ములాయంకు అస్వస్థత

క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్న సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు,ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్‌ యాదవ్‌ అనారోగ్యానికి గురయ్యారు. అస్వస్థతకు గురైన ఆయనను గురుగ్రామ్‌లోని మేదాంతా ఆసుపత్రిలో కుటుంబసభ్యులు చేర్పించారు.

గతేడాది కూడా ములాయం సింగ్‌ యాదవ్‌ మూత్రాశయంలో ఇన్‌ఫెక్షన్ కారణంగా ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు.ప్రస్తుతం 81ఏళ్ల ఆయనకి వయసు రీత్యా ఏర్పడిన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.కాగా ఆయన అనారోగ్యానికి గల కారణాలు గురించి వైద్యులు వివరాలు వెల్లడించలేదు. ప్రస్తుతం వైద్య బృందం ఆయనకు అన్ని రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.

1992లో ములాయం సింగ్‌ యాదవ్‌ సమాజ్‌వాదీ పార్టీని స్థాపించి ఉత్తర్ ప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా మూడుసార్లు పనిచేశారు.ఆనాటి యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో 1 జూన్ ,1996 నుంచి 19 మార్చి 1998 వరకు కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన తనయుడు అఖిలేశ్ యాదవ్ కూడా 2012 నుంచి 2017 వరకు యూపీ ముఖ్యమంత్రిగా పనిచేశారు.

వయోభారంతో ములాయం సింగ్‌ సమాజ్‌వాదీ పార్టీ నాయకత్వాన్ని కుమారుడు అఖిలేశ్‌కు అప్పగించారు.కానీ తర్వాత కాలంలో సీనియర్ నేత కుటుంబంలో ఏర్పడిన విభేదాలతో సమాజ్‌వాదీ పార్టీ చీలిక ప్రమాదాన్ని ఎదుర్కొన్నప్పటికీ తండ్రి,కొడుకుల రాజీతో సంక్షోభానికి తెరపడింది.ఎస్పీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి బాబాయ్ శివపాల్‌ను తప్పించడంతో మొదట వివాదం మొదలయ్యింది. అఖిలేష్ యాదవ్ వైఖరికి నిరసనగా ములాయం సోదరుడు శివపాల్ సింగ్ ఆగస్టు 2018లో ఎస్పీ నుంచి బయటకు వచ్చాడు.తర్వాత ఆయన సమాజ్ వాదీ సెక్యులర్ మోర్చా అనే కొత్త పార్టీని ఏర్పాటు చేశాడు.

ఇదిలా ఉంటే వచ్చే ఏడాది ప్రారంభంలో జరగబోయే యూపీ అసెంబ్లీ ఎన్నికలలో సమాజ్‌వాదీ పార్టీ గెలుపే లక్ష్యంగా అఖిలేశ్‌ వ్యూహాలకు పదును పెడుతున్నాడు.

Also Read : సిద్ధుకు పదవి దక్కేనా?

Show comments