Idream media
Idream media
పదమూడు జిల్లాలను ఏకంగా ఇరవై ఆరు చేసిన ఘనత ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే చెల్లుతుంది. ప్రతీ లోక్ సభ స్థానాన్ని జిల్లా చేయడం అంత ఈజీ కాదని.. జగన్ హామీపై విపక్షాలు ఎన్నోసార్లు విమర్శలు చేశాయి. చెప్పాడంటే.. చేస్తాడంతే అన్నట్లుగా జగన్ చేసి చూపించారు. ఈ సాహసోపేత నిర్ణయానికి రాష్ట్ర ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ పేరుతో జిల్లాను ఏర్పాటు చేయడంపై తెలుగుదేశంలో కొందరు ఆనందంలో మునిగి తేలుతున్నారనడం అతిశయోక్తి కాదు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయానికి మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రలు, ర్యాలీలు, బైక్ ర్యాలీలు, ముఖ్యమంత్రి జగన్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు, పుష్పాభిషేకాలు కొనసాగుతున్నాయి.
జగన్ కు క్షీరాభిషేకాలు..
కొత్త జిల్లాల ఏర్పాటుపై రాయలసీమ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. అన్నమయ్య, శ్రీ సత్యసాయి పేర్లతో జిల్లాలను ఏర్పాటు చేయడంపై సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్సార్ జిల్లా పులివెందులలో వేలాది మంది విద్యార్థులతో వైఎస్సార్‌సీపీ నేతలు ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు మానవహారం చేపట్టారు. రాయచోటి నియోజకవర్గం చిన్నమండెంలో సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. పుట్టపర్తి కేంద్రంగా శ్రీ సత్యసాయి జిల్లాను ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ అనంతపురం జిల్లా పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో నల్లమాడలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. అంతకుముందు వేలాదిమందితో బైక్ ర్యాలీ చేపట్టారు. కదిరి, కల్యాణదుర్గంలలో స్థానిక ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీలు నిర్వహించి సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. మడకశిరలో ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
సుపరిపాలనకు బాటలు
అనంతపురం కేఎస్‌ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థినులు ‘థాంక్యూ సీఎం సార్’ అంటూ అక్షర క్రమంలో కూర్చొన్నారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి, పూతలపట్టు, సత్యవేడు నియోజకవర్గాల్లో జిల్లాల పునర్విభజనకు సంఘీభావంగా భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహించారు. థాంక్యూ సీఎం సార్ అంటూ నినదిస్తూ ప్రదర్శనలు చేపట్టారు. కర్నూలు జిల్లావ్యాప్తంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో సుపరిపాలనకు బాటలు పడ్డాయని బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, ఎమ్మెల్సీ చల్లా భగీరథరెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి అన్నారు. నంద్యాలను జిల్లాగా ఏర్పాటు చేయడంతో బనగానపల్లె నియోజకవర్గం అవుకులో భారీ ర్యాలీ నిర్వహించారు.
Also Read : చంద్రబాబుకి మింగుడుపడని జగన్ ఎత్తులు, కొత్త జిల్లాలపై కక్కలేక మింగలేని చందంగా టీడీపీ
గోదావరి జిల్లాల్లో యువజన సంఘాల ఆధ్వర్యంలో..
కొత్త జిల్లాల ఏర్పాటును హర్షిస్తూ తూర్పు గోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో సంబరాలు నిర్వహించారు. అంబాజీపేటలో పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు, ఎంపీ చింతా అనురాధ ఆధ్వర్యంలో విద్యార్థులు, యువజన సంఘాల నేతలు పాదయాత్ర చేశారు. మలికిపురం ప్రధాన కూడలిలో విద్యార్థులతో నిర్వహించిన మానవహారంలో రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు పాల్గొన్నారు. వైఎస్సార్‌సీపీ నేత చందన నాగేశ్వర్ ఆధ్వర్యంలో ధవళేశ్వరంలో 25 అడుగుల ఎత్తున పూలతో సీఎం జగన్ కటౌట్ ఏర్పాటు చేసి పుష్పాభిషేకం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో వివిధ నియోజకవర్గాల్లో పాదయాత్రలు, బైక్ ర్యాలీలు చేపట్టారు.
కొత్త జిల్లాలతో టీడీపీ కార్యకర్తలు వైసీపీలోకి..
కొవ్వూరులో మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత ఆధ్వర్యంలో సంఘీభావ యాత్ర చేశారు. పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గణపవరంలో ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు ఆధ్వర్యంలో కళాశాల విద్యార్థులు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు జూనియర్ కళాశాల నుంచి గణపవరం సెంటర్ వరకు పాదయాత్ర నిర్వహించి మానవహారం చేపట్టారు. ద్వారకా తిరుమలలో గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు బైక్ ర్యాలీ నిర్వహించారు. నూతన జిల్లాల ఏర్పాటును స్వాగతిస్తూ 50 మంది టీడీపీ కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. దెందులూరులో ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి నాయకత్వంలో సంఘీభావ యాత్ర చేపట్టారు.
ఉత్తరాంధ్రలో ఉత్సాహంగా..
కొత్త జిల్లాల ఏర్పాటును హర్షిస్తూ విశాఖపట్నం జిల్లావ్యాప్తంగా బైక్ ర్యాలీలు, ర్యాలీలు, క్షీరాభిషేకాలు నిర్వహించారు. మాడుగుల, చోడవరం, పాయకరావుపేట, అరకు, పాడేరు, యలమంచిలి, భీమిలి, గాజువాక, విశాఖ తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ నియోజకవర్గాల్లో బైక్ ర్యాలీలు చేపట్టారు. మరికొన్ని చోట్ల పాదయాత్రలు చేశారు. విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ ఆధ్వర్యంలో గోకుల్ పార్క్ నుంచి ఆర్కే బీచ్ వరకు 900 మంది కేరళ డప్పులు, ఒంటె, పులి వేషాలు ధరించి కోలాటమాడారు. ఆర్కే బీచ్‌లో 26 జిల్లాల రాష్ట్ర మ్యాప్ సైకత శిల్పాన్ని ఆవిష్కరించారు. ఇలా రాష్ట్రమంతటా సంబరాలు కొనసాగుతున్నాయి.
Also Read : జిల్లాలపైనా కోర్టుకు వెళ్లబోతున్నారా..?