Idream media
Idream media
ఇప్పటి స్కూళ్లని చూస్తే నాకెందుకో కోళ్ల ఫారాలు గుర్తుకొస్తాయి. వైవిధ్యం వుండదు. గవర్నమెంట్ స్కూళ్లలో పేద పిల్లలు, నారాయణ, చైతన్యలో మధ్య తరగతి , ఢిల్లీ పబ్లిక్‌లో డబ్బున్న వాళ్లు. స్కూల్లోనే వర్గీకరణ జరిగిపోయింది.
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో లండన్‌లోని పిల్లలందరిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మురికివాడల పిల్లలు , ధనవంతుల పిల్లలు ఇద్దరూ ఒకేచోట వున్నారు. ఒకర్ని చూసి ఒకరు ఆశ్చర్యపోయారట! ఇంత పేద పిల్లలు ఉంటారని వాళ్లకి , డబ్బున్న వాళ్ల పిల్లల గురించి వీళ్లకి మొదటిసారి తెలిసింది.
మనకీ పరిణామం పెద్ద వూళ్లలో 1975 తర్వాత , చిన్న వూళ్లలో 1980 తర్వాత వచ్చింది. అంతకు ముందు అందరూ ఒకే చోట. రాయదుర్గం లక్ష్మీబజార్‌లోని రాధాకృష్ణ స్కూల్ పాత బిల్డింగ్‌లో వుండేది. బంగ్లాలో జీవించే తిప్పేస్వామి మనుమడు లోక్‌నాథ్ , కొలిమి పని చేసే బషీర్‌సాబ్ కొడుకు కరీం పక్కపక్కనే. ఫేమస్ డాక్టర్, ఆ రోజుల్లోనే పియట్ కారున్న గోపాల్‌రావు కూతురు సుమిత్ర , ఉదయాన్నే ఇళ్లిళ్లు తిరిగి పాలు పోసి , స్కూల్‌కొచ్చే పద్మావతి ఇద్దరూ పక్కపక్కనే కూర్చొని పాఠాలు వినేవాళ్లు. క్లాస్‌లో మిల్లు బట్టల వాళ్లు (రాయదుర్గంలో జయంతి కాటన్ మిల్లు ఉండేది. అక్కడ తయారయ్యే మిల్లుబట్టలు) టెర్లిన్ చొక్కాల వాళ్లు స్నేహం చేసేవాళ్లు. చెప్పుల్లేకుండా చిరుగుల బట్టల వాళ్లు , ఇంటర్వెల్‌లో ఇంటికెళ్లినా తినడానికి ఏమీ లేనివాళ్లు, తనతో పాటు స్నేహితురాళ్లకి దోసెలు ఆర్డర్ వేయగలిగే హోటల్ ఓనర్ కూతురు మాలతి అందరిదీ ఒకే క్లాస్.
ఇంటర్వెల్‌లో స్కూల్ దగ్గర అమ్మే దేన్నైనా కొని తినగలిగే బీడీల నీలకంఠప్ప కొడుకు మహేశ్, వాడితో స్నేహం చేస్తే కొంచెం పెడతాడని ఆశపడే ఖాసీం మంచి స్నేహితులు. పిల్లలం మాకు మా స్థాయి గురించి అవగాహన లేదు కానీ, జీతాలు సరిగా రాని అయ్యవార్లకు తెలుసు. ఖాసీంకి పడినన్ని దెబ్బలు మహేశ్‌కి పడేవి కావు.
ఒకవేళ అప్పటికి ప్రైవేట్ స్కూళ్లు వుంటే మహేశ్, ఖాసీం ఎప్పటికీ కలిసేవాళ్లు కాదు. నాలాంటి బుడ్డా పక్కీర్లతో కలిసి సుమిత్ర ఎప్పటికీ చదవదు. ఆమెది ఢిల్లీ పబ్లిక్ స్కూల్ స్థాయి. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అన్నాడు మార్క్స్. మార్క్సిజం బాగా చదువుకున్న వాళ్లకి కూడా ఆర్థిక సంబంధాలు అర్థమైనట్టుగా మానవ సంబంధాలు అర్థం కావు. అయితే మార్క్స్ సూత్రాన్ని అందరికంటే బాగా ప్రైవేట్ స్కూళ్ల వాళ్లు అర్థం చేసుకున్నారు.
మనుషులంతా సమానం కాదు, వర్గాలుగా వుంటేనే వ్యాపారం. ఆర్థిక సంబంధాలు అర్థమైతే మానవ సంబంధాలు అర్థం కాకపోయినా నష్టం లేదు. బాల్య దశలో ఈ విత్తనాలు నాటితే భవిష్యత్‌లో ఇది మహావృక్షమై సమాజం మొత్తం వ్యాపార సమాజంగా పరిణామం చెందుతుందని 1970 తర్వాత మేథో నిపుణులు ఆలోచించి చదువుని అమ్మకంగా పెట్టారు. ఈ ప్రమాదాల్ని ముందుగా గుర్తించి తాకట్టులో భారతదేశం అని తరిమెల నాగిరెడ్డి హెచ్చరించారు. ఎవరూ వినలేదు. కుదువలో ఉన్న దేశం , వేలానికి కూడా వచ్చేసింది.
ఊళ్లలోకి స్కూల్ బస్సులు వచ్చిన తర్వాత చాలా విచిత్రాలు జరిగాయి. రాయలసీమ జిల్లాల్లో ప్యాక్షన్ తగ్గిపోయింది. కెరీరిజం చదువు వల్ల ఉపయోగం ఏమంటే నిరంతరం మార్కులు, ర్యాంకులు మెదడుని ఆక్రమించడం వల్ల ఎమోషన్స్ తగ్గిపోయి బ్రాయిలర్ కోడి లక్షణాలు వస్తాయి. ఫారం కోడి పందేనికి పనికి రాదు. పాతతరం వాళ్లు హ్యాంగోవర్‌తో కొట్టుకోవాల్సిందే కానీ, కొత్తతరానికి ఫోన్ చూసుకునేకి టైం లేదు.
కమ్యూనిస్టు పార్టీలకి కార్యకర్తలు కరువవడానికి కూడా ఈ చదువులే కారణం. 1979లో నేను అనంతపురం విద్యార్థిగా ఉన్నప్పుడు విపరీతమైన రాజకీయ చైతన్యం వుండేది. విద్యార్థి సమస్యలపై ఏఐఎస్ఎఫ్ చురుగ్గా పోరాడేది. ధర్నాకి పిలుపిస్తే వందల మందితో సుభాష్ రోడ్డు నిండిపోయేది.
40 ఏళ్లలో వచ్చిన మార్పు ఏమంటే యువకుల్లో రాజకీయ భావజాలం లేకుండా చేసి డబ్బు, వస్తు వ్యామోహం పెంచేశారు. సిస్టంని ఉపయోగించుకుని బాగుపడదామనే వాళ్లు తప్ప , సిస్టింకి వ్యతిరేకంగా మాట్లాడి పోరాడేవాళ్లు లేరు.
వామపక్ష నాయకత్వం అంతా 50+కి చేరుకుంది. కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక చదివిన వాళ్లు 100కి ఒక్కరు కూడా లేనిస్థితి. ప్రజాస్వామ్యానికి ప్రమాదమంటూ వస్తే కమ్యూనిస్టుల వల్లేనని బూర్జువాల నమ్మకం. ఇప్పట్లో అయితే ఆ ప్రమాదం లేదు.
రెండు శక్తులు ఘర్షణ పడితే మూడో శక్తి పుడుతుంది. కాలం ఎప్పుడూ ఆ పనిలో వుంటుంది.