iDreamPost
android-app
ios-app

ప్రైవేటీకరణ ఫలితమిది.. ఇకనైనా మేల్కొంటారా..?

ప్రైవేటీకరణ ఫలితమిది..  ఇకనైనా మేల్కొంటారా..?

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ.. ఆపత్కాలంలో ఆక్సిజన్ సరఫరా చేస్తూ దేశానికి ఊపిరిపోస్తోంది.. మరి ప్రైవేటుకు తెగనమ్మి ఉంటే.. ఇప్పుడు ప్రభుత్వానికి సాయపడేదా? ఇండియన్ రైల్వే.. ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ పేరుతో దేశవ్యాప్తంగా ప్రాణవాయువును సేకరించి.. అవసరమైన చోటుకు సప్లై చేస్తోంది. రైళ్ల బోగీలను ఐసోలేషన్ సెంటర్లుగా మారుస్తోంది. వేలాది మంది ప్రాణాలను కాపాడుతోంది. మరి ప్రైవేటుపరం చేసి ఉంటే ప్రభుత్వం కోసం పని చేసేదా? ప్రభుత్వ సంస్థ అంటే బాధ్యత.. ప్రైవేటు సంస్థగా మారితే బిజినెస్. ఈ విషయం తెలిసి కూడా ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేసి.. ప్రైవేటు సంస్థలను ప్రోత్సహిస్తోంది కేంద్ర సర్కారు. దీంతో ప్రైవేటు రాజ్యం.. అదను చూసి దోచుకుంటోంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రైవేటు, కార్పొరేటు ఆస్పత్రుల తీరును చూస్తే ఈ విషయం స్పష్టమతుంది. రాష్ట్ర ప్రభుత్వాలు వినతులు చేసినా.. ఆదేశాలిచ్చినా.. హెచ్చరికలు జారీ చేసినా.. డోంట్ కేర్ అంటున్నాయి. కరోనా కోల్లోల సమయంలో ప్రజల రక్తం పీలుస్తున్నాయి. ప్రైవేటీకరణ ఫలితమిది.

కడప ఘటన ఓ ఉదాహరణ మాత్రమే..

కరోనా పేషెంట్ల‌కు ట్రీట్‌మెంట్ పేరుతో ప్రైవేట్, కార్పొరేటు ఆస్ప‌త్రులు విచ్చ‌ల‌విడిగా దోచుకుంటున్నాయ‌ని క‌డ‌పలో పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో చర్యలకు దిగిన అధికారులు ఓ ద‌ర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆస్ప‌త్రుల‌పై దాడులు చేశారు. ఫిర్యాదుల్లో వాస్త‌వం ఉన్న‌ట్టు నిర్ధార‌ణ కావడంతో ఆయా ఆస్ప‌త్రుల‌కు జ‌రిమానా విధించారు. దీంతో ప్రైవేట్ ఆస్ప‌త్రుల యాజమాన్యాలు ఎమోష‌న‌ల్ బ్లాక్ మెయిల్‌కు తెగ‌బ‌డ్డాయి. డాక్టర్లపై ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందని, ఇందుకు నిరసనగా కరోనా రోగుల‌ను చేర్చుకోబోమని ఆస్పత్రుల బయట బోర్డులు పెట్టాయి. రూల్స్ పేరుతో సర్కారు త‌మ‌పై కేసులు పెడుతోందని, జ‌రిమానాలతో వేధిస్తోందని ఆరోపించాయి.

ఇది కడపలో మాత్రమే ఉన్న పరిస్థితి కాదు. దేశవ్యాప్తంగా ఇలానే ఉంది. కార్పొరేటు ఆస్పత్రులు అడ్డగోలు ఫీజులు వసూలు చేస్తున్నాయి. లక్షల్లో బిల్లులు వేస్తున్నాయి. మంత్రులు ఫోన్ చేసి బిల్లులు తగ్గించాలని అడిగితే.. ‘‘బెడ్డు ఇవ్వడమే ఎక్కువ. ఇప్పుడు ఫీజు కూడా తగ్గించాలా?’’ అన్నట్లు బదులిస్తున్నాయని మంత్రులే వాపోతున్నారు. ఇక సామాన్యుల పరిస్థితి వర్ణనాతీతం. మరోవైపు ప్రభుత్వ ఆస్పత్రులు వసతుల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. అత్యాధునిక సౌకర్యాలతో ప్రైవేటు ఆస్పత్రులు వీధికొకటి వెలుస్తుంటే.. ప్రభుత్వ ఆస్పత్రులు మాత్రం దశాబ్దాలుగా ఎట్లున్నవి అట్లే ఉన్నాయి. ప్రైవేటు ఆస్ప్రతులు పెరిగిపోవడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రభుత్వ హాస్పిటళ్లను పట్టించుకోలేదు. ఆ ఎఫెక్ట్ ఇప్పుడు కనిపిస్తోంది. కరోనా సమయంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో వసతులు లేక, బెడ్లు తక్కువగా ఉండటం వల్ల వైరస్ బారిన పడిన జనం ప్రైవేటు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. లక్షలకు లక్షలు దోపిడీకి గురవుతున్నారు.

Also Read : హెల్త్ ఎమర్జెన్సీలో కార్పొరేటు ఆస్పత్రులను అదుపు చేయలేరా..?

వ్యాక్సిన్లకూ అదే దుస్థితి..

