Idream media
Idream media
ఏపీలో రాజధానుల సెగ రాజుకుంటోంది. మొన్ననే అమరావతి రైతుల పాదయాత్ర ముగింపు సభ తిరుపతిలో జరిగింది. మరుసటి రోజు రాయలసీమ చైతన్య సభ కూడా కొనసాగింది. అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి మూడు రాజధానులను కొనసాగించాలన్న డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామని మంత్రి పెద్దిరెడ్డి తాజాగా కూడా స్పష్టం చేశారు. అయినప్పటికీ జగన్ సర్కారు బిల్లును ఉపసంహరించుకున్నప్పటి నుంచీ ప్రజల్లో ఆందోళన కనిపిస్తోంది. అమరావతి రాజధానిగా ఉండాలని కేవలం కొన్నిప్రాంతాల నుంచే డిమాండ్ వస్తుంటే.. మూడు రాజధానుల ఆకాంక్షను రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలతో పాటు అన్ని ప్రాంతాల వాసులు వెలిబుచ్చుతున్నారు. ఈ మేరకు ఇటీవల తిరుపతిలోని తుడా మైదానంలో నిర్వహించిన అభివృద్ధి వికేంద్రీకరణ- రాయలసీమ మనోగతం పేరుతొ జరిగిన బహిరంగ సభ విజయవంతమైంది. ఇదే ఊపును కొనసాగిస్తూ తర్వాత విశాఖ వేదికగా మూడు రాజధానుల శంఖారావం పూరించేందుకు పలు ప్రజా సంఘాలు సిద్ధమవుతున్నాయి.
ఓ వైపు సర్కారు ఈసారి పటిష్టమైన బిల్లు తెచ్చేందుకు ప్రణాళికలు రచిస్తోందని మంత్రి పెద్దిరెడ్డి మాటల ద్వారా తెలుస్తోంది. తిరుపతిలో జరిగిన మహా పాదయాత్ర ముగింపు సభపై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నామని, త్వరలోనే మూడు రాజధానుల బిల్లు అసెంబ్లీలో పెడతామని అన్నారు. ఇది రైతుల ఉద్యమం కాదని, టీడీపీ దగ్గరుండి అమరావతి ఉద్యామాన్ని నడిపిస్తోందని అన్నారు. నైతిక విలువల్లేకుండా పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చాయని, తోక పార్టీలను వెంటవేసుకొని చంద్రబాబు అబద్దాలాడుతున్నారని అన్నారు. ఒకే రాజధానికి అనుకూలంగా కోర్టు తీర్పు వస్తుందని చంద్రబాబు చెబుతున్నారని, కోర్టు తీర్పులను కూడా ముందుగానే చంద్రబాబు చెబుతున్నారంటే ఏ స్థాయిలో వ్యవస్థలను మ్యానేజ్ చేస్తున్నాడో చెప్పక్కర్లేదని మంత్రి పెద్దిరెడ్డి చెబుతూనే.. మూడు రాజధానులపై ఆందోళన వద్దని సూచించారు.
సర్కారు భరోసా ఇస్తున్నప్పటికీ విపక్షాల హడావిడి, ఆరోపణలు ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే తిరుపతి వేదికగా భారీ స్థాయిలో మూడు రాజధానుల ఆకాంక్షను వెలుగెత్తిన ప్రజలు.. ఇప్పుడు విశాఖ వేదికగా మరో సభకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. విశాఖ రాజధాని కాకుండా పోతుందేమో అనే భయంతో ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది. సాగరనగరం విశాఖపట్నాన్ని పరిపాలన రాజధానిగా ప్రకటించాలంటూ ఈ ప్రాంత ప్రజలు ఇప్పటికే ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు.
Also Read : ఆవేదనను, ఆకాంక్షను చాటిన రాయలసీమ హక్కుల సభ
పరిపాలనా రాజధానిగా బదలాయించడానికి విశాఖపట్నానికి అన్ని రకాలుగా అర్హతలు ఉన్నాయని సూచిస్తున్నారు. జగన్ మూడు రాజధానుల ప్రకటనతో ఉత్తరాంధ్ర కు కొత్త కళ వచ్చింది. గతానికి భిన్నంగా అభివృద్ధి వేగవంతమైంది. మరోవైపు రాయలసీమవాసుల్లో కూడా ఆశలు చిగురించాయి. ఆ ప్రాంత వనరులు, ఉన్న అవకాశాల మేరకు అమరావతి కూడా ఉనికిని చాటుకుంటోంది. ఇలా మూడు వైపులా సమగ్రాభివృద్ధి జరుగుతున్న సమయంలో.. విపక్షాల కేసుల కారణంగా సర్కారు ఆ బిల్లును ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. దీంతో అన్ని ప్రాంతాలవాసులు ఆందోళనకు గురై ఉద్యమాలకు శ్రీకారం చుడుతున్నారు. ఇటీవల మంత్రి పెద్దిరెడ్డి దీనిపై క్లారిటీ ఇచ్చినా .. తమ ఆకాంక్షను సర్కారుకు చాటేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు.