ఉగాది పర్వదినాన.. జమ్మలమడుగు అధికార పార్టీలో స్నేహరాగం

తెలుగు నూతన సంవత్సరం రోజున వైఎస్సార్‌ కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో అధికార పార్టీ నేతల మధ్య స్నేహగీతిక మొదలైంది. కొంత కాలంగా ఎమ్మెల్యే సుధీర్‌ రెడ్డి, మాజీ మంత్రి రామ సుబ్బారెడ్డిల మధ్య వర్గపోరు సాగుతున్న విషయం తెలిసిందే. ఇరువురు పోటాపోటీగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తుండడంతో వైసీపీ అధిష్టానానికి సమస్యగా మారింది. 2024 ఎన్నికల్లో ఎవరు పోటీ చేయాలన్నదే సమస్యకు ప్రధాన కారణం కాగా.. దీనికి వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ చెక్‌ పెట్టారు.

రామసుబ్బారెడ్డి, సుధీర్‌రెడ్డిల మధ్య సత్సంబంధాలు నెలకొనేలా.. సమస్యకు శాశ్వతప్రాతిపదికన, ఇరువురికి ఆమోదయోగ్యమైన పరిష్కారం వైసీపీ అధిష్టానం చూపింది. ఇటీవల రామసుబ్బారెడ్డిని పిలిపించుకున్న వైఎస్‌ జగన్‌.. ఆయనకు ఎమ్మెల్సీ పదవి హామీ ఇచ్చారు. 2024 ఎన్నికల్లో మళ్లీ సుధీర్‌ రెడ్డినే పోటీ చేస్తారని నిర్ణయించారు. ఎమ్మెల్సీ హామీ ఇవ్వడంతో రామసుబ్బారెడ్డితోపాటు ఆయన వర్గం చల్లబడింది. ఇరువురు కలసి పని చేసి పార్టీని మరింత బలోపేతం చేయాలని వైసీపీ అధిష్టానం దిశానిర్ధేశం చేసింది.

సమస్య పరిష్కారం కావడంతో.. ఎమ్మెల్యే సుధీర్‌ రెడ్డి, ఎంపీ అవినాష్‌ రెడ్డితో కలసి ఈ రోజు ఉగాది పర్వదినాన రామసుబ్బారెడ్డి ఇంటికి వెళ్లారు. ఆయన ఆతిధ్యాన్ని స్వీకరించారు. తాజాగా పరిణామంతో జమ్మలమడుగు వైసీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. నాలుగు గోడల మధ్య కుదిరిన సయోధ్యపై ఉన్న అనుమానాలు ఎమ్మెల్యే సుధీర్‌ రెడ్డి.. రామసుబ్బారెడ్డి ఇంటికి వెళ్లడంతో పటాపంచలయ్యాయి.

2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున ఆదినారాయణ రెడ్డి, టీడీపీ తరఫున రామసుబ్బారెడ్డిలు పోటీ చేశారు. గెలిచిన ఆదినారాయణ రెడ్డి టీడీపీలోకి ఫిరాయించి మంత్రి అయ్యారు. ఆది టీడీపీలో చేరడంతో వైసీపీ పగ్గాలు మూలే సుధీర్‌ రెడ్డి చేపట్టారు. 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున సుధీర్‌ రెడ్డి, టీడీపీ తరఫున రామసుబ్బారెడ్డి పోటీ చేశారు. సుధీర్‌ రెడ్డి గెలుపొందారు. ఆదినారాయణ రెడ్డి టీడీపీ తరఫున కడప లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేసి వైఎస్‌ అవినాష్‌ రెడ్డి చేతిలో ఓడిపోయారు.

2019 ఎన్నికల తర్వాత మారిన రాజకీయ పరిణామాల్లో రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరారు. ఆదినారాయణ రెడ్డి బీజేపీ పంచన చేరారు. ఇటీవల జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో వైసీపీ, బీజేపీ మధ్యనే పోటీ నెలకొంది. టీడీపీ ఉనికి గల్లంతయింది. ప్రస్తుతం రామసుబ్బారెడ్డి, సుధీర్‌ రెడ్డిల మధ్య నెలకొన్న బేధాభిప్రాయాలు కూడా సమసిపోవడంతో జమ్మలమడుగులో వైసీపీ మరింత బలోపేతం కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఆదినారాయణ రెడ్డి బీజేపీలో ఉండడంతో.. ఈ నియోజకవర్గంలో టీడీపీ దాదాపుగా కనుమరుగైనట్లై.

Also Read : జమ్మలమడుగు మీద క్లారిటీ ఇచ్చిన సజ్జల

Show comments