లాక్ డౌన్ రివ్యూ 5 – ట్విస్టుల దొంగతనం

ఇంట్లోనే ఉంటూ ఎంటర్ టైన్మెంట్ కోసం టీవీ లేదా స్మార్ట్ ఫోన్, లాప్ టాప్ మీద ఆధారపడాల్సిన తరుణంలో థియేటర్ దాకా రాలేకపోయిన కొన్ని సినిమాలు ఇప్పుడు నేరుగా చిన్ని తెరపై ప్రత్యక్షమవుతున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే ఇన్నేసి చిత్రాలు ఇలా డైరెక్ట్ డిజిటల్ ఫార్మాట్ లో రిలీజ్ కావడం ఇదే మొదటిసారని చెప్పొచ్చు. అందులో భాగంగా ఇటీవలే వచ్చిన చిత్రమే షూట్ ఎట్ సైట్ (ఉత్తర్వు). తమిళ్ లో బాగానే ఆడిన ఈ చిత్రాన్ని తెలుగులో అనువదించారు కానీ లాక్ డౌన్ వల్ల హాల్ లో వదిలే అవకాశం లేకపోవడంతో ఆన్ లైన్ లో పెట్టేశారు. ప్రైమ్ లో ఉన్న ఈ మూవీ తాలూకు రివ్యూ

కథ

అశోక్(విక్రాంత్), సెల్వ(సుశీంద్రన్)తో వాళ్ళ మరో ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి పట్టపగలు ఓ బ్యాంకులో డబ్బు దొంగతనం చేసి అక్కడి నుంచి పారిపోతారు. అలా చేయడానికి కారణం వాళ్ళలో ఒకడి పాపకు ఎమర్జెన్సీ ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. వీళ్ళను పట్టుకునేందుకు పోలీస్ ఆఫీసర్ ఇబ్రహీం(మిస్కిన్) తన టీం తో కలిసి ఆపరేషన్ మొదలుపెడతాడు. వీళ్ళు దాక్కున్న కాలనీలో వేట మొదలవుతుంది. కాల్పులు ఎదురుకాల్పుల మధ్య కొందరు చనిపోతారు. ఈలోగా ఒక టెర్రరిస్ట్ గ్యాంగ్ కూడా అక్కడ పొంచి ఉంటుంది. తర్వాత చాలా పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఇంతకీ దొంగలు ఏమయ్యారు, పాప సేఫా, తీవ్రవాదుల సంగతేంటి లాంటి ప్రశ్నలకు సమాధానం తెరమీద చూడాలి

నటీనటులు

ఇందులో మెయిన్ లీడ్ గా నటించిన విక్రాంత్ మనకు కొద్దో గొప్పో పరిచయమే కాని మిగిలినవాళ్ళంతా తమిళ మొహాలే కాబట్టి యాక్టింగ్ పరంగా అలా చూస్తూ ఉండటం తప్ప ప్రత్యేకంగా ఎవరూ మన మైండ్ లో రిజిస్టర్ కాలేరు. ఉన్నంతలో సహజంగా నటించడంతో కథలోని మూడ్ ని క్యారీ చేశారు. విశాల్ డిటెక్టివ్ సినిమాతో తెలుగులోనూ పేరు తెచ్చుకున్న దర్శకుడు మిస్కిన్ ఇందులో భారీ కాయంతో పోలీస్ ఆఫీసర్ గా మెప్పించడం ఆశ్చర్యం. హీరో హీరొయిన్లంటూ ప్రత్యేకంగా ఎవరూ లేరు. టీవీ యాంకర్ గా చేసిన మహిమ అక్కడక్కడా అవసరానికి మించి ఓవర్ యాక్షన్ చేసింది. టెర్రరిస్ట్ బ్యాచ్ తో పాటు మిగిలినవాళ్ళను బాగానే క్యాస్టింగ్ చేశారు. కీలక పాత్ర పోషించిన కానిస్టేబుల్ గా నటించిన యాక్టర్ చక్కగా కుదిరాడు

టీం పెర్ఫార్మన్స్

దర్శకుడు రామ్ ప్రకాష్ రాయప్ప తీసుకున్న లైన్ చిన్నదే. కాకపోతే స్క్రీన్ ప్లే తో వేగంగా నడిపించే ప్రయత్నంలో మధ్యలో కాస్త తడబడటంతో అక్కడ ల్యాగ్ అనిపిస్తుంది. దొంగతనం చేసి బయటికి వచ్చాక ఓ అరగంట కథనం బోర్ కొట్టించకుండా సాగుతుంది. ఆపై పెద్దగా చెప్పుకోదగ్గ ట్విస్టులు లేకపోవడంతో స్లో అయినా చివరి అరగంట మళ్లి ట్రాక్ లోకి తీసుకొచ్చి ఊహించని ట్విస్ట్ లతో క్లైమాక్స్ కి తీసుకొస్తాడు. సాధారణ ప్రేక్షకుడు చివర్లో ఏం జరుగుతుందో అసలు విలన్ ఎవరో అనేది అంత ఈజీగా గెస్ చేయలేడు. ఈ విషయంలో రామ్ ప్రకాష్ రాయప్ప ను మెచ్చుకోవచ్చు. కాకపోతే కాలనీ అనే సింగల్ లొకేషన్ లోనే కథ మొత్తం సాగడం కొంత మైనస్ అయ్యింది. సుజిత్ సారంగ్ కెమెరా పనితనం బాగుంది. ,లిమిటెడ్ బడ్జెట్ లోనూ క్వాలిటీ చూపించాడు. జేక్స్ బెజోయ్ సంగీతం కూడా చక్కగా దోహదపడింది. కేవలం 1 గంట 50 నిమిషాలే నిడివి ఉన్న ఈ సినిమాలో పాటలు లేకపోవడం రిలీఫ్

చివరిగా

హౌస్ అరెస్ట్ అయిపోయి ఎటూ కదలలేని స్థితిలో ఉన్న ప్రేక్షకులకు అందులోనూ క్రైమ్ థ్రిల్లర్స్ ని ఇష్టపడే వాళ్ళు షూట్ ఎట్ సైట్ ని ఓ లుక్ వేయొచ్చు. మరీ తీవ్రంగా నిరాశపరచదు కాని ఖచ్చితంగా థియేటర్లోనే చూడాల్సిన బొమ్మైతే కాదు. ఎటూ సీరియల్స్ లేవు. కొత్త సినిమాలు ఆల్రెడీ చూసేశాం అనుకుంటే దీన్ని ట్రై చేయండి. లాక్ డౌన్ లో తెలుగు ఎంటర్ టైన్మెంట్ లో ఆప్షన్స్ లో తక్కువగా ఉన్న వేళ ఓ రెండు గంటల సమయాన్ని వెచ్చించవచ్చు. అదీ చాలా చాలా పరిమితమైన అంచనాలతోనే సుమా

Show comments