Idream media
Idream media
ఎన్నికలు ఎప్పుడు, ఎక్కడ జరిగినా.. ముందుగా ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించడం కాంగ్రెస్‌కు అలవాటు లేదు. అందుకే షీల్డ్ కవర్ సీఎంలని ఆ పార్టీ ముఖ్యమంత్రులకు పేరుంటుంది. చివరి వరకూ తేల్చలేకపోవడం, విభేధాలు వస్తాయన్న భయంతో అధిష్టానం వేచి చూసే ధోరణిని అవలంబిస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసిన వైఎస్. రాజశేఖర్ రెడ్డి లాంటి ఒకరిద్దరు వ్యక్తులు మినహా మిగతా వారి పేర్లు ముందుగా ప్రజలకు తెలియలేదు.
ప్రస్తుతం ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల కోలాహలం మొదలైంది. అందులో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న ఒకే ఒక రాష్ట్రం పంజాబ్. అక్కడ మళ్లీ అధికారంలోకి రావాలని ఆరాటపడుతోంది. కానీ పరిస్థితులు ఆ పార్టీకి అనుకూలంగా కనిపించడం లేదు. ఒకవేళ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఎవరు అవుతారనే దానిపై రాష్ట్రంలో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ముందుగానే ప్రకటించాలని పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్ని అభిప్రాయం వ్యక్తం చేశారు. నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ, సునీల్ జాఖడ్ సహా పలువురు ముఖ్యమంత్రి అభ్యర్థులు ఉన్నారంటూ కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకుని ప్రతిపక్షాలు చేసిన విమర్శల నేపథ్యంలో చన్ని వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ముఖ్యమంత్రిని ఎన్నుకునేది పంజాబ్ ప్రజలేగాని, అధిష్టానం కాదంటూ పీసీసీ చీఫ్ సిద్ధూ తాజాగా చేసిన వ్యాఖ్యలు పార్టీలో చర్చనీయాంశం అయ్యాయి. ఈనేపథ్యంలో బుధవారం స్థానిక మీడియా ఛానెల్‌తో మాట్లాడిన చన్నీ.. సీఎం అభ్యర్థి ఎంపిక వల్ల పార్టీ జయాపజయాలను వివరించారు. ‘‘ 2017నాటి ఎన్నికల్లో అమరీందర్ సింగ్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించినప్పుడు మేం గెలిచాం. అంతకుముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించలేదు. అప్పుడు ఓడిపోయాం’’ అని ఆయన అన్నారు. కాగా, రాష్ట్రం ఎదుర్కొంటున్న సవాళ్లకు పరిష్కారం చూపేవారు, కఠిన నిర్ణయాలు తీసుకునే నేతలు పంజాబ్‌కు ఇప్పుడెంతో అవసరమని కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారీ పేర్కొన్నారు. మరోవైపు, పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిని వచ్చేవారం ప్రకటించనున్నట్టు ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ కేజ్రీవాల్ తెలిపారు.
Also Read : ఉత్తరప్రదేశ్ బీజేపీలో ఏం జరుగుతోంది.. కీలక నేతల ఫిరాయింపుతో కమలంలో కలకలం ఎందుకు