ఏపీ ప్రతిపక్షాలు.. ఆముదం చెట్టు

ఏ చెట్టూ లేని చోట ఆముదం చెట్టే మహావృక్షమట. ప్రస్తుతం ఏపీలో ప్రతిపక్ష పార్టీలకు ఆ సామెత అతికికట్టు సరిపోతుంది. రాష్ట్రంలో ఏం జరిగినా (ప్రజలు మేలు జరిగితే అది తమవల్లే నంటారు కనుక.. ఇది మినహా) సీయం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి వల్లే జరుగుతోందన్న మెట్ట వాదనకు తెరలేపుతున్నారు. సంఘటన జరగ్గానే వారికి జగన్‌ మతం, కులం గుర్తుకొచ్చేస్తున్నాయన్న అభిప్రాయం ప్రజల్లో బలంగానే ఉంది. ఏదైనా సంక్షేమ పథకం అమలు చేస్తున్నప్పుడు మాత్రమే ఇటువంటి ప్రచారాలకు జోరురేగడాన్ని కూడా ఉదాహరణగా చూపుతున్నారు.

దాదాపు యాభైవేల కోట్ల రూపాయల సొమ్మును వివిధ సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు అందజేసినప్పటికీ దానిని గురించి మాత్రం వీరు మాట్లాడ్డం లేదన్నది వాస్తవం. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో నేరుగా నగదు సాయం చేయడం ద్వారా రాష్ట్ర ఆర్ధిక స్థితిని బ్యాలెన్స్‌ చేసేందుకు అవకాశం ఉంటుందని ఆర్ధిక రంగ నిపుణులు చెబుతున్నప్పటికీ దానిని ఒప్పుకునే స్థాయి ప్రస్తుత ప్రతిపక్షాలకు లేదన్నది అధికార పక్షం నాయకులు చెబుతున్న మాట. ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదుల్లేక పోవడంతో ప్రతిపక్షాలకు ఏం చేయాలో పాలుపోవడం లేదన్నది విశ్లేషకుల అభిప్రాయం. దీంతో ఏ చిన్ని సంఘటన జరిగినా దానిని సీయం జగన్‌తో ముడిపెట్టేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సదరు సంఘటనకు సంబంధించి వెనుకాముందూ ఆలోచించకుండా ప్రభుత్వంపై ఆరోపణలు చేయడానికే ప్రాధాన్యమివ్వడాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నారు. అయితే విజ్ఞతగల ప్రజలు వాటిని పెద్దగా పట్టించుకోవడం లేదంటున్నారు.

ఎన్నికల ముందు కూడా దాదాపు ఇదే విధమైన ఆరోపణలతో రెండు పేపర్లు, అరడజను ఎలక్ట్రానిక్‌ మీడియా ఛానళ్ళు, సోషల్‌ మీడియా వింగులు ఏకమై జగన్‌కు వ్యతిరేకంగా తీవ్రమైన ప్రచారానికి తెరలేపాయి. అయినప్పటికీ జగన్‌ నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీ 151 సీట్లు గెల్చుకుంది. తప్పుడు ప్రచారానికి ప్రజలు ఇచ్చిన తీర్పుగా దీనిని విశ్లేషకులు అభివర్ణిస్తారు. అయినప్పటికీ మళ్ళీ ఆ పాత ఆరోపణలనే కొత్తగా తెరమీదికి తీసుకురావడం, ఇప్పుడు జరిగిన సంఘటనలతో వాటిని ముడిపెట్టడం లాంటి వ్యవహారాలు కొనసాగిస్తుండడం చర్చనీయాంశమవుతోంది.

ముఖ్యంగా జనగన్‌కు వెన్నుదన్నుగా ఉన్న సామాజికవర్గాలను దూరం చేసే విధంగా చర్చాగోష్టులు, బ్యానర్‌ కాలమ్‌ వార్తలు వస్తుండడాన్ని ఎత్తి చూపుతున్నారు. సంక్షేమ పథకాల ఊపులో ప్రజల మనస్సుల్లో చెరగని ముద్రవేస్తున్న జగన్‌ ప్రతిష్టను మసకబార్చడానికే ఇటువంటి విష ప్రచారాలను కొనసాగిస్తున్నారన్న అభిప్రాయం బలంగా విన్పిస్తుంది. నమ్మకమైన వార్తలు లేకపోతే సదరు మీడియా సంస్థ ప్రజల విశ్వాసాన్ని కోల్పోతుంది. ఇటీవలి కాలంలో మీడియా సంస్థల రీడబులిటీ, టీఆర్‌పీ రేటింగ్‌లను పరిశీలిస్తే ఇటువంటి అసత్య, అర్ధసత్య ప్రచారాలు చేసే సంస్థల రేటింగ్స్‌ దారుణంగా పడిపోయాయన్నది బహిర్గతమవుతోంది. అయినప్పటికీ సదరు సంస్థలు ప్రతిపక్ష పార్టీల అండతో అసత్యం, అర్ధసత్య ప్రచారాలకు పూనుకోవడం వాటిని వీక్షించేవారిని అవమానించడమేనని చెప్పాల్సి ఉంటుంది. ప్రజల్లో మహావృక్షంగా ఎదురుగుతున్న జగన్‌ను ఎదుర్కొనేందుకు (ఆరోపణలనే) ఆముదం చెట్టునే మహావృక్షంగా భావిస్తున్న ప్రతిపక్షాలు భవిష్యత్తులో ఏ విధంగా ఎదుర్కొంటాయో వేచి చూడాల్సిందే.

Show comments