Idream media
Idream media
ఇళ్ల స్థలాల పేరుతో అధికార పార్టీ నేతలు అవినీతికి పాల్పడుతున్నారని, లబ్ధిదారులు వద్ద డబ్బులు వసూలు చేస్తున్నారంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు చేస్తున్న విమర్శలకు వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తిప్పికొట్టారు. కొద్దిసేటి క్రితం మీడియాతో మాట్లాడిన కన్నబాబు.. అత్యంత పారదర్శకంగా గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఇళ్ల స్థలాలకు దరఖాస్తులు స్వీకరిస్తుంటే డబ్బులివ్వాల్సిన పరిస్థితి ఎక్కడ ఉందని ప్రశ్నించారు. దరఖాస్తు చేసుకోలేకపోతే.. మళ్లీ సమయం కూడా ఇస్తున్నామని, జాబితా గ్రామ, వార్డు సచివాలయాల్లో పెట్టి.. సోషల్ ఆడిట్ కూడా చేస్తోందన్నారు. ఇంత పారదర్శకంగా చేస్తుంటే చంద్రబాబు రాళ్లు వేయడం సరికాదన్నారు.
చంద్రబాబు హయాంలో ఇళ్ల స్థలాలు, ఇళ్లు పేరు చెప్పి మోసం చేయని వర్గం ఏమైనా ఉందా..? అని కన్నబాబు ప్రశ్నించారు. జర్నలిస్టులకు డబుల్ బెడ్ రూం ఇళ్లు అంటూ చెప్పారా..? లేదా..? అని విలేకర్లను ప్రశ్నించారు. వారు, వీరు అని తేడా లేకుండా బూటకపు హామీలు, అబద్ధపు మాటలతో ప్రతి ఒక్క వర్గాన్ని చంద్రబాబు మోసం చేశారని కన్నబాబు మండిపడ్డారు.
చంద్రబాబుతోపాటు బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై కూడా మంత్రి కన్నబాబు ఫైర్ అయ్యారు. చంద్రబాబు ఏమి మాట్లాడితే.. కన్నాలక్ష్మీ నారాయణ కూడా అదే మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఆయన బీజేపీ అధ్యక్షుడా.. కదా.. అనే సందేహం వస్తోందన్నారు. విమర్శలు చేసే ముందు ఒకసారి అన్ని విషయాలు తెలుసుకోవాలని హితవు పలికారు. పత్రికలు కూడా సమగ్ర సమాచారం ప్రజలకు అందివ్వాలని సూచించారు.