పార్లమెంట్‌ నూతన భవనానికి శంకుస్థాపన

పార్లమెంట్‌ నూతన భవన నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. ఢిల్లీలో నిర్మించే ఈ నూతన భవనానికి ప్రధాని మోదీ గురువారం తొలుతు భూమి పూజ చేశారు. అనంతరం శిలా ఫలకం ఆవిష్కరించారు. అనంతరం వివిధ మతాలకు చెందిన పెద్దలు సర్వ ధర్మ ప్రార్థన చేశారు. ఈ కార్యక్రమంలో లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌లతోపాటు వివిధ దేశాల రాయబారులు పాల్గొన్నారు.

నూతన పార్లమెంట్‌ భవనాన్ని 971 కోట్ల రూపాయల ప్రాథమిక అంచనాతో నిర్మించతలపెట్టారు. నిర్మాణ కాంట్రాక్టును టాటా సంస్థ దక్కించుకుంది. రతన్‌ టాటా కూడా శంకుస్థాపన కార్యక్రమానికి హాజరయ్యారు. దేశ ప్రతిష్ట ఇనుమడించేలా పార్లమెంట్‌ భవనాన్ని నిర్మిస్తామని రతన్‌ టాటా టెండర్‌ దక్చించుకున్న సమయంలో పేర్కొన్నారు. ఈ అవకాశం తమకు దక్కినందుకు ఆయన సంతోషం వ్యక్తం చేశారు. లోక్‌సభ, రాజ్యసభతోపాటు పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్, అన్ని పార్టీల కార్యాలయాలను ఒకే ప్రాంగణంలో నిర్మించనున్నారు.

భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకుని నూతన భవనాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం లోక్‌సభలో 545, రాజ్యసభలో 245 మంది సభ్యులు ఉండగా.. తాజాగా నిర్మిస్తున్న భవనంలో సీట్ల సంఖ్య పెంచనున్నారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గాల పెంపును దృష్టిలో పెట్టుకుని లోక్‌సభలో 888 సీట్లు, రాజ్యసభలో 384 సీట్ల సామర్థ్యంతో నూతన భవనాన్ని నిర్మిస్తున్నారు. 2020 అక్టోబర్‌ నాటికి నూతన భవనం సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

Show comments