Idream media
Idream media
రాజకీయ నాయకుడు, సీమ హక్కుల ఉద్యమకారులు, సాహితీవేత్త ఎంవి రమణారెడ్డి వెళ్లిపోయారు. 1979లో తొలిసారిగా ఆయన పేరు విన్నాను. ప్రొద్దుటూరులో గట్టి నాయకుడని. తరువాత TDPలో ఎమ్మెల్యే అయ్యారు. సీమ కోసం ఎన్టీఆర్‌ని నిలదీసారు. పార్టీ నుంచి వచ్చేసి రాయలసీమ విమోచన సమితి పార్టీ పెట్టి సొంతంగా పోటీ చేసారు, ఓడిపోయారు. తరువాత రాజకీయాల్లో ఆగిపోయారు. టీడీపీలో చేరినా కలిసిరాలేదు. పాపిలాన్, ప్రపంచ చరిత్ర, సినీ విశ్లేషణ పుస్తకాలు (మల్లీశ్వరి), గాన్ విత్ ది విండ్ తెలుగు అనువాదం, అనారోగ్యంలో కూడా గోర్కీ “అమ్మ”ను అనువదించారు. విపరీతమైన చదువరి.
నవంబర్ 1994లో నేను ఆంధ్రజ్యోతి కడప ఇన్‌ఛార్జ్‌గా వున్నపుడు ఆయన్ని ఇంటర్వ్యూ చేసాను. రాత్రి 8 గంటలకి రమ్మన్నారు. ఈలోగా వీరశివారెడ్డిని కలిసాం. ఫ్యాక్షన్‌లో మునిగి తేలే ఆయనకి కవిత్వం అంటే ఇష్టం. శ్రీశ్రీ కవితలు కూడా చెప్పారు. అక్కడ నుంచి ఆయన జీపులో రమణారెడ్డి ఇంటికెళ్లాం.
Also Read: మాజీ ఎమ్మెల్యే,సీనియర్ నేత ,సాహిత్య కారుడు డా.ఎం.వి .రమణారెడ్డి మృతి
గేట్‌కి కొంచెం దూరంలోనే డ్రైవర్ ఆపాడు. లోపలి వరకూ వదలమంటే రాను అన్నాడు.
“ఇది వీరశివారెడ్డి జీపు సార్, వాళ్లిద్దరికి పడదు. లోపలికొస్తే పయ్యి (ఒళ్లు) పగలగొడుతారు” అన్నాడు.
లోపల తెల్లటి బట్టల్లో వున్న రమణారెడ్డి ఆప్యాయంగా ఆహ్వానించాడు. ఇంటర్వ్యూలో రాజకీయాలు వద్దు అన్నారు. రాయలేదు కానీ ఒక ప్రశ్న అడిగాను.
“తెలుగుదేశంలోనే వుంటే మీరు టాప్ లీడర్ కదా, పార్టీ పెట్టడం పొరపాటు కదా?” అని అడిగాను.
ఆ రోజుల్లో అది అవసరం. అడిగితే కూడా రాయలసీమకి న్యాయం జరగదు. అడక్కుండా వుంటే నేరం కాదా? నో రిగ్రేట్స్. నేను చేసింది కరెక్ట్ అన్నారు.
సాహిత్యంపై ఇంటర్వ్యూ యథాతథంగా…
గంగలో మునగడం మేలు కదా!
రాష్ట్ర రాజకీయాల్లో కడప జిల్లాకు ఒక ప్రత్యేక స్థానముంది. బాంబులు, తుపాకులు సంగతి అటుంచితే, జిల్లాలోని రాజకీయ నాయకులందరూ కూడా ఉన్నత విద్యావంతులే. అందులోనూ ఎక్కువ మంది వైద్య శాస్త్రం చదివినవారు.
కడప ఎంపి వైఎస్ రాజశేఖరరెడ్డి, శాసనసభ్యులు శివరామకృష్ణారావు, మదన్‌మోహన్‌రెడ్డి, పురుషోత్తమరెడ్డి, డిఎల్ రవీంద్రారెడ్డి, జిల్లా మంత్రి మైసూరారెడ్డి , జిల్లా తెలుగుదేశం అధ్యక్షుడు తులసిరెడ్డి, ప్రొద్దుటూరు మాజీ శాసనసభ్యులు ఎంవి రమణారెడ్డి వీరంతా వైద్యశాస్త్ర పట్టభద్రులే.
డాక్టర్ ఎంవి రమణారెడ్డికి మరో ప్రత్యేకత వుంది. ఆయన సాహిత్యాభిమాని, కథా రచయిత, అనువాదకుడు, వ్యాసకర్త, పత్రికా నిర్వాహకుడు కూడా. ప్రొద్దుటూరులోని ఆయన స్వగృహంలో ఇటీవల ఆయనతో జరిపిన ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు.
Also Read:కింగ్‌మేకర్ రాయవరం మునసబు గురించి తెలుసా..?
* “పాపిలాన్” నవలను అనువాదం చేయాలని మీకెందుకు అనిపించింది?
పాపిలాన్ నవలలోని సారాంశమంతా ఒక మనిషి స్వేచ్ఛ కోసం చేసే పోరాటమే. At What cost man wants freedom. కోర్టులు, చట్టాలలోని లొసుగుల వల్ల బలైపోయిన వ్యక్తి పాపిలాన్. 1985లో నేను జైల్లో వున్నప్పుడు పావు భాగం నవలను అనువాదం చేశాను. మళ్లీ జైలుకు వెళ్లినప్పుడు చాలా భాగం పూర్తి చేశాను. ఇంకోసారి జైలుకు వెళితే నవల మొత్తం ముగించే అవకాశం దొరుకుతుందనుకుంటా (నవ్వుతూ)..
* సాహిత్యం మీద అభిరుచి ఎలా ఏర్పడింది?
మా నాన్న వ్యాపారం మీద తిరుగుతుండేవాడు. అమ్మ చాలా భక్తిపరురాలు. పురాణ కథల్లో ఆసక్తి ఆమె ద్వారానే కలిగింది. హరిసింగ్, వంకం సుబ్బన్న అనే మేష్టారులు నాకు చాలా విషయాలపై ఆసక్తి కలిగించారు. ఈ ఊళ్లో (ప్రొద్దుటూరు) ఆర్యవైశ్య లైబ్రరీ వుండేది. అక్కడికి ప్రతిరోజూ వెళ్లేవాన్ని. నేను చాలా స్పీడు రీడర్ని. రోజుకో పుస్తకాన్ని చదివేవాన్ని. శరత్, టాల్‌స్టాయ్ ఒక్కొక్కరే అయిపోయారు. చివరికి ఒక రాక్‌లో పుస్తకాలు మిగిలాయి. ఆ పుస్తకాల మీద చేయి వేసేసరికి, లైబ్రేరియన్ వచ్చి “పిల్లోడివి ఎందుకు చెడిపోతావు, అవి చలం పుస్తకాలు” అన్నాడు.
దాంతో చాలా కాలం ఆ పుస్తకాలు చదవలేదు. చివరికి ఒకరోజు చలం జోలికెళ్లాను. చలం నన్ను ప్రభావితం చేశాడు. “కంటెంట్”లో వున్న అభిప్రాయ భేదాలను పక్కన పెడితే చలం Greatest man in expression. Proseలో ఆనుకున్నది అనుకున్నట్టుగా express చేసే శక్తి చలంకి తప్ప ఎవరికీ లేదు. ఇంటర్ ప్రిటేషన్‌కి తావు లేకుండా రాసేవాడు చలం.
హైస్కూల్ స్థాయిలో చాలా గొప్ప వ్యక్తులు నాకు గురువులుగా దొరికారు. గడియారం వెంకటశేషశాస్త్రి, పుట్టపర్తి నారాయణాచార్యులు దగ్గర చదువుకోవడం నా అదృష్టం.
Also Read:కరోనా మందు ఆనందయ్య కొత్త పార్టీ?
