Omicron – ఒమిక్రాన్ వేరియంట్ కోవిడ్: వ్యాప్తిలో వేగము , తీవ్రతలో మందము

దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ వేరియంట్ కోవిడ్ ని గుర్తించిన 19 రోజుల తర్వాత ఈ వేరియంట్ యొక్క లక్షణాలు కొన్ని తెలిసొచ్చాయి. ఆ దేశంలో డిసెంబర్ 12న రికార్డు స్థాయిలో 37 వేల మంది కోవిడ్ బారిన పడ్డారు. కాగా 15 మంది చనిపోయారు. ఈ ఏడాది జనవరి 19న అత్యధికంగా 819 మంది చనిపోయారు. ప్రస్తుతం ప్రతి యాభై ఐదు గంటలకు ఒమిక్రాన్ వేరియంట్ కోవిడ్ సోకుతున్న వారి సంఖ్య రెట్టింపు అవుతున్నది.

కాగా గ్రేట్ బ్రిటన్ లో కేవలం కొన్ని వందల మంది ఒమిక్రాన్ వేరియంట్ కోవిడ్ కి గురైనప్పటికీ ఒకరు చనిపోవడంతో కొంత ఆందోళన నెలకొంది. దక్షిణాఫ్రికాలో ఆక్సిజన్ అవసరం, ఇంటెన్సివ్ కేర్ వరకూ వెళ్లడం, మరణాలు సంఖ్య బాగా తగ్గాయి. దీనితో కొరోనావైరస్ 2019 డిసెంబర్ ముందు నాటి స్థితికి మరలుతున్నదా అనే అంచనాలకు ఆ దేశపు నిపుణులు వస్తున్నారు. ఆ దేశంలో ప్రస్తుతం ఒమిక్రాన్ వేరియంట్ కోవిడ్ రోగులు ఇబ్బడిముబ్బడిగా పెరగడంతో థర్డ్ వేవ్ గానే పరిగణిస్తున్నారు ఇదే ధోరణి కొనసాగితే, ఫోర్త్ వేవ్ అంటూ గనుక వస్తే గిస్తే అది 2019 ముందునాటి కొరోనావైరస్ కలుగచేసే సాధారణ ఫ్లూ – జలుబు గానే ఉంటుందని నిపుణులు ఆశాభావం గా ఉన్నారు.

అయితే అమెరికాలో మాత్రం ఇప్పటికీ డెల్టా వేరియంట్ కోవిడ్ కొనసాగుతున్నది. అనగా కొరోనావైరస్ ఎక్కడికక్కడే మార్పులు చెందుతూ ఉంటుంది. దీని గమనాన్ని అంచనా వేయడం కష్టమే. మన ప్రాంతంలో ఈ వైరస్ మార్పులు ఏ విధంగా ఉండబోతున్నాయో చెప్పలేము. ఇప్పటికే తీసుకున్న కొరోనావైరస్ వ్యాక్సిన్ రాబోయే వేరియంట్స్ కి పనిచేసే అవకాశం తక్కువ. అయితే జనంలోకి వచ్చినప్పుడు అందరూ తప్పనిసరిగా మాస్క్ ధరించడం మూలంగా వైరస్ ఇన్ఫెక్షన్ బాగా తగ్గుతుంది. అనగా దాదాపుగా సహజమైన వ్యాక్సినేషన్ జరుగుతుంది. ఇదే అపురూపమైన వ్యాధినిరోధక శక్తిని ఇస్తుంది.

బ్రిటన్లో ఇప్పటికే 90% పైగా రెండు డోసులు, 40 శాతం పైగా ప్రజలు బూస్టర్ డోసు తీసుకున్నారు. కాగా ఒమిక్రాన్ వేరియంట్ కోవిడ్ గురించి బ్రిటన్లో భయాందోళనలతో ఉంటే… దక్షిణ ఆఫ్రికా దాదాపుగా నాలుగో వంతు ప్రజలు మాత్రమే రెండు డోసుల కొరోనా వాక్సిన్ తీసుకొని, ఎక్కువగా సహజమైన వ్యాధినిరోధకత పొందారు. దక్షిణ ఆఫ్రికా వైద్య నిపుణులు మాత్రం కొరోనావైరస్ వారస కణాలలోని ప్రస్తుత మార్పులు మంచికే అంటున్నారు.

ఏతా వాతా చెప్పొచ్చేదేమిటంటే, మాస్క్ వాడటం తప్పనిసరి. మన దేశంలో కూడా ఒమిక్రాన్ వేరియంట్ కోవిడ్ విస్తృతంగా వ్యాపిస్తుందా… లేకపోతే మన దేశంలోనే పుట్టుకొచ్చిన ప్రమాదకరమైన డెల్టా వంటి వేరే కొత్త రూపంలోకి మారుతుందో చెప్పడం సాధ్యం కాదు. అందుకే కోవిడ్ పీడ సమసి పోయేవరకూ జాగ్రత్తగా ఉండాలి. అప్రమత్తత, మాస్క్ జీవితంలో భాగం కావాలి.

Written By :

 డాక్టర్ యనమదల మురళీకృష్ణ, ఎండీ, కాకినాడ, 14 డిసెంబర్ 2021. 

Show comments