భర్త ఇంట్లో టాయిలెట్ లేదని నవవధువు ఆత్మహత్య

ఈ రోజుల్లో పెళ్లి చేసుకునే అమ్మాయిలు అత్తింట్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయా? లేవా? భర్త సంపాదన ఎలా ఉంటుంది? పెళ్లిచేసుకుని అత్తింటికి వెళ్లాక ఏ సమస్య లేకుండా భర్త చూసుకుంటాడా? ఇలా అన్ని చూసుకుంటున్నారు. ఇవన్నీ సర్వసాధారణమయ్యాయి. ముఖ్యంగా టాయిలెట్స్ లేని ఇంటికి కోడలిగా వెళ్లేందుకు ఎవరూ అంగీకరించడం లేదు. అలా భర్తతో కలిసి తాను నివసించాల్సిన ప్రదేశంలో టాయిలెట్ లేని కారణంగా ఓ నూతన వధువు బలవన్మరణానికి(Suicide) పాల్పడిన ఘటన తమిళనాడు(Tamilnadu)లో చోటు చేసుకుంది.

తమిళనాడు కడలూరు జిల్లాలోని అరిసిపెరియకుప్పం గ్రామానికి చెందిన రమ్య(27) ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తోంది. ఏప్రిల్ 6వ తేదీన రమ్యకు కార్తికేయన్ అనే వ్యక్తితో వివాహం (Marriage) అయింది. కాపురానికి వెళ్లే సమయంలో భర్త ఉంటున్న ఇంటిలో అన్ని వసతులు ఉన్నాయా లేవా అని ఆరా తీయగా అక్కడ మరుగుదొడ్డి(Toilet) లేదని తెలిసింది. దాంతో కొత్తగా కాపురానికి వెళ్లాల్సిన రమ్య తన తల్లి వద్దే ఉంటోంది.

కడలూర్ లో టాయిలెట్ వసతి ఉన్న ఇల్లు అద్దెకు చూడాలని భర్తకు తెలిపింది. దీని గురించే కొద్దిరోజులుగా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. తాను ఎంతచెప్పినా భర్త వినకపోవడంతో తీవ్రమనస్తాపానికి గురైన రమ్య సోమవారం ఇంట్లో సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఇది గమనించిన తల్లి మంజుల ఇరుగుపొరుగువారి సహాయంతో రమ్యను హుటాహుటిన కడలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించింది. మెరుగైన చికిత్స కోసం పాండిచ్చేరి లోని జిప్‌మర్‌కు తరలించగా అక్కడ చికిత్స రమ్య పొందుతూ మరణించింది. తల్లి మంజుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Show comments