సోదాలు పూర్తి చేసిన సీఐడీ అధికారులు.. కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సమయంలో.. తీవ్ర ఒత్తిడికి గురైన లక్ష్మీ నారాయణ అస్వస్థతకు గురయ్యారు. ఆస్పత్రిలో చేరారు. దీంతో నోటీసులు జారీ చేసిన సీఐడీ.. ఈ నెల 13వ తేదీన విచారణకు హాజరుకావాలని అందులో పేర్కొంది.

అరెస్ట్‌ చేస్తారనే భయంతో..

ఈ రోజు 13వ తేదీ. సీఐడీ విచారణకు హాజరైతే.. విచారణ అనంతరం తనను అరెస్ట్‌ చేస్తారనే భయంతోనే లక్ష్మీ నారాయణ.. ముందస్తు బెయిల్‌ కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించారని అర్థమవుతోంది. అరెస్ట్‌ అయితే.. బెయిల్‌ వచ్చేందుకు కనీసం రెండు మూడు రోజుల సమయం పడుతుంది. అసలు జైలుకు వెళ్లకుండా ఉండేందుకు లక్ష్మీ నారాయణ చేసిన ప్రయత్నం ఫలించింది. ముందస్తు బెయిల్‌ రావడంతో.. ప్రస్తుతానికి అరెస్ట్‌ భయం తప్పింది.

Also Read : ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం.. మాజీ ఐఏఎస్‌ ఇంట్లో సోదాలు.. సీఐడీని అడ్డుకున్న ఏబీఎన్‌ రాధాకృష్ణ

తప్పు చేయకపోతే.. భయం ఎందుకు..?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా పని చేసిన కాలంలో లక్ష్మీ నారాయణ ఆయనకు ఓఎస్‌డీగా పని చేశారు. 2014లో మరోసారి టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో లక్ష్మీ నారాయణకు ప్రాధాన్యత కల్పించారు. లక్ష్మీ నారాయణను అడ్డం పెట్టుకుని స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌లో ఈ కుంభకోణం చేశారనే ఆరోపణలను అధికార పార్టీ చేస్తోంది. అయితే చంద్రబాబు వద్ద పని చేశారనే కక్షతోనే లక్ష్మీ నారాయణపై జగన్‌ ప్రభుత్వం కేసులు పెట్టిందని టీడీపీ నేతలు, ఆ పార్టీ అనుకూల మీడియా ఆంధ్రజ్యోతి ప్రచారం చేస్తోంది. కక్షతో పెట్టిన కేసులు అయితే.. న్యాయస్థానాల్లో నిలబడవు. పైగా కోర్టు నుంచి అక్షింతలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రజల్లోనూ ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుంది. కానీ.. లక్ష్మీ నారాయణ మాత్రం అరెస్ట్‌ చేస్తారనే భయంతో ముందస్తు బెయిల్‌ తెచ్చుకోవడం విశేషం. మరి తప్పు చేయనప్పుడు, కక్షతో కేసులు పెడుతున్నారని చెబుతున్నప్పుడు.. భయపడాల్సిన అవసరం ఏముందనే ప్రశ్న సాధారణంగానే వినిపిస్తుంది.

Show comments