దేశంలో వ్యాక్సిన్లను ప్రైవేటు సంస్థలు కేంద్రానికి అమ్ముతున్నాయి. మొన్నటి దాకా బాగానే ఉన్నా.. కొన్ని రోజుల కిందట మూడు రకాల రేట్లను టీకా తయారీ సంస్థలు ప్రకటించాయి. కేంద్రానికి, ఒక రేటు రాష్ట్రాలకు మరో రేటు.. ప్రైవేటు ఆస్పత్రులకు ఇంకోలా ఉంటాయని చెప్పాయి. ఒకే దేశంలో, ఒకే వ్యాక్సిన్ కు మూడు ధరలు పెట్టడంపై అన్ని వైపుల నుంచి విమర్శలు వచ్చాయి. అదే ప్రభుత్వ సంస్థల ఆధ్వర్యంలో ఉత్పత్తి జరిగి ఉంటే ఇలాంటి పరిస్థితి ఉండేదా? హెల్త్ ఎమర్జెన్సీ సమయంలో వ్యాక్సిన్ల ధరలను నిర్ణయంచే హక్కులను ప్రైవేటు తయారీ సంస్థలకు ఇవ్వడం ఎంతవరకు సమంజసం? వాటికి ప్రభుత్వం అన్ని విధాలుగా సాయం చేస్తున్నా.. తమకు సూపర్ ప్రాఫిట్ రావట్లేదంటూ సదరు సంస్థలు అంటున్నాయంటే ప్రైవేటు ధనార్జన ఉద్దేశాన్ని ఏమనాలి? నష్టాల పేరుతో ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముకుంటే.. ఇలానే ఉంటుంది. ప్రైవేటుకు పగ్గాలు ఇచ్చే బదులు.. ప్రభుత్వ సంస్థలను బలోపేతం చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి లేకపోవడం శోచనీయం.

పాముకు పాలుపోసి..

ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించడం అంటే పాముకు పాలుపోసి పెంచడమే. ఎవరు కాదన్నా ఇది ముమ్మాటికీ నిజం. దేశంలో ఇప్పుడు ప్రైవేటు ఆధిపత్యమే నడుస్తోంది. కూరగాయల ధరల నుంచి ప్రభుత్వ పాలసీల దాకా ప్రతి ఒక్కదానిపై వాటి ప్రభావం ఉంటోంది. నిజంగా ప్రభుత్వ సంస్థలను బలోపేతం చేసి ఉంటే.. విశాఖ ఉక్కులా ఇప్పుడు ఆపద సమయంలో ఆదుకునేవి.. దేశంలో ఎన్నో ప్రైవేటు స్టీలు ప్లాంట్లు ఉన్నాయి. మరి అవి ఉచితంగా మెడికల్ ఆక్సిజన్ ను సరఫరా చేస్తున్నాయా? బాగా బలిసిన ఒకటీరెండు సంస్థలు.. తమపై వ్యతిరేకత రాకుండా తూతూమంత్రంగా సాయం చేస్తున్నాయి. అంతేకానీ ‘ఆపత్కాలంలో ప్రభుత్వానికి సాయపడుతాం’ అని ఒక్క సంస్థ కూడా ముందుకు రాలేదు. ఇప్పటికే రైల్వేలో ప్రైవేటీకరణ జరుగుతోంది. పలు రూట్లను ప్రైవేటు సంస్థలకు ఇచ్చేశారు. పలు స్టేషన్లను కూడా ఇచ్చే ఆలోచనల్లో కేంద్రం ఉంది. ప్రధాన స్టేషన్లలో ప్లాట్ ఫాం టిక్కెట్టే రూ.50కి అమ్ముతున్నారు. ఇక టికెట్ రేట్లు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాలా. ధనార్జనే ధ్యేయంగా వ్యాపారంలోకి దిగే సంస్థలు.. ప్రజాసేవ చేయాలని అనుకోవడం మూర్ఖత్వం. దున్నపోతుకు గడ్డివేస్తే గేదె పాలు ఇస్తుందా?

అయినా మారలేదు..

ప్రైవేటీకరణ వల్ల జరగాల్సిన నష్టాలు జరుగుతున్నా… కేంద్రం తీరు మాత్రం మారడం లేదు. కరోనా ఉన్నా సరే ప్రభుత్వ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మొన్న చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించాలనే నిర్ణయం మార్చుకోబోమని, ప్రైవేటీకరణ ఆపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ ఇదివరకు చెప్పినట్లుగానే ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు. నిజానికి కేంద్రం తీరు ముందు నుంచీ ఇలానే ఉంది. తాను చేయాలనుకున్నది చేస్తోంది. ఎంత వ్యతిరేకత వచ్చినా.. ఎన్ని విమర్శలు వచ్చినా.. నిర్ణయాలను మార్చుకోవడం లేదు.

చేయాల్సింది ఇదీ..

మెడికల్ ఎమర్జెన్సీ సమయంలో ప్రభుత్వం చేయాల్సింది వేరు. అయ్యా.. బాబు.. అంటే ప్రైవేటు ఆస్పత్రులు వినవు. మంత్రాలకు చింతకాయలు రాలవు. ప్రైవేటు ఆస్పత్రులను ప్రభుత్వం పరిధిలోకి తీసుకురావాలి. వాటిలో ప్రజలకు ఉచితంగా వైద్యం అందించాలి. ప్రైవేటు యాజమాన్యాలు ఒప్పుకోకుంటే స్వాధీనం చేసుకోవాలి. అప్పటికప్పుడు డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బందిని నియమించుకోవాలి. దేశంలో కావాల్సినంత మంది నిరుద్యోగులు ఉన్నారు. అవసరమైతే వాళ్ల సేవలను ఉపయోగించుకోవచ్చు. ఆచితూచి అడుగులు వేయడానికి ఇది పొలిటికల ఎమర్జెన్సీ కాదు. హెల్త్ ఎమర్జెన్సీ. ఎంత త్వరగా నిర్ణయాలు తీసుకుంటే.. అన్ని ప్రాణాలు నిలబడతాయి.

Also Read : సుప్రిం నడుంబిగించింది..!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి