యూపీ “పవర్ కీ” పూర్వాంచల్‌ – దక్కేది ఎవరికో.?

ఒకనాడు సోషలిస్టు భావజాలానికి పట్టంకట్టిన ప్రాంతం.. గత 15 ఏళ్లుగా ఆ ప్రాంతం ఏ పార్టీకి జై కొడితే వారిదే యూపీ అధికార పీఠం..ప్రధాని మోడీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసి, యూపీ సీఎం సొంత నియోజకవర్గం గోరఖ్‌పూర్‌ ఉంది అక్కడే..అదే పూర్వాంచల్‌గా పేరొందిన తూర్పు యూపీ..

పూర్వాంచల్‌లో ఏ పార్టీ ఆధిపత్యం సాధిస్తే వారిదే ముఖ్యమంత్రి పీఠం అనేది యూపీ రాజకీయ వర్గాల్లో నానుడి. పూర్వాంచల్‌ పరిధిలో 26 జిల్లాలు ఉండగా, వాటిలో156 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.గత మూడు అసెంబ్లీ ఎన్నికలలో మూడు వేర్వేరు పార్టీలు పూర్వాంచల్‌లో అధిక స్థానాలను గెలిచి అధికార పగ్గాలు చేపట్టాయి. 2007 ఎన్నికల్లో బీఎస్పీ 70 స్థానాలు గెలుచుకోగా దళిత నాయకురాలైన మాయావతి అధికారం చేపట్టింది.2012 ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ 85 సీట్లు గెలుచుకోవడంతో అఖిలేశ్‌ యాదవ్‌ యూపీ గద్దెని అధిష్టించారు.2017 ఎన్నికలలో బీజేపీ పూర్వాంచల్‌లో ఏకపక్ష విజయం సాధిస్తూ 106 సీట్లు కైవసం చేసుకుంది.ఈ ప్రాంతంలోని యాదవుల ఆధిపత్యము గల ఆజంగఢ్‌ మినహా వారణాసి, మీర్జాపూర్‌, బడోహి తదితర జిల్లాల్లో బీజేపీ సంపూర్ణ ఆధిక్యత ప్రదర్శించింది.

అప్పటి 2017 ఎన్నికల్లో రాజ్‌భార్ యొక్క సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీతో మైత్రి బీజేపీకి పూర్వాంచల్‌లో ఘనవిజయానికి దోహదపడింది.కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఈసారి పూర్వాంచల్‌ ప్రాంతంలో గట్టి పట్టున్న ఓం ప్రకాష్ రాజ్‌భార్‌ నేతృత్వంలోని ఎస్‌బిఎస్‌పి, సమాజ్‌వాదీల మధ్య పొత్తు పొడిచింది.గత ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా ఉన్న రాజ్‌భార్, తివారీ వర్గీయులు సమాజ్‌ వాదీ వైపు మొగ్గు చూపుతున్నారు.పైగా ఎన్నికలవేళ యాదవేతర ఓబీసీలైన మౌర్య,చౌహాన్,కుర్మీ తదితర కులాల ప్రముఖ నేతలంతా సమాజ్‌వాదీ గుమ్మం తొక్కడం కాషాయ దళానికి మింగుడు పడట్లేదు.

ఉత్తరప్రదేశ్‌లో యాదవేతర ఓబీసీ రాజకీయాలకు పూర్వాంచల్ పెట్టింది పేరు.కొంతకాలంగా ఓబీసీ నాయకులు వినిపిస్తున్న వెనుకబడిన కులాల జనాభా గణన చెయ్యాలనే డిమాండ్‌ను మోడీ సర్కార్‌తోపాటు యోగి సర్కార్ కూడా తిరస్కరించింది.ఇదే సమయంలో సమాజ్‌వాదీ అధికారంలోకి వస్తే మూడు నెలలలోగా బీసీ జనాభా గణన చేపడతానని అఖిలేశ్ యాదవ్ ప్రకటించారు. దీంతో గత ఎన్నికల్లో బీజేపీకి ఓటేసిన ఓబీసీలు ఈసారి ఎస్పీ వైపు మొగ్గు చూపుతున్నారు. పైగా యోగి ఆదిత్యనాథ్ పాలనలో తమ సామాజిక, ఆర్థిక పరిస్థితులు దిగజారిపోవడం వల్ల ఓబీసీలలో తీవ్ర ఆగ్రహజ్వాలలు పెల్లుబుకుతున్నాయి. దీనిని సొమ్ము చేసుకోవడానికి కుల అంకగణితాలతో సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవేతర ఓబీసీ నేతలను అక్కున చేర్చుకుంటున్నారు.

ఇక పూర్వాంచల్ ప్రజలు వరుసగా ఒకే పార్టీకి గంపగుత్తగా ఓటు వేసిన దాఖలాలు లేవు. తూర్పు యూపీపై అధికార బీజేపీ పట్టుసడలి పోతున్న విషయాన్ని కాషాయ అగ్రనేతలు పసిగట్టారు. దీంతో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పూర్వాంచల్‌ కేంద్రంగానే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. రెండు నెలలపాటు బీజేపీ అగ్రనాయకత్వం పూర్వాంచల్‌లో కాషాయ శ్రేణులతో వందలాది భేటీలు నిర్వహించి ఎన్నికలను ఎదుర్కోవడానికి దిశానిర్దేశం చేసింది.గత మూడు నెలలుగా ఈ ప్రాంతంపై దృష్టిపెట్టిన ప్రధాని మోడీ సుడిగాలి పర్యటనలు చేస్తూ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.కాగా తన రాజకీయ ఆధిపత్యానికి చిల్లుపడుతున్నట్లు గ్రహించిన బీజేపీ ఓబీసీలను ప్రసన్నం చేసుకునేందుకు హిందూత్వ ఎజెండా, అభివృద్ధి మంత్రాన్ని జపిస్తోంది.

కాగా పూర్వాంచల్‌లో బీఎస్పీ బలహీనపడిన నేపథ్యంలో పేరుగాంచిన ఓబీసీ నేతలు అఖిలేష్ సైకిల్ ఎక్కడంతో సమాజ్‌వాదీ,బీజేపీల మధ్య ముఖాముఖి పోరుగా మారింది. ఇప్పటికీ పూర్వాంచల్ ఓటర్ల ఒకింత మొగ్గు ఎస్పీ వైపు కనిపిస్తున్నప్పటికీ ఓటింగ్ సమయం వరకు కొనసాగుతుందా లేదా అనేది నిర్దిష్టంగా చెప్పలేని పరిస్థితి క్షేత్రస్థాయిలో నెలకొంది.

Show comments