Idream media
Idream media
కేసుల పెరుగుదలతో కరోనాపై మళ్లీ ఆందోళన పెరుగుతోంది. ఓవైపు డెల్టా, మరోవైపు ఒమిక్రాన్ కేసులు విపరీతంగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో కొవిడ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజే 1,59,632 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ సంఖ్య గత 224 రోజులలో ఇదే అత్యధికం. ఇప్పటి వరకు ఇరవై ఏడు రాష్ట్రాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతాలకూ ఒమిక్రాన్ వ్యాప్తించింది. ఈ నేపథ్యంలో దేశంలో కొవిడ్ పరిస్థితులను సమీక్షించేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆదివారం సాయంత్రం ఉన్నతాధికారులతో సమావేశయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు అంశాలపై చర్చించారు. ఈ భేటీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా, ఏవియేషన్, హోం, క్యాబినెట్ సెక్రటరీలు, రైల్వే బోర్డు ఛైర్మన్‌తోపాటు ఇతర మంత్రిత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు. సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ కరోనా ఇన్ఫెక్షన్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. అటువంటి పరిస్థితిలో, పెరుగుతున్న ఇన్ఫెక్షన్ కేసులను అరికట్టడానికి ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటోంది. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మోడీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా దివ్యాంగులు, గర్భిణులు ఇంటి నుంచే విధులు నిర్వహించేలా వర్క్ ఫ్రం హోమ్ వెసులుబాటును కల్పిస్తున్నట్లు మోడీ తెలిపారు. అలాగే, కరోనా కేసులు అధికంగా నమోదైన ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లను గుర్తించి ఆయా అధికారులకు కూడా వర్క్ ఫ్రం హోమ్ కల్పించాలని కేంద్రం నిర్ణయించింది. కంటైన్మెంట్ జోన్‌ను పూర్తిగా ఎత్తివేశాకనే, కార్యాలయాలకు రావాలని కేంద్ర సర్కార్ సూచించింది.
దేశవ్యాప్తంగా కరోనా కట్టడిలో భాగంగా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులను ప్రధాని కోరారు. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దృష్ట్యా, మరింత జాగ్రత్త వహించాల్సి అవసరం ఉందన్నారు. మహమ్మారిపై పోరాటం అప్పుడే ముగియలేదన్న ప్రధాని.. COVID 19 సురక్షిత పద్ధతులకు కట్టుబడి ఉండవలసిన అవసరం చాలా ముఖ్యమన్నారు. ఇందులో భాగంగా అవసరమైన మెడిసిన్స్, ఆక్సిజన్ అందుబాటులో ఉంచాలని ప్రధాని సూచించారు. మరోవైపు, 100 శాతం రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తి చేయాలన్నారు. భారతదేశంలోని 27 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఇప్పటివరకు 3,623 కొత్త కరోనా వైరస్ ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
కొవిడ్ కేసుల పెరుగుదల మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ అత్యంత యాక్టివ్ కేసులతో మొదటి రెండు రాష్ట్రాల జాబితాలోకి వచ్చింది. రాష్ట్రంలో యాక్టివ్‌గా ఉన్న కరోనా రోగులు 51,000 మందికి పైగా ఉన్నారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, పశ్చిమ బెంగాల్‌లో 51,384 యాక్టివ్ కేసులు ఉన్నాయి. యాక్టివ్‌గా ఉన్న రోగుల సంఖ్య 1,45,198గా ఉన్న మహారాష్ట్ర తర్వాత పశ్చిమ బెంగాల్ రెండవ స్థానంలో ఉంది. దేశంలో నడుస్తున్న మూడో వేవ్ కరోనా స్థాయి ఒక్క రోజులో ఎనిమిది లక్షల కేసులకు చేరుకుంటోంది. IIT కాన్పూర్‌కి చెందిన ప్రొఫెసర్ మనీంద్ర అగర్వాల్ ప్రకారం, కరోనా మూడవ వేవ్ వచ్చే నెల ప్రారంభంలో లేదా కొంచెం ముందుగానే దాని గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. దేశంలో రోజుకు నాలుగు నుంచి ఎనిమిది లక్షల కేసులు నమోదవుతాయని ఒక అంచనా.