Idream media
Idream media
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనకు దేశ వ్యాప్తంగా గుర్తింపు దక్కుతోంది. ఆయన తీసుకొచ్చిన నూతన సంస్కరణలకు, ఆలోచనా విధానాలకు ప్రముఖుల ప్రశంసలు దక్కుతున్నాయి. ప్రజలవద్దకే పాలనను తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థ, అనతికాలంలోనే ఉద్యోగాల కల్పన, అన్నింటికీ మించి సంక్షేమ పథకాలు, కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా నేరుగా లబ్దిదారుల ఖాతాల్లోకే నగదు బదిలీ, వెనుకబడిన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి వంటి నిర్ణయాలు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. ప్రజల్లో జగన్ ఖ్యాతిని పెంచుతున్నాయి.
అలాగే.. పరిస్థితులకు అనుగుణంగా చర్యలు చేపట్టడంలో కూడా జగన్ ముందువరుసలో ఉంటున్నారు. కరోనా కాలంలో నిర్ధారణ పరీక్షలు, చికిత్సా విధానాలు, ఇప్పుడు తాజాగా ఒమిక్రాన్ నేపథ్యంలో సంబంధిత ల్యాబ్ లను అందుబాటులోకి తేవడం, ఆక్సిజన్ ఇబ్బందులు లేకుండా ముందుగానే సమకూర్చడంలో ఏపీ సీఎం చొరవ చూపుతున్నారు.
ప్రధానంగా అంటే కొత్త వైరస్ పై ప్రజల్లో తీవ్ర భయాందోళనలు ఉన్న తొలి రోజుల్లోనే అత్యధిక పరీక్షలు చేయడం ద్వారా దేశంలోనే నెంబర్ వన్ గా ఏపీని నిలిపారు. ఆయా సందర్భాల్లో సమీక్ష జరిపిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జగన్ సేవలను పలుమార్లు కొనియాడారు. అంతేకాదు.. ఏపీ విధానాలను మిగతా రాష్ట్రాలు కూడా అవలంబిస్తే మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారంటే జగన్ చర్యలను అర్థం చేసుకోవచ్చు.
కరోనా సేవలను అలా ఉంచితే.. ఇప్పుడు తాజాగా అభివృద్దిపై జగన్ అనుసరిస్తున్న విధానాలను మోడీ ప్రశంసించారు. వెనుకబడ్డ జిల్లాల్లో అభివృద్ధిపై వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు, కేంద్రమంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, కలెక్టర్లు తదితరులతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిన్న వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయం నుంచి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లకు కీలక దిశానిర్దేశం చేశారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ఏపీ సీఎం తీసుకున్న చొరవ అభినందనీయం అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. యువ అధికారులను సుదీర్ఘకాలం నియమించి జిల్లాల అభివృద్ధికి తోడ్పడుతున్నారన్నారు.
ప్రజల భాగస్వామ్యంతోనే వెనుకబడిన జిల్లాల అభివృద్ధి వేగవంతమవుతుందన్నారు.స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడిచినా దేశంలో పలు జిల్లాలు చాలా వెనుకబడి ఉన్నాయన్నారు. ఈ జిల్లాల అభివృద్ధికి ఎదురవుతున్న సమస్యలను తొలగించాలని, సాంకేతికత, సృజనాత్మకతతో అభివృద్ధిని పరుగులు పెట్టించాలని ప్రధాని మోడీ పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సూచించారు.