రాయదుర్గంలో వ‌ల‌స‌ప‌క్షి

రాయదుర్గంలో వ‌ల‌స‌ప‌క్షి

ఎండాకాలం వ‌స్తే రాయదుర్గానికి ఒక వ‌ల‌స‌ప‌క్షి వ‌చ్చేది. ఎక్క‌డో గోదావ‌రి జిల్లాల నుంచి ఐస్‌బండి లాగ‌డానికి వ‌చ్చేవాడు. పేరు స‌త్య‌నారాయ‌ణ‌. వ‌దులుగా వుండే అంగీ, ఖాకీ నిక్క‌ర్ వేసేవాడు. పిల్ల‌లంద‌రిలో సంబ‌రం తెచ్చేవాడు. ఐస్‌క్రీం అంటే పుల్ల ఐస్‌క్రీమ్ మాత్ర‌మే అనుకునే అమాయ‌కులం మేం. ఐస్‌కి సెకెండ్ వెర్ష‌న్ చూపించ‌డానికి ఈ బండి వ‌చ్చేది. రంగు నీళ్ల సీసాల‌ని చుట్టూ పేర్చుకుని గంట మోగిస్తూ వ‌చ్చేది.

ల‌క్ష్మీ బ‌జారులో వేప చెట్టు కింద వుండేది. ఐస్ గ‌డ్డ‌లు బ‌ళ్లారి నుంచి బ‌స్సులో వ‌చ్చేవి. వ‌రి పొట్టులో వ‌చ్చిన గ‌డ్డ‌ని చిన్న ముక్క‌లుగా కోసి, బండిలో తెచ్చేవాడు. చెక్క‌కి తోప‌డా తీసిన‌ట్టు ఆ ఐస్ ముక్క‌ని బ‌ర‌బ‌రా జివిరేవాడు. ఐదు పైస‌ల‌కి చిన్న క‌ప్పులో ఐస్ తుర‌ము రంగు నీళ్ల‌తో వ‌చ్చేది. శాక‌రిన్ నీళ్ల‌వ‌ల్ల తీయ‌గా ఐస్ చ‌ల్ల‌గా . ప‌ది పైస‌ల‌కి ష‌ర్బ‌త్‌. ఐస్‌కి, రంగునీళ్లు ఎక్కువ క‌లిపి ఒక గ్లాస్‌లో ఇస్తే అది ష‌ర్బ‌త్‌.

స‌త్య‌నారాయ‌ణ ఎప్పుడూ న‌వ్వుతూ వుండేవాడు. స్టేట్‌బ్యాంక్ ప‌క్క సందులో చిన్న‌గుడిసెలో ఆయ‌నా, ఇద్ద‌రు త‌మ్ముళ్లు వుండేవాళ్లు. త‌మ్ముడు బ‌స్టాండ్ ద‌గ్గ‌ర‌, ఇంకొక‌డు బ‌ళ్లారి రోడ్డులో వ్యాపారం. ఐదు, ప‌ది పైస‌ల కాలంలో రోజంతా అమ్మితే పాతిక రూపాయ‌ల బిజినెస్ అయ్యేదేమో. గోదావ‌రి జిల్లాలు మంచి పంట‌లు అనేవాళ్లు. మ‌రి ఆయ‌న బ‌త‌క‌డానికి ఈ మారుమూల ఎందుకొచ్చే వాడో తెలీదు.

పిల్ల‌లంతా ఇష్టంగా తినేవాళ్లం. రంగునీళ్లు ఆరోగ్యానికి హానిక‌ర‌మ‌ని తెలియ‌దు. చెప్పేవాళ్లు కూడా లేరు. ఎండ‌లొస్తే ఈ బండి కోసం ఎదురు చూసేవాళ్లం. ఠంచ‌న్‌గా వ‌చ్చేవాడు. 76లో ఆ వూరు వ‌దిలేసాను. త‌ర్వాత ఐస్‌క్రీంలు మారిపోయాయి. 80 త‌ర్వాత సత్య‌నారాయ‌ణ మ‌ళ్లీ రాలేద‌ని తెలిసింది.

ఇత‌ను కాకుండా క‌రీం అని ఒకాయ‌న సైకిల్ మీద పుల్ల ఐస్ అమ్మేవాడు. ఎంత క‌ష్ట‌జీవి అంటే వుద‌యాన్నే నాన్ రొట్టి (బ్రెడ్‌) అమ్మేవాడు. ఎండాకాలంలో ఐస్, మిగిలిన రోజుల్లో ప‌ళ్ల‌పొడి. సంత‌రోజుల్లో సోన్ పాపిడి. ఇల్లు జ‌ర‌గాలంటే అత‌నెప్పుడూ రోడ్డు మీదే వుండేవాడు.

స్కూల్ ద‌గ్గ‌ర ఇద్ద‌రు ముస‌ల‌మ్మ‌లు పుచ్చ‌, క‌ర్బూజ ముక్క‌లు అమ్మేవాళ్లు. ఈగ‌లు ముసురుతున్నా తినేవాళ్లం.

వీళ్లెవ‌రూ ఇపుడు బ‌తికుండే అవ‌కాశం లేదు. బ‌తుకు కోస‌మే ఈ ప‌ని చేసినా బాల్యాన్ని చ‌ల్ల‌గా చూసిన వాళ్లు. ఎండ‌లొస్తే గుర్తొస్తారు.

Show comments