పంజాబ్‌ పోరు ముంగిట ఆసక్తికర పరిణామాలు

పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం శుక్రవారంతో ముగిసింది. ఇక్కడ 117 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఒకే దశలో ఆదివారం పోలింగ్‌ జరగనుంది. రెండురోజుల్లో ఎన్నికలు ఉండగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సిక్కు ప్రముఖులకు ఆతిథ్యం ఇవ్వడం ఆసక్తిగా మారింది. సిక్కుల ఓట్లు అత్యంత కీలకమైన పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఆతిథ్యం మోదీ చాణక్యతకు నిదర్శనంగా నిలుస్తోందని పరిశీలకులు భావిస్తున్నారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం పలువురు సిక్కు ప్రముఖులను తన నివాసానికి ఆహ్వానించారు. వారికి ఆతిథ్యం ఇచ్చారు. సిక్కుల ఓట్లు అత్యంత కీలకమైన.. పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు రెండు రోజుల ముంగిట ఈ పరిణామం జరగడం గమనార్హం. కాగా, 31 మంది సిక్కు ప్రముఖుల బృందాన్ని మోదీ సాదరంగా ఆహ్వానించారు. సిక్కులకు తమ ప్రభుత్వం చేసిన మేలును ఈ సందర్భంగా వివరించారు. ఇకపైనా వారి సంక్షేమానికి నిరంతరం పాటుపడతామని మోదీ చెప్పినట్లు బీజేపీ నేత మన్జీందర్‌ సింగ్‌ సిర్సా మీడియాకు వెల్లడించారు.

1965, 1971 యుద్ధాల సందర్భంగా సిక్కులకు చెందిన కర్తార్‌పూర్‌ సాహిబ్‌ వంటి పవిత్ర స్థలాలను పాకిస్థాన్‌ నుంచి చేజిక్కించుకునే అవకాశం ఉన్నప్పటికీ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆ పని చేయలేకపోయిందని సిక్కు ప్రముఖుల వద్ద మోదీ విచారం వ్యక్తం చేసినట్లు సిర్సా తెలిపారు. మోదీ ప్రధాని అయ్యాక.. కర్తార్‌పూర్‌ సాహిబ్‌ కారిడార్‌ను తిరిగి ప్రారంభించారని గుర్తుచేశారు. కాగా, ప్రధానిని కలిసినవారిలో ఢిల్లీ గురుద్వారా కమిటీ అధ్యక్షుడు హర్మీత్‌ సింగ్‌ కల్కా, పద్మశ్రీ గ్రహీత బాబా బల్బీర్‌ సింగ్‌ సిచేవాల్‌, అమృత్‌సర్‌లోని ముఖి డేరాబాబా తారా సింగ్‌కు చెందిన సంత్‌ బాబా మేజర్‌ సింగ్‌వా తదితరులున్నారు. పంజాబ్‌లో డేరాల ప్రాబల్యం చాలా ఎక్కువ. 13 వేల గ్రామాలకు గాను 70 శాతం గ్రామాల్లో డేరాలున్నాయి.

ఇదిలా ఉండగా.. ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌.. ప్రత్యేక ఖలిస్థాన్‌కు మద్దతుదారు అని ఆమ్‌ ఆద్మీ పార్టీ మాజీ నాయకుడు, కవి కుమార్‌ విశ్వాస్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ ఆరోపణలపై జవాబివ్వాలంటూ కేజ్రీని అధికార కాంగ్రెస్‌ డిమాండ్‌ చేస్తోంది. నిజమా, కాదా? చెప్పమంటూ కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ట్వీట్‌ చేశారు. వీటిపై విచారణ జరిపించాలంటూ ప్రధాని నరేంద్ర మోదీని పంజాబ్‌ సీఎం చన్నీ కోరారు. విమర్శల దాడికి కేజ్రీ గట్టిగానే బదులిచ్చారు. ఢిల్లీలో పాఠశాలలు, ఆస్పత్రులు కట్టించిన తాను స్వీటెస్ట్‌ టెర్రరిస్ట్‌నేని వ్యాఖ్యానించారు. విశ్వాస్‌ వ్యాఖ్యలు హాస్యాస్పదమని అన్నారు. వందేళ్ల క్రితం భగత్‌ సింగ్‌ను కూడా బ్రిటిషర్లు ఇలాగే టెర్రరిస్ట్‌ అని అభివర్ణించారని పంజాబ్‌ సెంటిమెంట్‌ను జోడించారు. తాను టెర్రరిస్ట్‌ అయితే.. పదేళ్లుగా కేంద్ర ప్రభుత్వాలు ఎందుకు చర్యలు తీసుకోలేదని, నిద్రపోయాయా? అని ప్రశ్నించారు.

Show comments