Metro sridharan – 90 ఏళ్ల వయసులో సీఎం అభ్యర్థిగా పొలిటికల్ ఎంట్రీ..8 నెలలకే రిటైర్‌మెంట్

దక్షిణాదిన బలపడేందుకు బీజేపీ చెయ్యని ప్రయత్నం లేదు.కన్నడనాట అధికార ఫలాన్ని రుచి చూసిన కమలం పార్టీకి మిగతా దక్షిణాది రాష్ట్రాలలో అధికారం అనేది అందని ద్రాక్ష పండులా తయారైంది.ఇక తాజాగా కేరళలో తాము నమ్ముకున్న మెట్రోమ్యాన్ కాషాయ దళానికి ఝలక్ ఇచ్చాడు.

1995 మరియు 2012 మధ్యకాలంలో ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేసిన శ్రీధరన్ ‘మెట్రోమ్యాన్’ గా ప్రసిద్ధి చెందారు.గత ఫిబ్రవరిలో కేరళ శాసనసభ ఎన్నికలకు ముందు శ్రీధరన్ బీజేపీలో చేరారు. తమ పార్టీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆయననే ప్రకటించి ఓట్లు దండుకోవాలని బీజేపీ ప్రయత్నించింది.ప్రముఖ ఇంజనీరైన ఇ.శ్రీధరన్‌కు రాజకీయాలలో కనీస అనుభవం లేకపోయినప్పటికీ ఆయన వ్యక్తిగత ఇమేజ్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్న బీజేపీకి ఎన్నికల ఫలితాలు భారీ షాక్ ఇచ్చాయి. చివరకు శ్రీధరన్ కూడా ఎమ్మెల్యేగా గెలువలేకపోయారు. పాలక్కాడ్ నుండి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగిన శ్రీధరన్ 3,859 ఓట్ల తేడాతో కాంగ్రెస్ యువనేత షఫీ పరంబిల్ చేతిలో ఓటమి చవి చూశారు.

కేరళ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలైన తనకు తత్వం బోధపడిందని,దాని నుంచి ఎన్నోపాఠాలు నేర్చుకున్నానని శ్రీధరన్‌ తెలిపారు.ఈ నేపథ్యంలో ఎన్నికల్లో ఓడిపోయిన 8 నెలల తర్వాత తాను రాజకీయాల నుండి వైదొలుగుతున్నట్లు మెట్రోమ్యాన్‌ ప్రకటించి బీజేపీకి ఝలక్ ఇచ్చాడు. తన వయసు 90 ఏళ్లు అని చాలా మందికి తెలియదన్నారు. తన వయసుకు సంబంధించి తాను అడ్వాన్స్‌డ్ స్టేజ్‌లో ఉన్నానని ఆయన చెప్పారు.ఇక క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను అంటే దాని అర్థం రాజకీయాలను వదిలిపెడుతున్నట్లు కాదని శ్రీధరన్‌ వ్యాఖ్యానించడం కొసమెరుపు.

తాను ఎన్నికల్లో ఓడిపోయినపుడు బాధపడ్డానని చెప్పిన శ్రీధరన్ ఇప్పుడు తాను బాధపడటం లేదన్నారు. కేరళలో కమలం వికసించకపోవడానికి కారణాలు వివరిస్తూ గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ రాష్ట్రంలో బీజేపీకి 16-17 శాతం ఓట్ షేర్ ఉండేదన్నారు.కానీ ఇప్పుడు కమలం ఓటింగ్ శాతం భారీగా తగ్గిపోయిందని విశ్లేషించారు.తాను ఎమ్మెల్యేగా గెలిచిన తన ఒక్కడితో ఎటువంటి ప్రయోజనం ఉండేది కాదని ఆయన ప్రకటించారు. తాను ఎన్నడూ రాజకీయవేత్తను కానని,తాను బ్యూరోక్రాట్‌నని,ఇక మీదట రాజకీయాల్లో క్రియాశీలంగా లేనప్పటికీ,ఇతర మార్గాల్లో ప్రజలకు ఎల్లప్పుడూ సేవలందిస్తానని తెలిపారు.తనకు మూడు ట్రస్టులు ఉన్నాయని వాటి ద్వారా సొంత ప్రాంతానికి సేవ చేస్తానని పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత శ్రీధరన్ వివరించారు.

Also Read : దొంగ ఓట్లకు, దొంగ ఓట్ల రాజకీయానికి చెక్

ఇక కేరళ అసెంబ్లీలో ప్రాతినిథ్యం కూడా కోల్పోయి నైరాశ్యంలో బీజేపీ కూరుకుపోయింది.ఈ స్థితిలో శ్రీధరన్‌ క్రియాశీల రాజకీయాలకు గుడ్ బై చెప్పడం కమలం పార్టీ శ్రేణులను మరింత కుంగదీసే అవకాశం ఉంది.

Show comments