అప్పట్లో మహారాజుకే కార్ అమ్మలేదు,తెలుసా?

కర్ణాటక రైతును “నువ్వు ఈ కారు కొనలేవులే” అని ఒక బెంగుళూరు కార్ల షోరూంలోని సేల్స్ ఎగ్జిక్యూటివ్ అవమానించిన సంఘటన దాదాపు ఒక శతాబ్దం క్రితం లండన్ లో లగ్జరీ కార్ల కంపెనీ రోల్స్ రాయిస్ షోరూంలో నాటి ఆళ్వార్ సంస్థానాధీశుడు ఎదుర్కొన్నారు. డబ్బులు మొహాన కొట్టి కారు కొన్న కర్ణాటక రైతులాగా, అంతకు మించిన ప్రతీకారం ఆ కంపెనీ మీద తీర్చుకున్నాడు ఆళ్వార్ మహరాజా.

నాటి రాజులకు ఇష్టమైన కారు

1909లో ఉత్పత్తి ప్రారంభించిన ఇంగ్లాండుకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ 1920 నాటికి ఇరవై వేల కార్లు తయారు చేస్తే అందులో రెండు వేల కార్లు భారతదేశంలో ఉన్నాయి. ఆనాటికి దేశంలో అధిక భాగంలో రోడ్లు ఈ కార్లు నడవడానికి తగిన విధంగా లేకపోయినా, ఈ లగ్జరీ కార్ల దిగుమతికి అది అడ్డంకి కాలేదు. ఆనాటికి దేశంలో ఓ మోస్తరు సైజు, ఆదాయం ఉన్న సంస్థానాలు దాదాపు 230 ఉండేవి. రోల్స్ రాయిస్ కంపెనీకి మహరాజ పోషకులు ఈ సంస్థానాల పాలకులే . ఆనాడు సువిశాలమైన బ్రిటిష్ ఇండియాని పాలించే వైస్రాయి దగ్గర ఒక రోల్స్ రాయిస్ కారు ఉంటే నాటి పాటియాలా సంస్థానాన్ని పాలించిన భూపిందర్ సింగ్ దగ్గర పదహారు రోల్స్ రాయిస్ కార్లు ఉండేవి.

ఆళ్వార్ రాజుకి అవమానం

1920 లో ఏదో స్వంత పనిమీద ఇంగ్లాండు రాజకుటుంబాన్ని కలవడానికి లండన్ వచ్చిన ఆళ్వార్ సంస్థానాధీశుడు మహరాజా జైసింగ్ ఒక సాయంత్రం తన సహాయకులతో కలిసి లండన్ లోని మే ఫెయిర్ ప్రాంతంలో వ్యాహ్యాళికి వెళ్తుండగా అక్కడ ఉన్న రోల్స్ రాయిస్ షోరూం కనిపించింది. కొత్త కారు కొనడం కూడా రాజావారు చేయాలనుకున్న పనుల్లో ఒకటి కాబట్టి అందులో అడుగుపెట్టారు. ఆ సమయంలో రాజావారు మామూలు బట్టల్లో ఉన్నారు. వారిని చూసిన అక్కడి సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఎవరో పనిపాట లేకుండా టైమ్ పాస్ కోసం వచ్చిన భారతీయులు అని భావించాడు.

ఇంగ్లీషు వచ్చిన రాజావారి మంత్రి కారు గురించి విచారణ చేస్తుండగా, “మీ మొహాలు కొనగలిగే కార్లు కావు ఇవి” అని చీత్కారంగా మాట్లాడాడు ఆ సేల్స్ ఎగ్జిక్యూటివ్. అతను అన్న మాటలు అనువాదం లేకుండానే అర్థం చేసుకున్న జైసింగ్ మౌనంగా తను ఉంటున్న హోటల్ కి తిరిగి వచ్చాడు. అక్కడ నుంచి రోల్స్ రాయిస్ షో రూంకి ఫోన్ చేయించి, “ఆళ్వార్ మహారాజా వారు కారు కొనడానికి కాసేపటిలో షోరూంకి రాబోతున్నారు”అని చెప్పించాడు. ఈసారి రాజావారు తను అధికారిక కార్యక్రమాల్లో ధరించే తన ఆభరణాలు, దుస్తులు ధరించి కారులో షోరూంకి వెళ్ళాడు.

అప్పటికే విషయం తెలుసుకున్న షోరూం సిబ్బంది ఎర్ర తివాచీ పరిచి అందరూ వచ్చి చేతులు కట్టుకుని వినయంగా నిల్చుని ఉన్నారు. రాజావారు షోరూంలో ఎన్ని కార్లు ఉన్నాయో అడగమని తన మంత్రికి చెప్పాడు. మొత్తం ఆరు కార్లు ఉన్నాయి. ఆరు కార్ల ధర, భారతదేశానికి పంపడానికి రవాణా ఖర్చులు కలిపి ఎంత అవుతుందో లెక్కకట్టి చెప్పమని అడిగాడు. సేల్స్ ఎగ్జిక్యూటివ్ పెన్నూ, పేపరు తీసుకుని చకచకా లెక్క కట్టి చెప్పాడు. ఆ మొత్తానికి అప్పటికప్పుడు తన అకౌంట్ ఉన్న ఇంగ్లాండు బ్యాంకు చెక్కు రాసి ఇచ్చాడు మహరాజా జైసింగ్. దాంతో పాటు అక్కడి సేల్స్ సిబ్బందికి ధారాళంగా టిప్పు కూడా ఇచ్చాడు.

రాజావారి ప్రతీకారం

తను కొన్న ఆరు రోల్స్ రాయిస్ కార్లు తనకు అందిన వెంటనే వాటిని ఆళ్వార్ నగర పురపాలక సంస్థకి అప్పగించాడు మహరాజ జైసింగ్. వాటికి చీపుర్లు కట్టి రోడ్లు ఊడ్చి, ఆ చెత్తను ఆ కార్లలోనే ఎత్తిపోయమని ఉత్తర్వులు జారీచేశాడు. కొద్ది రోజులకు ఈ విషయం ప్రపంచమంతా పాకిపోయింది. చీపుర్లు కట్టి వీధులు ఊడుస్తున్న రోల్స్ రాయిస్ కార్ల ఫోటోలు అన్ని పత్రికల్లో వచ్చాయి. కోటీశ్వరులు మాత్రమే వాడే కారుగా పేరున్న ఆ కంపెనీ ప్రతిష్ఠ మంటకలిసి పోయింది.

లండన్ నుంచి రోల్స్ రాయిస్ ప్రతినిధి ఒకరు ఆఘమేఘాల మీద వచ్చి రాజావారికి క్షమాపణలు చెప్పి, “ఆరు కొత్త కార్లు ఉచితంగా ఇస్తాం, ఆ వీధులు చిమ్మే కార్లు మాకు ఇచ్చేయండి. ఇకనుంచీ మా కంపెనీ కార్లు మీరే వాడండి” అని కాళ్ళమీద పడ్డాక శాంతించి తను మున్సిపాలిటీకి ఇచ్చిన కార్లు రోల్స్ రాయిస్ కంపెనీ వారికి తిరిగిచ్చి, వారు ఇచ్చిన సరికొత్త కార్లను స్వీకరించాడు ఆళ్వార్ మహారాజా జైసింగ్.

Show comments