పెద్ద జిల్లా ప్రకాశం.. పశ్చిమవాసుల ఆకాంక్ష పరిగణలోకి తీసుకుంటారా..?

ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల పునర్విభజన, కొత్త జిల్లాల ఏర్పాటుకు అంతా సిద్ధమైంది. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను 26 జిల్లాలుగా మారుస్తూ.. వాటి స్వరూపాన్ని ప్రభుత్వం ప్రజల ముందు పెట్టింది. అభ్యంతరాలు, సూచనలు, సలహాలు కోరింది. ఫిబ్రవరి నెలాఖరు వరకు సమయం ఇచ్చింది. మొత్తంగా చూస్తే కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత.. ఒంగోలు కేంద్రంగా కొనసాగే ప్రకాశం జిల్లా విస్తీర్ణంతోపాటు అసెంబ్లీ నియోజకవర్గాలు, మండలాలు, పరంగా కూడా అతి పెద్ద జిల్లాగా అవతరించబోతోంది.

ప్రకాశం జిల్లా 14,322 చదరపు కిలోమీటర్ల మేర విస్తీర్ణంలో ఉండబోతోంది. ఒంగోలు, మార్కాపురం రెవెన్యూ డివిజన్లతోపాటు.. కొత్తగా కనిగిరి రెవెన్యూ డివిజన్‌గా మారబోతోంది. ఒంగోలు, కొండపి, దర్శి, సంతనూతలపాడు, కనిగిరి, మార్కాపురం, ఎర్రగొండపాలెం, గిద్దలూరు నియోజకవర్గాలు, 38 మండలాలతో ఈ జిల్లా ఏర్పాటు కాబోతోంది. 22.88 లక్షల మంది జనాభాతో అతిపెద్ద జిల్లాల్లో ఒకటిగా ప్రకాశం జిల్లా నిలవబోతోంది.

1970లో గుంటూరు, నెల్లూరు, కర్నూలు జిల్లాల నుంచి కొన్ని ప్రాంతాలను తీసి ప్రకాశం జిల్లాగా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 12 నియోజకవర్గాలు ఉండగా.. అందులో నాలుగు నియోజకవర్గాలు ఇతర జిల్లాల్లోకి వెళ్లబోతున్నాయి. నెల్లూరు నుంచి వచ్చిన కందుకూరు తిరిగి నెల్లూరు జిల్లాలోకే వెళ్లిపోబోతోంది. రెవెన్యూ డివిజన్‌గా కూడా కందుకూరు రద్దు కాబోతోంది. గుంటూరు జిల్లా నుంచి వచ్చిన చీరాల, అద్దంకి, పర్చూరు ప్రాంతాలు బాపట్ల జిల్లాలోకి వెళ్లిపోతున్నాయి. చీరాల కొత్తగా రెవెన్యూ డివిజన్‌గా మారింది.

పశ్చిమ వాసుల చిరకాల ఆకాంక్ష..

ప్రకాశం జిల్లా కరువు ప్రాంతమని, ఫ్లోరైడ్‌ ప్రాంతమని, పూర్తిగా వెనుకబడిన జిల్లా అని, వలసల జిల్లా అని పేరు. ఈ పేరు రావడానికి ప్రధాన కారణం జిల్లాకు పశ్చిమంగా ఉన్న నాలుగు నియోజకవర్గాలే. కనిగిరి, మార్కాపురం, ఎర్రగొండపాలెం, గిద్దలూరు నియోజకవర్గాలు తరాలుగా అన్ని విధాలుగా వెనుకబడి ఉన్నాయి. నల్లమల అటవీప్రాంతంలో ఉన్న గిద్దలూరు, మార్కాపురం, ఎర్రగొండపాలెం ప్రాంతాలు గతంలో కర్నూలు జిల్లాలో ఉండేవి. ప్రకాశం జిల్లా ఏర్పడకముందు నంద్యాల కేంద్రంగా నల్లమల జిల్లా ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ను ఈ ప్రాంత నాయకులు వినిపించారు. 1970లో జరిగిన జిల్లాల పునర్విభజన సమయంలోనూ ఈ డిమాండ్‌ బలంగా వినిపించింది. అయితే అది కార్యరూపం దాల్చలేదు. గిద్దలూరు, మార్కాపురం తాలుకాలను కర్నూలు నుంచి తీసుకువచ్చి ప్రకాశంలో కలిపారు.

దూరాభారం..

జిల్లాల పునర్విభజన, కొత్త జిల్లాల ఏర్పాటుపై సీఎం జగన్‌ హామీ ఇచ్చినప్పటి నుంచి.. పశ్చిమ ప్రకాశం వాసులు జిల్లా కేంద్రంపై ఆశలు పెట్టుకున్నారు. మార్కాపురం కేంద్రంగా గిద్దలూరు, ఎర్రగొండపాలెం, కనిగిరి, దర్శి నియోజకవర్గాలతో కూడిన జిల్లా ఏర్పాటు చేయాలనే ఆకాంక్ష ఈ ప్రాంత ప్రజలు వెలుబుచ్చుతున్నారు. జిల్లా కేంద్రం ఒంగోలుకు ఈ ప్రాంతాలు సుదూరాన ఉన్నాయి. ఒంగోలుకు గిద్దలూరు పట్టణం 142 కిలోమీటర్లు, ఎర్రగొండపాలెం 133 కిలోమీటర్లు, మార్కాపురం 100 కిలోమీటర్లు, కనిగిరి పట్టణం 80 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఆయా నియోజకవర్గాల్లోని గ్రామాల నుంచి అయితే ఈ దూరం గరిష్టంగా 250 కిలోమీటర్లు ఉంటుంది.

అభివృద్ధి కోసమే కాదు.. జీవితకాల సమస్యలు తీరుతాయని..

మార్కాపురం కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయడం వల్ల ఆ ప్రాంత ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. ఎటు చూసినా 30 – 40 కిలోమీటర్ల దూరంలోనే జిల్లా కేంద్రం ఉంటుంది. జిల్లా కేంద్రం ఏర్పాటు వల్ల.. కొత్త అభివృద్ధి జరగకపోయినా.. కనీసం చిరకాలంగా ఉన్న తమ సమస్యలు అధికారుల దృష్టికి వేగంగా వెళతాయని, వాటికి పరిష్కారం లభిస్తుందనే ఆకాంక్షతో పశ్చిమ ప్రకాశం జిల్లా వాసులు ఉన్నారు. సలహాలు, సూచనలు, అభ్యంతరాలు, డిమాండ్లను కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటున్న నేపథ్యంలో.. తమ ఆకాంక్షను నెరవేర్చాలని ఈ ప్రాంతవాసులు ప్రభుత్వానికి విన్నవిస్తున్నారు.

Also Read : ఏపీకి “కొత్త” క‌ళ.. ఆస‌క్తిక‌ర అంశాలు..!

Show comments