Padmabushan Bharat Biotech Krishna Ella,Suchitra Ella,Serumమన వ్యాక్సిన్ సృష్టికర్తలను వరించిన పురస్కారాలు

కరోనా సృష్టించిన విలయం ఎవరూ మరచిపోనిది. రెండేళ్ల క్రితం కొత్తగా ప్రపంచానికి పరిచయమైన ఆ మహమ్మారి అందరినీ గడగడలాడించింది. అసలు ఆ వ్యాధేంటో ఓ పట్టాన ఎవరికీ అంతుపట్టలేదు. దానికి సరైన మందు తెలియలేదు. రోజుకో లక్షణం బయటపడేది. దానికి అనుగుణంగా మందులు పెంచుకుంటూ పోవాల్సి వచ్చేది. కొన్ని నెలల అనంతరం కరోనా ఉధృతిని నివారించాలంటే ఏకైక మార్గం వ్యాక్సిన్‌ అని నిపుణులు గుర్తించారు. మరి ఇప్పుడు ఆ వ్యాక్సిన్‌ తయారీ ఎలా?, మూలధనం ఎలా? ముడిసరుకు ఏంటి? ఇంత తీవ్రమైన వైరస్‌కు మందు కనిపెట్టాలంటే కనీసం పదేళ్లయినా పడుతుందని కొందరు.. లేదు ఐదేళ్లు అని మరికొందరు.. రెండేళ్లలో తీసుకొస్తామని ప్రభుత్వాలు.. ఇలా చర్చలు నడుస్తూనే ఉన్నాయి.

అలా చర్చలు నడుస్తున్న క్రమంలోనే దేశీయ దిగ్గజ కంపెనీ భారత్‌ బయోటెక్‌, సీరం ప్రపంచానికి టీకాలను అందించాయి. అతికొద్ది కాలంలోనే ఎన్నో ప్రయోగ దశలను దాటి వాస్తవంలోకి వ్యాక్సిన్‌ను తీసుకొచ్చాయి. వ్యాక్సిన్‌ అందించిన సారథులను కేంద్రం ‘పద్మభూషణ్‌’తో సత్కరించింది. కోవ్యాక్సిన్‌’ సృష్టికర్తలు, తెలుగువారైన భారత్‌ బయోటెక్‌ కు చెందిన కృష్ణా ఎల్లా, సుచిత్రా ఎల్లా దంపతులకు ఉమ్మడిగా ‘పద్మవిభూషణ్‌’ ప్రకటించింది. ఇక…కోవిషీల్డ్‌ టీకా తయారుచేసిన ‘సీరం’ సంస్థ చైర్మన్‌ సైరస్‌ పూనావాలాకు కూడా ‘పద్మవిభూషణ్‌’ ప్రకటించింది. ఈ రెండు సంస్థలు ఇప్పటికే ప్రపంచానికి అనేక టీకాలు అందించాయి.

కరోనా నియంత్రణకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్), నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ సహకారంతో కోవాక్సిన్ టీకాను భారత్‌ బయోటెక్‌ కంపెనీ అభివృద్ధి చేసింది. దీన్ని పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించ‌డం మ‌రో విశేషం. భారత్ బయోటెక్ రూపొందించిన ఈ టీకాను అత్యవసరంగా వినియోగించ‌వ‌చ్చున‌ని కేంద్ర వైద్యఆరోగ్యశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వైరల్ ప్రోటీన్లను తట్టుకునేలా కోవాగ్జిన్ రూపొందించిన‌ట్లు ప‌రిశీల‌న‌ల‌తో తేలింది. మూడు ద‌శ‌ల్లో క్లినిక‌ల్స్ ట్ర‌య‌ల్స్ నిర్వ‌హించి ఏడాదిలోగా వ్యాక్సిన్ అందుబాటులోకి తేవ‌డం సంచ‌ల‌నంగా మారింది. దీనికి వెనుక ఆ సంస్థ‌కు చెందిన కృష్ణా ఎల్లా, సుచిత్రా ఎల్లా దంపతుల కృషిని గుర్తించిన కేంద్రం ప‌ద్మ విభూష‌ణ్ తో స‌త్క‌రించింది.

ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం భాగస్వామ్యంతో సీరం ఇన్‌స్టిట్యూట్ కోవిషీల్డ్ ను అభివృద్ధి చేసింది. భారతదేశంతో పాటు ఇత‌ర దేశాల‌కు కూడా 10 కోట్ల డోస్‌ల వ్యాక్సిన్‌ను అంద‌జేసింది. అంచ‌లంచెలుగా వ్యాక్సిన్ ధ‌ర‌ను త‌గ్గిస్తూ అంద‌రికీ అందుబాటులో ఉండేలా చేసింది. గ‌తేడాది ఆరంభంలోనే ఈ టీకా అన్ని ఆమోదాలూ పొందింది. డిమాండ్ కు అనుగుణంగా ఎక్క‌డా కొర‌త రాకుండా కోవిషీల్డ్ డోసులను ఆ కంపెనీ దేశంలో అందుబాటులో ఉంచింది. 1966లో భారతదేశంలోని పూణే నగరంలో ప్రారంభ‌మైన సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అన‌తికాలంలోనే ఇమ్యునో బయోలాజికల్‌ లను ఉత్పత్తి చేయ‌డంలో ఘ‌న‌త సాధించింది. గ‌తంలోనే బ్యాక్టీరియా, వైరస్ ఇన్‌ఫెక్షన్‌లను నివారించే టీకాల‌ను రూపొందించింది.

Show comments