తమిళనాడులో “యువ”,”రంగం” తరహా సరికొత్త రాజకీయం

తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త ఘట్టం ఆవిష్కృతమైంది. రంగం సినిమా తలపించే రీతిలో అవినీతిపై ఓ మాజీ ఐఏఎస్ అధికారి పోరాటం చేపట్టారు. ఒకరు కాదు ఇద్దరు కాదు 20 మంది పట్టభద్రులను ఎన్నికల బరిలో దింపి దేశ రాజకీయాల్లో సరికొత్త అంకానికి నాంది పలికారు.

రంగం సినిమాలో మాదిరి కొందరు యువకులు కలిసి ఏర్పాటుచేసిన పార్టీ ఎన్నికల్లో ఎలా పోటీ చేస్తుందో అదే విధంగా తమిళనాడులో ప్రస్తుతం అదే పరిస్థితి ఏర్పడింది. తమిళనాడు ఎన్నికల్లో 20 మంది యువకులు తలపండిన రాజకీయ నాయకులను ఢీకొననున్నారు. ఆ యువశక్తి వెంట ఓ శక్తి ఉంది. ఆయనే యు.సగాయం. ఆయన మాజీ ఐఏఎస్‌ అధికారి. ఆయన ఇంజనీర్లు, డాక్టర్లు, న్యాయవాదులు, ఎంబీఏ గ్రాడ్యుయేట్లను ఎన్నికల రాజకీయాల్లోకి దింపనున్నారు.

ఎవరు ఈ సగాయం?

1989 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి యు. సగాయం 1990లో తమిళనాడులో డిప్యూటీ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు. తమిళనాడు రాష్ట్రంలోని పుడుకట్టయ్ జిల్లా పేరన్ చున్నాయ్ గ్రామంలో 1962లో జన్మించిన సగాయం చిన్నతనం నుంచే సామాజిక బాధ్యతల పట్ల మక్కువ చూపేవారు. చెన్నై లోని లయోల కళాశాలలో చదువుకున్న అయిన తర్వాత సివిల్స్ రాసి ఐఏఎస్ అధికారి అయ్యారు.

ఎన్నో ఎత్తు పల్లాలు..

సగాయం తన కెరీర్లో ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు ఎక్కడ అవినీతి జరిగినా దాన్ని ఎదుర్కోవడంలో అని ముందుండేవారు. అందుకే 27 ఏళ్ల ఆయన సర్వీసులో 25 సార్లు బదిలీ అయ్యారు అంటేనే అర్థం చేసుకోవచ్చు. 1999లో కాంచీపురంలో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న పెప్సీ కంపెనీ యూనిట్ ను మూయించి వేశారు. మధురైలో అక్రమ గనుల తవ్వకాలను అడ్డుకున్నారు. 2011లో తమిళనాడు ఎన్నికల కమిషనరుగా పనిచేసిన ఆయన రాజకీయ నాయకులకు చుక్కలు చూపించారు.

ఆ తర్వాత పలు విభాగాల్లో పని చేసిన రాజకీయాల్లో జరుగుతున్న అవినీతిని గుర్తించడంతో పాటు దాన్ని ఎదుర్కొనేందుకు రాజకీయమే మార్గమని భావించారు. అందుకే చదువుకున్న యువకులను ఎన్నికల బరిలోకి దింపారు. అవినీతికి వ్యతిరేకంగా సగాయం పోరాటం చేస్తున్నాడు. అందులో భాగంగా ఆయన తమిళనాడు ఇలయంగ్‌ కట్చీ (టీఎన్‌ఐకే) అనే ఒక పార్టీ స్థాపించాడు. అందులో అంతా యువకులే పని చేస్తున్నారు.

దశాబ్ద కాలం పాటు అవినీతికి వ్యతిరేకంగా సాగిస్తున్న ఉద్యమంలో భాగంగా ఈ ఎన్నికలను వాడుకోనున్నారు. ఈ క్రమంలోనే మొత్తం 20 స్థానాల్లో తమ పార్టీ తరఫున యువకులు పోటీ చేస్తున్నట్లు ఆ మాజీ ఐఏఎస్‌ అధికారి సగాయం ప్రకటించారు. ఈ మేరకు వారిలో కొంత మంది నామినేషన్లు దాఖలు చేశారు. 15 మంది అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయనున్నట్లు తెలిపారు.

కొలాత్‌పూర్‌, రోయాపూర్‌, అన్నానగర్‌, అవడీ, అలాందుర్‌, మధురవోయల్‌, చెంగల్‌పట్టు తదితర ప్రాంతాల్లో ఆయన శిష్యులు పోటీ చేస్తున్నారు. అన్ని స్థానాల్లో పోటీ చేసే శక్తి తమకు లేదని.. అందుకే విద్యావంతులు అధికంగా ఉన్న పట్టణ ప్రాంతాల్లో పోటీ చేస్తున్నట్లు సగాయం మీడియాకు చెప్పారు.

ఇది మొదటి అడుగు.. అని ప్రజల్లోకి ఉద్యమం తీసుకెళ్లేందుకు ఎన్నికలు దోహదం చేస్తాయని తెలిపారు. భవిష్యత్‌లో మొత్తం రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో తాము పోటీ చేసేందుకు సిద్ధమని సగాయం ప్రకటించారు. అయితే ముఖ్యమంతత్రి పళనిస్వామి నియోజకవర్గం ఎడప్పాడిలో పోటీ చేయడం లేదని చెప్పడం గమనార్హం.

Also Read : కేరళ కాంగ్రెస్ లో కొత్త తలనొప్పి!

Show comments