ఇచ్చే ఉద్దేశం లేకపోయినా ఏపీకి మోదీ ఇస్తున్నారట..!

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో రైల్వే జోన్‌ ఏర్పాటు చేస్తున్నామని బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు అన్నారు. విశాఖ కేంద్రంగా రైల్వేజోన్‌ త్వరలోనే ఏర్పాటవుతుందని ఆయన పేర్కొన్నారు. దాదాపు 8 ఏళ్లుగా ఈ మాట చెబుతూనే ఉన్నా.. కొత్తగా చెప్పినట్లుగా జీవీఎల్‌ గుంటూరులో మీడియా సమావేశంలో మాట్లాడారు. అంతేకాదు కొత్తగా మరే ఇతర జోన్‌ ఇచ్చే ఉద్దేశం రైల్వే శాఖకు లేకపోయినా.. ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్‌కు ఇస్తున్నారని తెలియజేశారు. తద్వారా బీజేపీ సర్కార్‌ దేశంలో ఏ రాష్ట్రానికి ఇవ్వని ప్రాధాన్యత ఏపీకి ఇస్తున్నట్లుగా జీవీఎల్‌ చెప్పదలుచుకున్నారు.

ఎవరికి ఇవ్వనిది ఏపీకి ఇస్తున్నారని, అదీ మోదీ ఇస్తున్నారని జీవీఎల్‌ చెప్పడం విడ్డూరంగా ఉంది. రైల్వే జోన్‌ ఏర్పాటు ప్రధాని లేదా బీజేపీ దయపై ఇచ్చేది కాదన్న విషయం జీవీఎల్‌ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందనే మాట వినిపిస్తోంది. రైల్వే జోన్‌ ఏపీ హక్కు. అదీ చట్టబద్ధమైన హక్కు. రాష్ట్రాన్ని విభజించే సమయంలో.. విభజన చట్టంలో రైల్వే జోన్‌ ఏర్పాటు చేస్తామనే అంశాన్ని పొందుపరిచారు. ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్‌లో అప్పటి ప్రధాని మన్‌మోహన్‌ సింగ్‌ ప్రకటన చేశారు. ఆ విషయం చట్టంలో పొందుపరచలేదు.

చట్టంలో పొందుపరచని, పార్లమెంట్‌లో ప్రధాని ఇచ్చిన హామీ అయిన ప్రత్యేక హోదాను 2014లో కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కలిసి అధికారాన్ని పంచుకున్న టీడీపీ, బీజేపీలు అటకెక్కించాయి. కంటికి కనపడని ప్రత్యేక ప్యాకేజీని చంద్రబాబు అడగడం, కేంద్రం ప్రకటించడం, దాన్ని చంద్రబాబు స్వాగతించడం.. అన్నీ కళ్లముందే జరిగాయి. అయితే ప్రత్యేక ప్యాకేజీ వల్ల రాష్ట్రానికి ఏమి వచ్చిందో ఇప్పటికీ ప్రజలకు అర్థంకావడం లేదు. చట్టంలో లేకపోయినా పార్లమెంట్‌లో ప్రధాని ఇచ్చిన హామీ అయిన ప్రత్యేకహోదాతో పాటు.. విభజన చట్టంలో ఉన్న రైల్వేజోన్‌ కూడా ఇంకా మాటల్లోనే కనిపిస్తోంది. దాదాపు ఎనిమిదేళ్లుగా మాటల్లో ఉన్న రైల్వేజోన్‌.. ఎప్పటికి ఏర్పాటు అవుతుందో బహుశా జీవీఎల్‌కైనా తెలుసో, లేదో..?

రైల్వేజోన్‌ ఏర్పాటు అంశం రాష్ట్రవిభజన చట్టంలో ఉందన్న విషయం జీవీఎల్‌ మరిచిపోయినట్లుగా ఉన్నారు. అందుకే ఆయన మరే ఇతర జోన్‌ ఇచ్చే ఉద్దేశం రైల్వే శాఖకు లేకపోయినా.. ఏపీకి ప్రధాని మోదీ ఇస్తున్నారంటూ చెప్పుకొస్తున్నారు. ఏపీకి రైల్వే జోన్‌ అనే విషయం చట్టబద్ధమైన హక్కు అన్న సంగతి జీవీఎల్‌ నరసింహారావు మరచిపోయినా.. ఏపీ ప్రజలకు మాత్రం ఇంకా గుర్తే ఉంది. ఏపీపై మోదీకి ప్రత్యేకమైన అభిమానం ఉందని, బీజేపీ ఏదో చేస్తుందని చెప్పుకోవాలనుకుంటే.. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిలిపివేయాలి, ప్రత్యేక హోదా ఇవ్వాలి… వీటితోపాటు విభజన చట్టంలోని అంశాలను అమలు చేయాలి.. అప్పుడు జీవీఎల్‌ చెప్పకపోయినా.. ప్రధాని మోదీ ఏపీకి మంచిచేశారని ప్రజలు భావిస్తారు. తద్వారా బీజేపీకి రాజకీయంగా అంతో ఇంతో మంచి జరుగుతుంది. ఇలా కాకుండా మసిపూసి మారేడు కాయ చేయాలనుకుంటే లాభం లేకపోగా.. నష్టం ఎక్కువగా ఉంటుంది.

Also Read : రాష్ట్ర విభజనపై సుప్రీంకోర్టులో అత్యవసర విచారణ !

Show comments