iDreamPost
iDreamPost
సినిమా ప్రేమికులు ఊపిరి పీల్చుకున్నారు. మూడు నెలలుగా ఎదురు చూస్తున్న థియేటర్లు తెరుచుకున్నాయి. నిన్న తెలుగు రాష్ట్రాల్లో మొత్తం అయిదు స్ట్రెయిట్ తెలుగు చిత్రాలతో బాక్సాఫీస్ దగ్గర సందడి ఉండేలా కనిపించింది. మరి స్పందన ఎలా ఉందో గమనిస్తే ఈ అంశాలు కనిపించాయి. తెలంగాణలో వంద శాతం ఆక్యుపెన్సీతో పాటు నాలుగు షోలకు అనుమతులు ఉండటంతో కలెక్షన్లు పర్వాలేదు అనిపించాయి. మెయిన్ స్క్రీన్లలో 50 నుంచి 70 శాతం దాకా సీట్లు నిండగా సపోర్టింగ్ హాళ్లలో అది సగం కంటే తక్కువగా ఉంది. సత్యదేవ్, తేజ సజ్జలకు క్రౌడ్ ని ఫుల్ చేసే కెపాసిటీ లేకపోవడం వల్ల మౌత్ టాక్ మీదే ఇవి ఆధారపడ్డాయి.
ఇక ఏపిలో వివిధ కారణాల వల్ల తెరుచుకున్న థియేటర్లే 20 శాతం లోపు ఉన్నాయని ట్రేడ్ రిపోర్ట్. జిల్లా కేంద్రాలు, బిసి సెంటర్లలో స్పందన ఆశించిన స్థాయిలో లేదు. మూడు షోలకే అనుమతులు ఉన్నా జనం అంతగా ఆసక్తి చూపించనట్టుగా కనిపిస్తోంది. తిమ్మరుసు, ఇష్క్ లలో మొదటిదానికే కొంచెం పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ఉండగా రెండోది రివ్యూలతో పాటు పబ్లిక్ టాక్ కూడా సోసోగానే ఉంది. మిగిలిన నరసింహపురం, త్రయం, పరిగెత్తు పరిగెత్తు సినిమాలకు కనీసం కరెంట్ ఖర్చులైనా గిట్టుబాటు అయ్యే వసూళ్లు వచ్చాయా అంటే అనుమానమే. మొత్తంగా చూసుకుంటే తెలంగాణ, ఆంధ్రలో హౌస్ ఫుల్స్ దాదాపుగా ఎక్కడా పడలేదు.
దీన్ని విశ్లేషిస్తే ఒకటి స్పష్టమవుతోంది. ఫ్యామిలీలు బయటికి రావాలంటే కాస్త పెద్ద సినిమా పడాలి. ఫ్యాన్ బేస్ ఉన్న స్టార్ హీరో బయటికి రావాలి. టక్ జగదీశ్, లవ్ స్టోరీలాంటివి రెడీ అవ్వాలి. ఇలా మీడియం రేంజ్ సినిమాలతో జనాలను ఆకర్షించడం కష్టం. పైగా తిమ్మరుసు సైతం పర్వాలేదు అనిపించుకుంది కానీ ఓహ్ సూపర్ అనే టాక్ ఏమి లేదు. వచ్చే వారం షెడ్యూల్ చేసిన ఎస్ఆర్ కళ్యాణ మండపం మీద పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్న నేపథ్యంలో అది యూత్ ని గట్టిగా మెప్పిస్తే పరిస్థితిలో కొంత మెరుగుదల కనిపిస్తుంది. ఆగస్ట్ 13 తర్వాత పరిస్థితులు అన్నీ నార్మల్ గా వచ్చే సూచనలు కన్పిస్తున్నాయి. చూడాలి మరి
Read Thimmarusu Review: తిమ్మరుసు రివ్యూ