భార్య మాతృత్వం కోసం భర్తకు పెరోల్

భార్య మాతృత్వం కోసం భర్తకు పెరోల్

పలు కేసుల్లో దీర్ఘకాల శిక్షలు అనుభవిస్తున్న ఖైదీలను పెరోల్ పై కొన్నాళ్లపాటు విడుదల చేయడం సహజ న్యాయప్రక్రియగా కొనసాగుతోంది. అయితే అత్యవసర పరిస్థితులు, కుటుంబ సభ్యులు మరణించడం లేదా తీవ్ర అనారోగ్యానికి గురికావడం, లేదా దగ్గరుండి చూసుకోవాల్సిన అవసరం తదితర ప్రత్యేక పరిస్థితుల్లో పెరోల్ కమిటీలు, కోర్టులు ఖైదీలు పెట్టుకునే పిటిషన్లను క్షుణ్ణంగా పరిశీలించి మంజూరు చేస్తుంటాయి. కానీ ఈ పరిస్థితులకు భిన్నంగా ఓ జీవిత ఖైదీ బిడ్డను కనడం కోసం తన భార్యతో సంసారం చేసేందుకు వీలుగా పెరోల్ మంజూరు చేయడం బహుశా ఇంతకు ముందెప్పుడూ జరగలేదేమో? రాజస్థాన్ హైకోర్టు అటువంటి అరుదైన తీర్పు ఇచ్చి సంచలనం సృష్టించింది. ఓ జీవిత ఖైదీకి 15 రోజుల పెరోల్ మంజూరు చేసింది.

జిల్లా కమిటీ తిరస్కరణ

రాజస్థాన్ రాష్ట్రం అజ్మీర్ ప్రాంతానికి చెందిన నంద్ లాల్ కు ఓ కేసులో జీవిత ఖైదు శిక్ష పడింది. గత ఆరేళ్లుగా ఆయన అజ్మీర్ సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. తనకు సంతానం కలిగేందుకు వీలుగా భార్యతో కాపురం చేసేందుకు 15 రోజుల పెరోల్ మంజూరు చేయాలని కోరుతూ ఇటీవల తన భార్య ద్వారా అజ్మీర్ జిల్లా పెరోల్ కమిటీకి పిటిషన్ పెట్టుకున్నాడు. అయితే ఇటువంటి కారణాలతో పెరోల్ మంజూరు చేయలేమంటూ జిల్లా కమిటీ ఆ పిటిషన్ ను తిరస్కరించింది. దాంతో నంద్ లాల్ భార్య రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించింది.

భార్య హక్కును నిరాకరించలేం

ఈ పిటిషన్ పై జస్టిస్ ఫర్జాన్డ్ అలీ, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ వాదనలు విన్న ధర్మాసనం విస్తృత వ్యాఖ్యలు చేసింది. హిందూ తదితర మత సంప్రదాయాలు, భారతీయ సంస్కృతి, మన చట్టాలు వివాహితులు పిల్లలను కనడం హక్కుగా గుర్తిస్తున్నాయని పేర్కొంది. సంతానంతోనే వైవాహిక జీవితానికి సంపూర్ణత్వం లభిస్తుందని, వంశాభివృద్ధికి సంతానం పొందడం హక్కు, బాధ్యతగా ఘిషిస్తున్నాయని న్యాయమూర్తులు స్పష్టం చేశారు. అందువల్ల ఒక ఖైదీ భార్య అన్న కారణంతో పిల్లలు కనే అవకాశం ఇవ్వకపోవడం ఆ భార్య హక్కులను హరించడమేనని కోర్టు వ్యాఖ్యానించింది. ఆమె ఏ నేరం చేయలేదు, భర్త చేసిన నేరంతో ఆమెకు సంబంధం లేనప్పుడు మాతృత్వ హక్కును నిరాకరించడం ఒక విధంగా శిక్షించడమే అవుతుంది అంటూ జీవిత ఖైదీ నంద్ లాల్ కు 15 రోజుల పెరోల్ మంజూరు చేస్తూ ధర్మాసనం తీర్పు ఇచ్చింది. రూ.25 వేల విలువైన రెండు ష్యూరిటీ బాండ్లు తీసుకుని అతన్ని విడుదల చేయాలని ఆదేశించింది.

Show comments