మెడికల్ స్టూడెంట్‌గా వున్నప్పుడు (1966)లో “కవిత” అనే లిటరరీ మ్యాగజైన్ రన్ చేశాను. అది రెండు సంచికలు మాత్రమే మాత్రమే వచ్చి ఆగిపోయింది. 1967లో ప్రొద్దుటూరులో ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టాను. ఇండస్ట్రియల్ లేబర్ ఎక్కువగా పేషెంట్లుగా వచ్చే వారు. వారి పేదరికానికి , వారు గురవుతున్న దోపిడీకి చలించిన నేను, ట్రేడ్ యూనియన్ రాజకీయాల వైపు వెళ్లాను.
69 నుంచి 72 దాకా “ప్రభంజనం” అనే రాజకీయ పక్ష పత్రికను నడిపాను. దానికి నేనే ఎడిటర్. తెలుగు పత్రికల “క్యాప్షన్స్”లో కొత్తదనాన్ని ప్రవేశ పెట్టింది “ప్రభంజనం”.
*కథలు ఎప్పట్నుంచి రాస్తున్నారు?
ఒరిజనల్‌గా నేను స్టోరీ రైటర్ని కాను. గేయాలు, వ్యాసాలు రాశాను. కాని కథంటే నాకు చాలా భయం. 85లో జైల్లో వున్నప్పుడు మధ్య తరగతి సెంటిమెంట్స్ మీద ఒక కథ రాశాను. ఆ కథను ఎవరికీ చూపించే ధైర్యం లేకపోయింది. ఒకరోజు కాకతాళీయంగా ఆ కథను ఆర్టిస్ట్ చంద్ర చూశాడు. బావుందని చెప్పాడు. అయినా నాకు నమ్మకం లేదు. చివరికి కాశీపట్నం రామారావు గారు ఆ కథని చదివి ధైర్యం చెప్పారు. ఆ ధైర్యంతో మిగతావి రాశాను. ఇప్పటి వరకు మొత్తం 9 కథలు మాత్రమే రాశాను.
కథా రచయితల్లో మథురాంతకం రాజారాంగారు నాకు చాలా ఇష్టం. ఒక రకంగా ఆయనకి నేను ఏకలవ్య శిష్యున్ని.
ఇక ట్రేడ్ యూనియన్ రాజకీయాల్లో కరపత్రాలు విపరీతంగా రాశాను. ఒకసారి నేను రాసిన కరపత్రాన్ని చదివి శ్రీశ్రీ ఇంప్రెస్ అయ్యి రాష్ట్రమంతా ఆ కరపత్రాలను పంపాడు.
Also Read:స్వయంప్రక్షాళన దిశగా తెలుగు సినిమా పరిశ్రమ అడుగులేయదా?
ఒకప్పుడు విపరీతంగా పుస్తకాలు చదివిన నేను పవర్ పాలిటిక్స్‌లోకి ప్రవేశించి, సాహిత్యానికి అనివార్యంగా దూరమయ్యాను. (ఈ మాట అంటున్నప్పుడు ఆయన మొహంలో ఆవేదన కనిపించింది)
*ఇప్పుడొస్తున్న సాహిత్యం ఎలా వుంది?
ఈ మధ్య వస్తున్న సాహిత్యంలో నాకంతగా పరిచయం లేదు. జైల్లో వున్నప్పుడు “సీమ” కథలు చదివాను. చాలా బావున్నాయి.
*ఇప్పుడేమైనా రాస్తున్నారా?
తెలుగు వాక్య నిర్మాణంపైన Elementary grammar తయారు చేస్తున్నాను. మూడు వంతులు పూర్తయ్యింది. వాడుక భాషను బంధించాలనే ఉద్దేశంతో దాన్ని రాయడం లేదు. తెలుగు వాక్యం తయారు కావడానికి పునాదులు ఎట్లా వున్నాయనే విషయాన్ని మాత్రమే చెప్పదలచుకున్నాను. నాకున్న పరిధిలో ఒక పుస్తకాన్ని తయారు చేస్తే, దాని మీద ఇంకా కృషి జరుగుతుందనే ఆశ వుంది.
*రాజకీయాల గురించి మాట్లాడుకోవల్సిన వాతావరణంలో సాహిత్యం గురించి…
మంచిది, బురదలో మునిగేదానికన్నా, గంగలో మునగడం మేలు కదా! (నవ్వుతూ)