Idream media
Idream media
మన్ కీ బాత్ పేరుతో ప్రతీ ఆదివారం ప్రధానమంత్రి నరేంద్రమోడీ దేశ ప్రజలతో మాట్లాడుతుంటారు. “మనసులో మాట” పేరుతో నిర్వహించే ఈ కార్యక్రమం ద్వారా తన దృష్టికి వచ్చే సమస్యలపై మోడీ స్పందిస్తుంటారు. అలాగే దేశాభివృద్ధికి తాము చేస్తున్నవి వివరిస్తూ, ప్రజలు ఏం చేయాలో కూడా మోడీ చెబుతారు. అయితే ఈ వారం మన్‌కీ బాత్‌లో ప్రధాని ఆసక్తికర విషయం వెల్లడించారు. కోటి మందికిపైగా పిల్లలు పోస్టు కార్డుల ద్వారా తమ ‘మనసులో మాట(మన్‌కీ బాత్)’ను తనకు పంపించారని వివరించారు. వారి కోరిక తీర్చేందుకు పనిచేస్తానని కూడా మోడీ తెలిపారు.
పిల్లలు ఏం కోరారంటే..
అవినీతిరహిత భారతదేశం కావాలని మెజార్టీ పిల్లలు మోడీకి రాసిన పోస్టుకార్డులో పేర్కొన్నారట. 2047 నాటికి అవినీతి రహిత భారతదేశాన్ని చూడాలనుకొంటున్నట్టు ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ బాలిక రాసిందని మోడీ వివరించారు. దేశ భవిష్యత్తు కోసం కొత్త తరం యొక్క విస్తృత, సమగ్ర దృక్పథాన్ని ఈ పోస్టుకార్డులు తెలియజేస్తున్నాయన్నారు. అవినీతి అనేది చెదపురుగు లాంటిదని, అది దేశాన్ని డొల్లగా చేసేస్తుందని ప్రధాని మోదీ చెప్పారు. సాధ్యమైనంత త్వరగా అవినీతి నుంచి దేశానికి విముక్తి కలిగించేందుకు ప్రజలంతా కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.
‘అవినీతి రహిత భారతదేశం గురించి నీవు మాట్లాడావు. అవినీతి అనేది ఓ చెదపురుగు లాంటిది. అది మొత్తం దేశాన్నే డొల్లగా చేసేస్తుంది. అవినీతి అంతానికి 2047 వరకు ఎందుకు వేచి ఉండాలి. ఇది దేశ ప్రజలంతా చేయాల్సిన పని. యువత కలిసికట్టుగా కృషి చేయాలి. సాధ్యమైనంత త్వరగా సాధించాలి. అందుకే మన విధులకు ప్రాధాన్యం ఇవ్వాలి. విధుల పట్ల బాధ్యతగా, విధులే సుప్రీంగా వ్యవహరించే చోట అవినీతి ఉండదు’ అని మోడీ పేర్కొన్నారు. ఇండియా గేట్ వద్ద ఉండే ‘అమర్ జవాన్ జ్యోతి’ని ఇటీవల జాతీయ యుద్ధ స్మారకం వద్దనున్న జ్యోతిలో విలీనం చేయడాన్ని కూడా మన్‌కీ బాత్‌లో మోడీ ప్రస్తావించారు. ‘ఇండియా గేట్ వద్ద ఉండే అమర్ జవాన్ జ్యోతిని జాతీయ యుద్ధ స్మారకం వద్దనున్న జ్యోతిలో విలీనం చేయడాన్ని మనం చూశాం. ఆ ఉద్వేగభరిత క్షణాల్లో అనేకమంది దేశ ప్రజలు, అమర జవాన్ల కుటుంబీకులకు కన్నీళ్లు వచ్చాయి’ అని తెలిపారు.
Also Read : థాంక్యూ సీఎం సార్.. ఏపీలో సంబరాలు..