సోలో బ్రతుక్కి స్వీట్ శ్లోకాలు

అతనో బ్యాచిలర్. కుర్రాళ్ళు జీవితంలో ప్రశాంతంగా ఉండి లక్ష్యాలను సాధించాలంటే పెళ్లి చేసుకోకూడదనేది తన పాలసీ. ఎందరో యువకులకు స్ఫూర్తినిస్తుంటాడు. అంతే కాదు వందకు పైగా శ్లోకాలతో ఏకంగా సోలో బ్రతుకే సో బెటరూ అనే పుస్తకమే రాస్తాడు. దాన్ని స్టేజిపై రిలీజ్ చేసి అందరితో ఎవరికీ మూడు ముళ్ళు వేయమని ప్రమాణం కూడా చేయించుకుంటాడు. ఇతనికి మ్యారేజ్ అంటే ద్వేషం ఏ స్థాయిలో ఉంటుందంటే సమాజంలో వివిధ రంగాలలో ఉన్నత శిఖరాలను అధిరోహించిన లతా మంగేష్కర్, అటల్ బిహారి వాజ్ పేయ్, పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తి, మథర్ థెరెసా, దివంగత ప్రెసిడెంట్ అబ్దుల్ కలామ్ లను ఆరాధించేటంత.

ఇవాళ విడుదల చేసిన సోలో బ్రతుకే సో బెటరూ సినిమా టీజర్ ఉన్న సారాంశం ఇది. ఇలా వందేసి శ్లోకాలతో హీరో అందరికీ పెళ్లి చేసుకోవద్దని ప్రవచనాలు ఇవ్వడం బాగానే ఉంది కానీ సినిమా మొత్తం అదే ఉందేమోనన్న అనుమానం కలుగుతోంది. మన్మథుడులో నాగార్జున క్యారెక్టర్ ని యూత్ ఫుల్ గా మారిస్తే దానికి ప్రతిరూపమే సాయి తేజ్ లా కనిపిస్తోంది. అయితే ఇతగాడికి పెళ్లి మీద ఎందుకంత విరక్తి కలిగింది, దానికి దారి తీసిన కారణాలు ఏంటి, మరి హీరోయిన్ నభా నటేష్ వల్ల ప్రేమ ఎలా చిగురించింది లాంటి ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే వేచి చూడాల్సిందే.

సుబ్బు దర్శకుడిగా పరిచయమవుతున్న సోలో బ్రతుకే సో బెటరూకు తమన్ సంగీతం సమకూరుస్తున్నాడు. ఇప్పటికే మూడు పాటలు మంచి స్పందన దక్కించుకున్నాయి. లాక్ డౌన్ తర్వాత స్ట్రెయిట్ గా థియేటర్లలో విడుదల అవుతున్న పెద్ద తెలుగు సినిమా ఇదే కావడంతో ఓపెనింగ్స్ మీద భారీ అంచనాలు ఉన్నాయి. సగం సీటింగ్ అనుమతులే ఉన్నప్పటికీ కలెక్షన్ల పట్ల ట్రేడ్ సైత ఆశాభావంతో ఉంది. దీని ఫలితాన్ని బట్టి తమ రిలీజులు షెడ్యూల్ చేసుకునేందుకు ఇతర నిర్మాతలు వేచి చూస్తున్నారు. డిసెంబర్ 25న సో బ్రతుకే సో బెటరూని భారీ ఎత్తున థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు.

Link Here @ bit.ly/3496tAF

Show comments