Idream media
Idream media
కరోనా నెమ్మదించడంతో కొద్ది నెలలు ప్రశాంతంగా ఉండగా,దేశంలో ఈమధ్య మళ్లీ హైరానా మొదలైంది. ఆంక్షలు, నైట్ కర్ఫ్యూలు అమల్లోకి వచ్చేశాయి. కొన్ని రాష్ట్రాల్లో మినీ లాక్ డౌన్ కొనసాగుతోంది. ఇక లాక్ డౌన్ పై అనుమానాలు చక్కర్లు కొడుతున్నాయి. కేవలం పది రోజుల వ్యవధిలోనే కేసుల సంఖ్య 10 వేల నుంచి లక్షన్నరకు పైగా నమోదవుతుండడంతో ఆందోళన పెరుగుతోంది. దీంతోపాటు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ సైతం అలజడి రేపుతోంది. ఒమిక్రాన్ కేసులు సైతం రోజురోజుకు పెరుగుతున్నాయి. ఒక్కసారిగా కరోనావైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆదివారం సాయంత్రం వైద్యనిపుణులు, మంత్రులతో సైతం సమీక్ష నిర్వహించారు.
థర్డ్ వేవ్ నేపథ్యంలో పలు చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీ సూచనలు చేశారు. భారీగా పెరుగుతున్న కరోనా కేసుల నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వ్యాక్సినేషన్, ఆసుపత్రుల్లో సౌకర్యాలు, ఔషధాలు, ఆక్సిజన్ తదితర అంశాలపై సూచనలు చేశారు. జిల్లా స్థాయిలో తగిన ఆరోగ్య మౌలిక సదుపాయాలను పెంచాలని.. యుక్తవయస్సులోని పిల్లలకు టీకా డ్రైవ్‌ను వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పెరుగుతున్న కరోనా కేసులు, తీసుకోవాల్సిన చర్యలపై గురువారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటీ కానున్నారు. వర్చువల్ ద్వారా జరిగే ఈ సమావేశంలో కేసుల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలు, లాక్‌డౌన్, తదితర విషయాలపై ముఖ్యమంత్రులతో చర్చించనున్నారు.
2020లో కరోనా మహమ్మారి వ్యాప్తి చెందినప్పటి నుంచి ప్రధాని మోదీ ముఖ్యమంత్రులతో అనేక సమావేశాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రుల సూచనలను పరిగణలోకి తీసుకొని ప్రధాని మోదీ పలు ఆదేశాలు సైతం ఇచ్చారు. అయితే.. దేశంలో విపరీతంగా పెరుగుతున్న కోవిడ్ కేసులు చూస్తుంటే.. దేశవ్యాప్తంగా మళ్లీ లాక్‌డౌన్ విధిస్తారనే భయాందోళన నెలకొంది. కోవిడ్ కేసులు పెరగడం ఆందోళన కలిగించే విషయం అయినప్పటికీ.. లాక్‌డౌన్ విధించడం వల్ల ఇప్పుడిప్పుడే గట్టెక్కుతున్న దేశ ఆర్థిక వ్యవస్థకు నష్టం చేకూరుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరి మోడీ ఏయే నిర్ణయాలను ప్రకటించనున్నారో వేచి చూడాలి.