తగ్గేదేలే.. నేలకు కొట్టిన బంతిలా పైకిలేస్తా – ముద్రగడ

కాపులు, బీసీలు, దళితులు కలిసి.. రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాలని, దానిపై బ్లూ ప్రింట్‌ తయారు చేద్దామంటూ.. ఇటీవల తన ఆలోచనను లేఖ ద్వారా వెల్లడించిన మాజీ మంత్రి, కాపు ఉద్యమ మాజీ నేత ముద్రగడ పద్మనాభం.. ఆ తర్వాత తనపై వస్తున్న విమర్శలకు సమాధానం చెబుతూ తాజాగా ఓ పత్రికా ప్రకటన జారీ చేశారు. తాను చేసిన ఆలోచనపై కొంత మంది విమర్శలు చేస్తుండడంపై ముద్రగడ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఆలోచనను అడ్డుకునే హక్కు ఎవరీ లేదని, తిట్టినా తగ్గేదే లేదని ఆ ప్రకటనలో ముద్రగడ స్పష్టం చేశారు. కొట్టిన బంతి మాదిరిగా పైకి లేస్తానని పేర్కొన్నారు. కొందరు భుజాలు తడుముకుంటూ తనను విమర్శిస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారని, అలాంటి వాటికి భయపడిపోనని ముద్రగడ ఆ ప్రకటనలో స్పష్టం చేశారు.

తన ప్రయత్నాలు విఫలం లేదా సఫలం కావచ్చని, ప్రజలకు చేసే సేవలో ఎప్పుడూ తాను ఫలితం ఆశించనని ముద్రగడ పద్మనాభం పేర్కొన్నారు. రాజకీయాల్లో తాను ఎప్పుడూ ఆర్థికపరమైన అంశాలపై ఆసక్తి చూపలేదన్నారు. ఈ మధ్య రాజకీయాల్లో నల్లటి బురద రాసుకుని ఇతరులకు అంటించడం, పని చేసే వారిని దగాకోరులు, దొంగలు అని చెప్పిస్తున్నారని ముద్రగడ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా చేయడం మంచిదేనంటారా..? అని ప్రశ్నించారు. ఈ మధ్య భుజాలు తడుముకునే వారు అనేక రకాలుగా సోషల్‌ మీడియాలో బూతులు తిడుతూ పోస్టులు పెడుతున్నార ని మండిపడ్డారు. ఆఖరికి గౌరవ ప్రముఖుల గురించి ఒక మాట రాస్తే.. తప్పుగా చిత్రీకరిస్తున్నారని ధ్వజమెత్తారు. మంచిని మంచని చెప్పడం తప్పా..? అని ప్రశ్నించారు.

Also Read : బ్లూ ప్రింట్‌ తయారు చేద్దాం.. అధికారం సాధిద్దాం.. ముద్రగడ సెకండ్‌ ఇన్నింగ్స్‌ ఆరంభం

ఆలోచనలు విరమించుకోను..

తనను తిడుతూ వారు వారు పెడుతున్న పోస్టులకు బెదిరిపోతాననుకుంటున్నారేమో.. అలా బెదిరిపోవడానికి తాను ఎన్‌ఆర్‌ఐని కాదని ముద్రగడ పేర్కొన్నారు. భారతదేశంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో పుట్టానని, బంతిని ఎంత గట్టిగా కొడితే అంత స్పీడుగా పైకిలేస్తుందని ఉదహరించారు. తనకు ఉన్న బలమైన ఆలోచనలను మీరు మీరు తిడుతున్నారని వదలిపెట్టుబోనని, ఎవరి కోసం త్యాగం చేయబోనని ముద్రగడ స్పష్టం చేశారు. తన న్యాయమైన ఆలోచనలు, అభిప్రాయాలు అమలు చేయవద్దని చెప్పడానికి ఎవరికీ హక్కులేదన్న ముద్రగడ.. రాజకీయ పార్టీ ఏర్పాటు విషయంలో వెనక్కి తగ్గబోనని విష్పష్టంగా తెలిపారు.

Show comments